ఫేక్ రిపోర్టింగ్.. ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు… అసలు జరుగుతుందో, లేదో తెలియనిదాన్ని ఊహాజనితంగా చిత్రించి ప్రెజెంట్ చేయడం.. ఇదేదో తెలుగు మీడియాకే పరిమితమైందేం కాదు.. జాతీయ, అంతర్జాతీయస్థాయిలోనూ పొరపాటుగా మారిన అలవాటే! అందుకే ఏ ప్రాంతంవారు చూసినా… అరె, ఇది అచ్చూ మన మీడియాకు సరిగ్గా అతికినట్టు సరిపోతుందే అన్నట్టుగా జనం ఒకింత హాశ్చర్యంతో నవ్వుకుంటూ చూసే సెటైరికల్ మూవీ.. special correspondents!! ఎప్పుడో 2016లోనే విడుదలైనా.. ఏదో యాదృచ్ఛికమన్నట్టు ఒకటో, అరో కాకుండా… ఇప్పటికీ ఆ సినిమా తాలూకు ఫేక్ రిపోర్టింగ్ కంటెంట్ తోనే బులెటిన్లు, ఎడిషన్లు వెళ్లదీసే మీడియా ఇండస్ట్రీ స్వరూపానికి.. అగ్గికి ఆజ్యం పోస్తున్న నేటి సోషల్ మీడియా విస్తృతత్వానికీ ఓ నిలువెత్తు వ్యంగ్యరూపమే Special Correspondents!
ఈక్వెడార్ లో జరిగే తిరుగుబాట్లు… అక్కడి నోటిరియస్ గ్యాంగులకు సంబంధించి అంతర్జాతీయ సమాజం చర్చించుకుంటున్న వేళ… న్యూయార్క్ రేడియోలో పనిచేసే జర్నలిస్ట్ ఫ్రాంక్ బోర్నేవిల్లేను ఆయన బాస్ అక్కడికి రిపోర్టింగ్ కు వెళ్లాలంటాడు. అంతకుముందే ఫ్రాంక్ బొన్నెవిల్లే తనకుతాను పోలీసునని చెప్పుకుని.. ఒక హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కు వెళ్లి వివరాలు సేకరించడం.. ఆయనెవరో తెలుసుకున్న సిబ్బంది తిరిగి పంపించేయడం.. ఇదంతా తమ బాస్ జేఫ్రీ మల్లార్డ్ చెవిన పడి.. ఫ్రాంక్ ను గట్టిగా హెచ్చరించడం వంటివాటితో.. బాస్ కోపానికి గురవ్వడం ఇష్టం లేక.. ఫ్రాంక్ ఈక్వెడార్ ప్రయాణానికి రెడీ అయితాడు. అయితే.. ఫ్రాంక్ వెంట వెళ్లాల్సిన టెక్నీషియన్ ఫించ్ మాత్రం ముందు ససేమిరా అంటాడు. ఎందుకంటే తన భార్యతో వివాహబంధం విషయంలో అప్పటికే కొన్ని కలహాలు చోటుచేసుకుంటున్న క్రమంలో డిస్టర్బ్డ్ గా ఉన్న ఫించ్ రానంటాడు. కానీ బాస్ ఆదేశాలతో వెళ్లక తప్పదు.
Ads
ఇంకేం ఫ్రాంక్ అండ్ ఫించ్ కలిసి న్యూయార్క్ లో పాస్ పోర్ట్స్, వీసా అన్ని పనులు ముగించుకుని… ఎయిర్ పోర్ట్ బయల్దేరుతారు. కానీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లేకంటే ముందే.. అప్పటికే మూఢీగా డిస్టర్బ్డ్ గా ఉన్న ఫించ్ ఏదో చెత్తను పడేస్తున్నానుకున్న సోయిలో… అసలు పాస్ పోర్ట్స్, ఫ్లైట్ టిక్కెట్స్ అన్నీ ఎప్పటికప్పుడు చెత్తను తరలించే ఓ ట్రంక్ లో పడేయడంతో… అసలు సినిమాలో ఆసక్తికరమైన సన్నివేశాలు తెరపైకి వస్తాయి. పింఛ్ పై ఫ్రాంక్ ఎంత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినా… చేసేదేంలేక.. రేడియో స్టేషన్ కు ఎదురుగా బ్రిగిడా, డొమింగ్ అనే ఓ స్పానిష్ జంట నడిపించే కేఫ్ లో దాక్కుంటారు. అప్పటికే రెగ్యులర్ గా వెళ్తూ వారితో టచ్చుండటంతో… తమ పరిస్థితి వివరించి కాస్త ఆశ్రయమడుగుతారు. అక్కడే కేఫ్ లో పైన ఓ రూమే ఫ్రాంక్ అండ్ ఫించ్ కు ఈక్వెడార్ దేశమైపోతుంది.
అదిగో అలా మొదలవుతుంది ఈక్వెడార్ పేరిట వారి ఫేక్ రిపోర్టింగ్. ఇతర న్యూస్ ఛానల్స్, సైట్స్ నుంచి వీలైనంత సమాచారం సేకరించడం… అప్డేట్స్ ఇవ్వడం.. ఇదీ న్యూయార్క్ లో రేడియో స్టేషన్ కు ఆపోజిట్ బంగ్లాలోనే ఉండి వారు చేసే ఈక్వెడార్ లైవ్ రిపోర్టింగ్. అయితే రేడియా యాంకర్స్ గుచ్చిగుచ్చి అడిగే ప్రశ్నలతో… అప్పటికప్పుడు కొన్నిసార్లు ఏంతోచక చేసే రిపోర్టింగ్ తో పాటు… స్పాంటెనియస్ గా కల్పితాలతో చేసే రిపోర్టింగ్ వెరసి… ఈక్వెడార్ ఇష్యూ అంతర్జాతీయ సమస్యలా మారి ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి సారించాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్రాంక్, ఫించ్ కలిసి… ఎమిలియో శాంటియాగో అల్వారెజ్ అనే డమ్మీ పేరును కొత్త బందిపోటు రూపంలో తెరపైకి తీసుకొస్తారు. అతనికి ఏదో పెద్ద నేర చరిత్ర ఉన్నట్టు సీన్ క్రియేట్ చేసేవిధంగా రేడియోలో జర్నలిస్ట్ ఫ్రాంక్ రిపోర్టింగ్ సాగుతుంటుంది.
దీన్నే పట్టుకుని అంతర్జాతీయ ఛానల్స్, ఇతర మీడియా కూడా ఫ్రాంక్, ఫించ్ లకు సదరు బందిపోట్ గ్యాంగ్స్ నుంచి ప్రమాదమున్నట్టు తెలిసీ, తెలియని రిపోర్టింగ్ చేస్తుండటంతో… అప్పటికే ఫ్రాంక్ అండ్ ఫించ్ ఇద్దరూ మీడియాలోనే కాకుండా.. సమాజంలో హీరోలైపోతారు. ఈ క్రమంలో ఫ్రాంక్ అండ్ ఫించ్ బాసైన జేఫ్రీ మల్లార్డ్.. వారిని క్విటోలోని యూఎస్ ఎంబసీకి వెళ్లి రక్షణ తీసుకోవాలని సూచిస్తాడు. కానీ… ఫ్రాంక్, ఫించ్ ఉన్నది.. రేడియో స్టేషన్ కు ఆపోజిట్ లోనేనాయె! దొరికిపోరూ..? అందుకే అప్పటివరకూ ఫోన్ ద్వారా బాస్ తో.. రేడియోస్టేషన్ క్ర్యూతో సంభాషించిన ఫ్రాంక్ అండ్ ఫించ్ వారి సిమ్ కార్డులను తీసేస్తారు. పైగా తమను ఈక్వెడార్ బందిపోట్లు కిడ్నాప్ చేసినట్టుగా.. సదరు కేఫ్ నిర్వాహకులకే కిడ్నాపర్ల వేషం వేసి… ఓ వీడియో షూట్ చేసి దాన్ని ఓ పెన్ డ్రైవ్ లో కాపీ చేసి.. రేడియో స్టేషన్ ముందున్న తపాలాబాక్స్ వేస్తారు. ఇంకేం… ఆ వీడియోలో ఫ్రాంక్ అండ్ ఫించ్ ను కిడ్నాపర్స్ కట్టేసి బెదిరిస్తున్న విజువల్సుండటంతో.. అది కాస్తా మరింత ప్రచారంలోకొస్తుంది.
అదే అదనుగా అప్పటికే వివాహబంధం అంతంత మాత్రంగా మారి.. ఫించ్ ను తేలికగా తీసుకునే అతడి భార్య ఎలియనోర్ సానుభూతి పొందేందుకు యత్నించడం.. అందుకోసం ఆమె డాలర్ ఫర్ ఏ హీరో పేరిట ఓ పాట పాడి స్వచ్ఛందసంస్థ పేరిట డబ్బు సంపాదించడం.. అంతకుముందే ఫించ్ భార్య అని తెల్వని ఫ్రాంక్ ఆమెతో నెరిపిన సంబంధం.. ఒక్కసారిగా ఆమెను టీవీలో చూశాక పక్కనున్న ఫించ్ చెబితేనేగానీ ఫ్రాంక్ కు ఆవిషయం తెలియకపోవడం.. మొత్తంగా ఇలా సాగుతుంది ఈ డ్రామా. ఆ డ్రామాలో భాగంగానే తమ పేరుతో డబ్బు సంపాదించిన ఎలియనోర్ ఇంటికెళ్లి ఆమెను బెదిరించి… ముగ్గురికి మూడు వాటాలుగా డబ్బు పంచుకోవడం.. ఆ పంచుకున్న డబ్బుతో తామ ఈక్వెడార్ లో లేమనే విషయం బయటకు పొక్కకుండా ఫ్రాంక్ అండ్ ఫించ్ దక్షిణమెరికా పయనమవ్వడం.. నాన్నా పులి కథ తరహాలో అలా వెళ్లి అదే కిడ్నాపర్ల చేతికి చిక్కి.. ఆ తర్వాతేం జరుగుతుంది… వారిద్దరూ యూఎస్ కు హీరోలుగా ఎలా తిరిగివస్తారన్నదే Special Correspondents!
హైదరాబాద్ స్టూడియోలోనే ఉండి ఢిల్లీ రిపోర్టింగ్ చేయడం… ఎక్కడో కరీంనగర్ లో ఉండి పొంగిపొర్లుతున్న మోయతుమ్మెద వాగులోని వ్యక్తులు కొట్టుకుపోతుంటే లైవ్ గా చూస్తున్నట్టే ఫోన్ ఇన్ ఇవ్వడం.. స్పష్టమైన సమాచారం లేనట్టైతే ఊహజనిత అట, అనుకుంటున్నారు, ఆరోపణలెదుర్కొంటున్నారు వంటి పడికట్టు పదాలతో రిపోర్టింగ్ చేయడం… ఇలా సమకాలీన మీడియా ధోరణులకు అద్దం పడుతూ.. ఫించ్ పాత్రలో నటించిన రిక్కీ గేర్వైస్ తీసిన.. మరీ ముఖ్యంగా నేటి మీడియా వాళ్లు తప్పకుండా చూసి తీరాల్సిన సినిమా Special Correspondents!…………. రమణ కొంటికర్ల
Share this Article