కొందరి అదృష్టానికి నిజంగా అభినందించొచ్చు… తొట్టెంపూడి గోపీచంద్ అలియాస్ గోపీచంద్ కూడా అదృష్టవంతుడే ఒకరకంగా… టి.కృష్ణ కొడుకుగా పుట్టడం తన అల్టిమేట్ అదృష్టం… రష్యాలో ఇంజనీరింగ్… (సీపీఐ బ్యాక్ గ్రౌండ్..?).. తరువాత తండ్రి వారసత్వం కొనసాగించడానికి సినీ రంగప్రవేశం… అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం హీరోగా తొలిసినిమా… తరువాత నెగెటివ్ పాత్రలు కొన్ని… ఆ తరువాత కమర్షియల్ హీరో… గోపీచంద్ టి.కృష్ణ కాడు ఇప్పుడు, ఎప్పుడూ… జస్ట్, మనకున్న చాలామంది హీరోల్లో ఒకడు… అంతే… అసలు ఎన్నేళ్లయింది తన హిట్ కొట్టి… ఒకటే ఫార్ములా, ఒకటే రొడ్డుకొట్టుడు సినిమాలు… జనం తిరస్కరించారు… ఐనాసరే, ఇంకా అవకాశాలొస్తున్నయ్, మరీ సీటీమార్ అనే సినిమాలో ఏముందని ఏడాదిన్నరగా దాచుకుని కూర్చున్నారో తెలియదు… అందుకే గోపీచంద్ అదృష్టవంతుడు, ఇలాంటి నిర్మాతలు దొరుకుతున్నందుకు..! ఆపీ ఆపీ ఇప్పుడు విడుదల చేశారు కదా, కనీసం ఈ మధ్యకాలానికి తడిసి మోపెడైన వడ్డీ డబ్బులు కూడా వస్తాయో రావో డౌటే…
ఏముంది సినిమాలో..? అదే మితిమీరిన హీరోయిజం ఉంది… దేశరాజధానిలో జాతీయ క్రీడాపోటీలకు వచ్చిన ఓ రాష్ట్ర మహిళా కబడ్డీ జట్టు మొత్తం కిడ్నాప్‌కు గురయితే హీరో ఒక్కడే ‘సూపర్ తెలుగు హీరో’ టైపులో కాపాడేస్తాడు… కాపాడాలి మరి, లేకపోతే తెలుగు హీరోయిజానికే అవమానం కదా… ఇదుగో, ఈ భావజాలం నుంచే గోపీచంద్ బయటికి రావడం లేదు, ఆ మూసను బ్రేక్ చేసుకోవడం లేదు… దేశమంతా ప్రేక్షకుల టేస్ట్ వేగంగా మారుతోంది… టీవీలు, ఓటీటీలు, వెబ్ సీరీస్… చివరకు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ కూడా దున్నేస్తున్నయ్… కొత్త కథలు వస్తున్నయ్, కొత్త ప్రయోగాలు వస్తున్నయ్, క్రియేటివిటీ పరుగులు తీస్తోంది… చివరకు రాటుదేలిన రాతిబండ కేరక్టర్లు తెలుగులో కూడా కొందరు మారుతున్నారు… కాదు, కాలం మారుస్తోంది… కానీ గోపీచంద్‌లు మాత్రం మారడం లేదు… బహుశా మరో ఒకటీరెండు సినిమాలు, స్టిల్ అలాగే ఉంటే, మారలేకపోతే జనమే మారిపోతారు, కాదు, మరిచిపోతారు…
Ads
‘సినిమా విషయానికొస్తే… ఓ విలన్ కమ్ పోలీసాఫీసర్, మరో విలన్… అంతకుముందు ఊరి విలన్… హీరో మీద ఆ విలన్ బిడ్డ లవ్వు… సేమ్, అనేకానేక సినిమాల్లో చూపించబడిన హీరోయిజమే… అప్సర ఐటం సాంగ్ కూడా ఉంది… ఓ పక్తు కమర్షియల్ సినిమా, దానికే మహిళలు- క్రీడావకాశాలు-వివక్ష అనే ఓ రంగు పూశారు అంతే… ఇదేమీ సీరియస్‌గా, నిజంగానే కబడ్డీ గురించో, మహిళల చాన్సుల గురించో, వాళ్లు ఎదుర్కునే వివక్షల గురించో చర్చించదు… అసలు కథ వేరే… ఒక హీరోయిన్ ఉంది దిగాంగన… ఈ పాత్ర ఎందుకున్నదో దర్శకుడికైనా తెలుసో లేదో పాపం… ఇక తమన్నా అనే మరో హీరోయిన్… ఈమధ్య ఎవరూ పట్టించుకోవడం లేదు… సొంత డబ్బింగ్ చెప్పుకుంది, కానీ ఆమె పలికిన తెలంగాణ భాష, యాస మరీ కృతకంగా ఉండి, చిరాకు పుట్టించింది… వాటిని రాసినోడికి, డబ్బింగ్ చెప్పించినోడికి డ్యాష్ డ్యాష్… (మాపై ఎందుకీ కక్ష తల్లీ..?)… గోపీచంద్ మంచి నటుడే, కానీ ఈ పాత్రలో తను నటించడానికి ఏముంది..? నీళ్లు తాగినంత ఈజీగా చేసిపడేశాడు…
- పాటలు సోసో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసో… నిజానికి హీరోయిన్లతో హీరోకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏమీ కుదరలేదు…
- నిజం చెప్పాలంటే ఒక పాటలో తమన్నాను చూస్తుంటే, ఆమెకన్నా అప్సర బెటర్ అనిపించింది… ఆహార్యంలో గానీ, దేహకదలికల్లో గానీ, చూపించే భంగిమల్లో గానీ..!!
- అన్నట్టు ఇందులో భూమిక కూడా ఉందండోయ్… అయిపోయింది, ఇంతకుముందు కాస్త నయం, ప్రయారిటీ ఉన్న పాత్రలు ఒకటోరెండో వచ్చేవి… ఇప్పుడిక ఆమెను పూర్తిగా అక్కావదినల పాత్రల్లోకి పంపించేశారు… నాలుగు రోజులాగండి, ఏ తెలుగు హీరోకో తల్లి పాత్ర కూడా ఇస్తారు..!!
- గోపీచంద్‌ను మాచో స్టార్ అంటారట, అనగానేమి..? క్లారిటీ దొరకడం లేదు… నిజానికి అది పలకడానికి, వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండే పదం..!!
Share this Article