ముందుగా ఒక వార్త చదువుదాం… చాలామంది పత్రికల్లో చదివే ఉండవచ్చుగాక… మరోసారి చెప్పుకుందాం… చెప్పుకోవాల్సి ఉంది… నభూతో అన్నట్టుగా వ్యవహరించిన ఈ పెద్దమనిషి గురించి చెప్పుకోవాల్సిందే ఒకసారి…
ఈయన పేరు రంజిత్ సిన్హ్ దిసాలే… తను ఒక టీచర్… మహారాష్ట్రలోని సోలాపూర్ తనది… మనకు దగ్గరివాడే… హైదరాబాద్‌కు జస్ట్ 300 కిలోమీటర్లు… తనకు ప్రిస్టేజియస్ అవార్డు దక్కింది… దాని పేరు గ్లోబల్ టీచర్ ప్రైజ్… ప్రపంచవ్యాప్తంగా టీచర్లు ఆస్కార్గా భావించే అవార్డు ఇది… సో, మన రంజిత్‌కు దక్కినందుకు ఆనందంగా చప్పట్లు కొడదాం… అభినందిద్దాం…
Ads
ఒక మిలియన్ డాలర్లు… అంటే దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు… అసలు ఎందుకు వచ్చింది ఈ అవార్డు..? అది ఓసారి చెప్పుకోవాలి…
‘‘రంజిత్ సిన్హ్ దిసాలే వంటి టీచర్లు వాతావరణ మార్పుల వంటి సమస్యలకు పరిష్కారం చూపగలరు… ప్రశాంతమైన సమాజాన్ని నిర్మించగలరు… సమాజంలో అసమానతలను రూపుమాపి, ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందించగలరు… ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటివారు మన భవిష్యత్తునే మార్చగలరు….’’ ఇవీ యునెస్కో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ ఎడ్యుకేషన్ స్టెఫానియా జియాన్నిని చెప్పిన మాటలు…
ఈ నగదు బహుమతి కోసం 140 దేశాల నుంచి మొత్తం 12,000 మంది పోటీ పడ్డారు. తుది దశ ఎంపికలో మొత్తం 10 మంది నిలవగా… రంజిత్ సిన్హ్ అంతిమవిజేతగా నిలిచాడు… భారత ప్రతిష్టను చాటాడు… ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డును ‘వర్కే ఫౌండేషన్’ ఏటా అందజేస్తోంది. 2020 సంవత్సరానికి సంబంధించిన ఎంపిక కార్యక్రమం లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో గురువారం (డిసెంబర్ 3) జరిగింది…
ఇంతకీ ఈ గురువు ఏం చేశాడు..?
రంజిత్ సిన్హ్ దిసాలే… మహారాష్ట్రలోని సోలాపుర్ జిల్లా, పరిదేవాడి గ్రామంలో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు… 32 ఏళ్లు… తనకు తన వృత్తి అంటే ప్యాసన్… అందుకే ఇష్టంగా చేస్తాడు… పాఠాలు బోధించడంలోనూ ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తుంటాడు… ఆ తపనే తనను ఈరోజు ‘ప్రపంచం మెచ్చిన గురువు’గా నిలిపింది… టీచర్‌గా రంజిత్ సిన్హ్ అడుగుపెట్టినప్పుడు ఆ ప్రభుత్వ పాఠశాల గోదాం, గోశాల మధ్య ఓ అధ్వాన్న స్థితిలో ఉంది… శిథిలావస్థలో ఉన్న ఆ బడి భవనాన్ని బాగు చేయించాలని సంకల్పించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు… దీంతో పాటు పాఠాలను మాతృ భాషలోకి తర్జుమా చేసి, వాటిని క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చాడు… ఆడియో, వీడియో, కథల రూపంలో పాఠాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు… మంచి ఫలితాలు రాబట్టాడు… అంతేకాదు…
పాఠశాలలో బోధన చేస్తూనే.. గ్రామస్థులతో ఒకడిగా కలిసిపోయాడు రంజిత్ సిన్హ్… గ్రామంలో బాల్య వివాహాలను నిర్మూలించాడు… అమ్మాయిలు 100 శాతం పాఠశాలకు హాజరయ్యేలా చొరవ తీసుకున్నాడు… వారాంతాల్లో విద్యార్థులను సమీప ప్రాంతాలకు, వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లి… సహజ వనరులు, సమాజం పట్ల అవగాహన కలిగించాడు…
అసలు చెప్పుకోదగిన వార్త ఇదే కాదు… బియాండ్ ది స్టోరీ ఇంకా ఉంది… అదేమిటీ అంటే… తను తోటి గురువుల పట్ల ప్రదర్శించిన వైఖరి… హేట్సాఫ్… అవార్డు ప్రకటన వచ్చింది… అందరూ ఆనందించారు… కానీ ఆశ్చర్యకరంగా రంజిత్ ఓ ప్రకటన చేశాడు… తనకు వచ్చిన నగదు బహుమతిలో సగం తనతోపాటు ఫైనలిస్టులుగా ఉన్న 9 మందికీ ఇస్తానన్నాడు… కానీ ఎందుకు అలా..?
‘‘ఉపాధ్యాయులుగా ఆయా దేశాల్లో వారెంతో కృషి చేస్తున్నారు… సమాజానికి ఇవ్వడంలోనే వారు ఎంతో ఆనందం పొందుతారు… అందుకే ప్రైజ్ మనీని పంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను…’ ఇదీ తన ప్రకటన… వావ్… ఆ మిగిలిన సగాన్ని ఏం చేస్తాడో తెలుసా..? ఒక నిధిలా ఏర్పాటు చేసి, ఆ డబ్బును వెనకబడిన తరగతుల విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తానన్నాడు… ఇప్పుడు కొట్టాలి చప్పట్లు… తన కోసం…
ఎవరైనా సరే, ఏ పోటీ అయినా సరే, ప్రైజు మనీ గెలిచాక, కప్పు కొట్టాక, అవార్డును ముద్దాడాక… అందరూ తననే చూస్తారు, గెలుపును అందరూ ఓన్ చేసుకుంటారు… కానీ తనతోపాటు ఫినాలే దాకా వచ్చి, నిరాశగా మిగిలిపోయే వారిని ఎవరూ పట్టించుకోరు… ఒక్కసారి అనాథలు అయిపోతారు వాళ్లు… నిజానికి స్వల్పమైన తేడాయే విజేతను, పరాజితుడిని తేల్చేది… కానీ ఆ లెవల్ దాకా వచ్చారంటేనే అందరూ దాదాపు సమానులే కదా… అదుగో, తన దాకా ఫైనల్స్ దాకా వచ్చిన వాళ్లను ఒక్కసారిగా వర్చువల్‌గా అలుముకుని, ఈ ప్రైజ్ మనీని అందరమూ పంచుకుందాం బ్రదర్స్ అని ఈ టీచర్ చేసిన ప్రకటన అల్టిమేట్… అసలు ఊహించనిది… నువ్వు గ్రేట్ సారూ… సూపర్…
Share this Article