తలైవి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది… మహాభారతానికి మరోపేరు జయజీవితం… నిజమే, ఆమె జీవితంలో ఉన్న షేడ్స్ చెప్పాలంటే ఓ మహాభారతమే… అవన్నీ ఒక సినిమాలో చెప్పగలమా..? చెప్పగలగాలి… మహానటి సినిమా చూశాం కదా, సావిత్రి మరణం వరకూ ఆమె కథ ఉంటుంది… అమాయకత్వం, ఆత్మసౌందర్యం సహా ఆమె నిజతత్వం మొత్తం ఆవిష్కృతమైంది… ఆమె ఎలా విధివంచిత అయ్యిందో, చివరకు ఏమైందో చెప్పేస్తాడు కథకుడు… కానీ తలైవిలో కథకుడు విజయేంద్రప్రసాద్‌కు అది చేతకాలేదు… ఓ ప్రతిభ కలిగిన నటి, ఓ హీరోతో ప్రేమాయణం, రాజకీయాల్లోకి ఎంట్రీ, అవమానాలు, ఆమె తీర్చుకున్న ప్రతీకారం, సాధించిన గెలుపు… ఇవేనా జయలలిత జీవితం అంటే..? కాదు… ఖచ్చితంగా కాదు… జయలలిత అంటే మరో వికటరూపం కూడా ఉంది… ఆమె అవినీతి, ఆమె మూర్ఖత్వం, ఆమె ఆడంబరం, ఆమె విలాసం, ఆమె ఆస్తులు, ఆమె దత్తకొడుకు అట్టహాసపు పెళ్లి, శశికళతో అసహజబంధం, జైలుజీవితం, రాజకీయనిర్ణయాలు, ఆమె మరణం వెనుక అనుమానాలు… అసలు తలైవిలో ఏముందని..? ఏమీలేదు… ఆమె దుస్తులు, ఆమె చెప్పుల జతలు, ఆమె నగల ఫోటోలు వేసినా సింబాలిక్‌గా ఆమె జీవనశైలి చెప్పినట్టయ్యేది…
బయోపిక్‌లో నిజాలేమీ ఉండవు… అందరికీ తెలిసిందే… వీలైనంతవరకూ పాజిటివ్ అంశాల్ని రికార్డ్ చేసి వదిలేస్తారు… కానీ మరీ ఏ విరాటపర్వమో చూపించేసి, మొత్తం భారమంతా ఇంతే అనేస్తే ఎలా..? ద్రౌపది కథ చెప్పాలంటే మహాభారతం మొత్తాన్ని చెప్పాలి… కానీ చెప్పగలడా విజయేంద్రప్రసాద్..? ఆమె పట్ల విలన్‌గా కరుణానిధిని చూపగలడా..? అసలు ఆమెలోని విలనీ షేడ్స్ చెప్పగలడా..? చెబితే సినిమాను తమిళజనం నడవనిస్తారా..? అందుకని కన్వీనియెంటుగా ఆమెలోని ఒక పార్శ్యాన్ని, ఆమె కథలోని ఒక భాగాన్ని మాత్రమే హైలైట్ చేశాడు దర్శకుడు… జయలలితలోని ఓ ప్రేమమయిని చూపించాడు… ఎంజీఆర్‌తో లవ్ స్టోరీ మీదే ఫోకస్… తరువాత జనంలోకి వెళ్లడాలు, అవమానాలు అనేక రాజకీయ పరిణామాల్ని పైపైన టచ్ చేస్తూ సాగి.., మేం తోచింది చెప్పాం, మీరు చూశారు, మీ ఖర్మ అన్నట్టుగా ‘శుభం’ కార్డు వేసేస్తాడు దర్శకుడు…
Ads
సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కంగనా రనౌత్ గురించి… జయలలిత పాత్రకు కంగనా ఏమిటి అని మొదట్లో అందరూ పెదవి విరిచారు… కానీ దర్శకుడి చాయిస్ ఎంత కరెక్టో సినిమా చూస్తేనే తెలుస్తుంది… మరిచిపొండి, ఆమె ట్వీట్లు, బాలీవుడ్ మాఫియాతో ఆమె ఫైట్, ఆమె రాజకీయ ధోరణులు… మరిచిపొండి, తోటి నటులతో ఆమె వైరాలు, ఆమె టెంపర్, ఝాన్సీకీ రాణి మణికర్ణిక షూటింగ్ కథలు… ఒక్కసారి ఆమె రంగు పూసుకుని, సెట్లో పాత్రలోకి దూరిందీ అంటే… గొప్పగా పాత్రను ఆవాహన చేసుకోగలదు… జయలలితను ఆవిష్కరింపజేయడం మామూలు విషయం కాదు… కానీ కంగనా అనితరసాధ్యంగా చేసింది… బరువు పెరిగింది, తగ్గింది… ఆ డాన్సుల తీరు చూస్తే అబ్బురమే… అలాగే సినిమాల్లో చేసినప్పుడు శృంగారాన్ని ఒలికించిన పాటల్లో (చలీ చలీ) కూడా ఒదిగిపోయింది… ప్రత్యేకించి అరవింద్ స్వామి… అతను కాబట్టి ఈమె పక్కన ఆనిండేమో… కెమిస్ట్రీ భలే కుదిరింది…
అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రను హుందాగా, గౌరవంగా పోషించాడు… కొన్ని పాత్రలకు కొందరే సూటవుతారు… ఉదాహరణకు పాదయాత్ర మూవీలో వైఎస్ పాత్రకు మమ్ముట్టి సరిగ్గా సరిపోయాడు, హుందాగా చేశాడు… (ఆ మూవీ కథ కూడా ఆయన జీవితంలోని కొంత భాగమే…) సేమ్, ఎంజీఆర్ పాత్రకు అరవింద స్వామి కూడా… జయలలిత తల్లి పాత్రలో ‘నాటి దిల్కాదడ్కన్ భాగ్యశ్రీ’ పర్లేదు… నిజానికి మిగతా పాత్రలకు పెద్ద ప్రాధాన్యమే లేదు… శశికళ పాత్రలో షమా కాసిం అలియాస్ పూర్ణ ఉంది కానీ ఆ పాత్రకు పెద్ద స్కోప్ లేదు ఈ కథలో… తను ఎంచుకున్న కథను దర్శకుడు AL విజయ్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు… సరే, సినిమా బాగాలేదని కాదు, ఆమె తత్వం, ఆమె జీవితంలోని అనేక అంశాలు లేవే అనే అసంతృప్తి తప్ప… అన్నట్టు, ఈ గొప్ప ప్రేమమయి కథలో మన తెలుగు శోభన్‌బాబు పాత్ర ఏమిటి..? ఏమయ్యా, విజయేంద్రా, నీకు తెలియదా… నిజం చెప్పు…!!
Share this Article