లాభం లేదు… విజయ్ సేతుపతి మంచి నటుడే కానీ ఈ పాత్ర మరీ అడ్డదిడ్డంగా ఉంది, తనకు పేరు రాదు, పైగా ఇలాంటి పాత్రలు కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్లవుతాయి… సేతుపతికి ఆ సోయి లేదు, ఈ పాత్రతో లాభమూ లేదు…
లాభం లేదు… దర్శకుడి మరణంతో సినిమా ఆగినట్టుంది, సేతుపతి సినిమా ఆగకుండా ఉండేందుకు డబ్బు సాయం చేసినట్టున్నాడు, నిర్మాతగా తన పేరు కూడా వేయించుకున్నాడు, నిర్మాతగా కూడా సేతుపతికి ఈ సినిమా లాభం లేదు…
లాభం లేదు… హీరోయిన్ శృతిహాసన్ అందగత్తె, మంచినటి, గొప్ప సినిమా కుటుంబ నేపథ్యం… కానీ ఏం లాభం..? సినిమా స్టార్టయ్యాక ముప్పావు గంటకు వస్తుంది… ఏం చేస్తుందో తెలియదు, అర్థంతరంగా వెళ్లిపోతుంది, ఇలాంటి పాత్రలు మరో రెండు చేస్తే ఆమె కెరీర్ అంతేసంగతులు… ఆమెకు ఏ లాభమూ లేదు…
Ads
లాభం లేదు… విలన్ జగపతిబాబు… ఈ తమిళ సినిమాకు కాస్త తెలుగు మొహాన్ని తగిలించి తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకుని తీసుకున్నట్టున్నారు… జగపతి, సేతుపతి, శృతి తప్ప ఇంకెవరూ తెలుగువాళ్లకు తెలియదు… ఒకేతరహా సాల్ట్ అండ్ పెప్పర్ ఫేసుతో ఒకేతరహా లుక్కుతో, ఫీలింగ్‌తో నెట్టుకొస్తున్నాడు జగపతిబాబు… నటన అంటే అనేకానేక ఉద్వేగాల ప్రదర్శన అనే నిజం తనకు ఈరోజుకూ తెలియదేమో అనిపిస్తుంది… పైగా ఈ సినిమాలో విలన్ క్రూరుడు కాదు, తెలివైనోడు కాదు… పైగా జగపతికీ డబ్బింగే… వెరసి జగపతికీ లాభం లేదు…
లాభం లేదు… దర్శకుడు ఎస్పీ జననాథన్… పాపం, సినిమా మధ్యలోనే కాలం చేశాడు… కానీ తను ఎంచుకున్న కథ పేలవం, కథనం మరీ పేలవం… సబ్జెక్టు ఎటెటో పరుగులు తీస్తూ ఉంటుంది… రైతు బతుకులపై సినిమాను పవర్‌ఫుల్‌గా తెరకెక్కించాలంటే మరీ నారాయణమూర్తి తరహా కూడా పనికిరాదు… పలు సమస్యల్ని ఒక కథలో భాగం చేయాలే తప్ప దర్శకుడే ఏ పాత్ర ద్వారానో చెప్పించేస్తే సరిపోదు… దర్శకుడే ఈ లోకంలో లేడు కాబట్టి, లాభం, నష్టం ప్రస్తావన ఇక్కడ పనికిరాదు…
లాభం లేదు… ఇందులో ధన్సిక కూడా ఉంది… ఉందని లేటుగా తెలుస్తుంది… తెలిసేలోపు ఎందుకున్నదీ అనే సందేహం వస్తుంది, అదలా ఉండగానే సినిమా ముగిసిపోతుంది… సరైన పాత్ర దొరకాలే గానీ ఫుల్ లెంత్ హీరోయిన్‌గా చేసే సత్తా ఉన్న నటి… కానీ ఈ పాత్ర ఎందుకు చేసిందో మరి…? ఆమె కెరీర్‌కు ఏ లాభమూ లేదు…
లాభం లేదు… ఎడిటర్ అంతే, సంగీత దర్శకుడు అంతే, సినిమాటోగ్రాఫర్ అంతే… ఎవరికీ ఇంట్రస్టు లేనట్టుగా ఏదో మమ అనిపించేశారు… సో, డిస్ట్రిబ్యూటర్లకు లాభం లేదు, బయ్యర్లకు లాభం లేదు… పోనీ, ప్రేక్షకుడికి..? అసలు ఏమాత్రం లాభం లేనిదీ, పైగా కాస్త నష్టం కలిగేదీ ప్రేక్షకుడికే… వెరసి లాభం లేదు…!! ఇంతకు మించి ఏం రాసినా లాభం లేదు…!!
Share this Article