మంచిని, పాజిటివిటీని, కొత్త సమాజం వైపు చైతన్యాన్ని, శాస్త్రీయతను బోధించడం అనేది మన టీవీ న్యూస్ మీడియా వల్ల కాదు… దానికెప్పుడూ సెన్సేషన్, రేటింగ్ బేస్డ్ వేషాలు కావాలి… ఇక వినోదచానెళ్లు మరీ ఘోరం… వాటి సీరియళ్లు సమాజానికి ఓ పెద్ద దరిద్రం, రకరకాల మానసిక వైకల్యాలకు కారకాలు… రేటింగ్స్, యాడ్స్ ఇవే కదా టీవీ దందాకు ఆధారం… సమాజం, జనం, మన్నూమశానం వాటికి అక్కర్లేదు… సరికదా, మనం ముందుకుపోతున్నకొద్దీ వెనక్కి లాగుతున్నయ్… ఆధునిక ప్రపంచం శాస్త్రీయత వైపు, హేతువు వైపు నడుస్తుంటే… మనిషి పాత ఛాందసాల్ని, నష్టదాయక అలవాట్లను దూరం చేసుకుంటున్నకొద్దీ ఈ టీవీ చానెళ్లు మనల్ని వెనక్కి వెనక్కి తీసుకువెళ్తుంటాయి… దీనిపై సందేహాలున్నవాళ్లు జీటీవీలో పొద్దున్నే వచ్చే రెండు ప్రోగ్రామ్స్ చూడొచ్చు… రంగురంగుల పూసల దండలు వేసుకుని విచిత్రంగా కనిపించే ఒకాయన ఫోన్ కాల్లోనే ఎదుటివాళ్ల స్థితిగతులపై జ్యోతిష్యం చెప్పేస్తాడు, నివారణ కూడా చెప్పేస్తాడు… ఆయన చెప్పే రెమెడీలు వింటుంటే జీవితం మీదే వైరాగ్యం వస్తుంది… మరొకాయన కూడా దాదాపు అంతే… అవేకాదు, ఆ టీవీలో వచ్చే సీరియళ్లలోనూ సొదెమ్మల దగ్గర్నుంచి మంత్రగాళ్లు, అఘోరా టైపు పూజారుల దాకా అనేకమంది హఠాత్తుగా దర్శనాలు ఇస్తుంటారు… అదొక నరకం… ఈ స్థితిలో అకస్మాత్తుగా మాటీవీ యాడ్ ఒకటి కనిపించింది… చక్షుర్మతి అనే ప్రోగ్రాం స్టార్ట్ చేస్తోంది అది ఉదయం పూట… నవ్వొచ్చింది… ఎందుకంటే..?
చాలామందికి పుట్టినతేదీలు గుర్తుండవు, సో, రాశులు, నక్షత్రాలు, గ్రహగతులు, గ్రహచార జ్యోతిష్యం చెప్పలేం… ఐతేనేం కళ్ల కింద కొన్ని రేఖలుంటయ్, వాటిని చూసి చెప్పేస్తాను అంటున్నాడు ఒకాయన… మీరు సరిగ్గానే చదివారు… కంటిరెప్పలు, కనుబొమ్మలు, కనుగుడ్లు కాదు… జస్ట్, కళ్ల కింద రేఖలు చూస్తాడట… రేఖలు ఉంటాయా అనే డౌట్ మనకు రావద్దు, ఎందుకంటే..? ఇప్పుడు టీవీ చానెళ్లు ఏది చెబితే అదే రైట్… ఇలాంటి జ్యోతిష్కులు ఏది చెబితే అదే రైట్… అదొక దందా… నాలుగు రోజులు నిద్ర సరిగ్గా లేకపోతే కంటికింద నల్లటి వలయాలు వస్తయ్, వయస్సు పైన బడితే ముడతలొస్తయ్, మనిషి రూపాన్ని బట్టి- అలవాట్లను బట్టి క్యారీబ్యాగులొస్తయ్… అంతకుమించి హస్తరేఖల్లాగా ఈ రేఖలేమిటో మరి..? దానికి చక్షుర్మతి అని పేరు పెట్టారు… చక్షువు అంటే కన్ను… కంటి కింద రేఖలకూ కళ్లకేం సంబంధం..? పైగా చక్షువులకు ఈ మతి ఎలా కలిసింది..? ఏమోలెండి..? ఆయన ఓ కొత్త జ్యోతిష్య శాస్త్రం ఏదో కనిపెట్టినట్టున్నాడు… (చక్షుష్మతి అని ఓ మంత్రం మాత్రం కళ్ల సమస్యల పరిష్కారం కోసం పఠిస్తారు… పూజ కూడా చేస్తారు… చాక్షుషోపనిషత్ అని అది వేరే కథ…)
Ads
బోలెడు ఉన్నయ్… ఒకరు మొహం చూస్తారు, ఒకరు చేయి చూస్తారు, కొందరు అరికాళ్లు చూస్తారు… చాలామంది పంచాంగం చూస్తారు… గ్రహసంచారాన్ని లెక్కలేస్తారు.., దానికి పుట్టినతేదీ, సమయం ముఖ్యం… ఆ లెక్కలు కూడా ఒక్కొక్కరు ఒక్కోరకంగా వేస్తారు… అదేకాదు, గవ్వలు వేసేవాళ్లు, సంఖ్యా జ్యోతిష్కులు, నాడీ జ్యోతిష్కుల దగ్గర నుంచి చిలక జోస్యాల దాకా… అనేకానేక జ్యోతిష మార్గాలున్నయ్… వీటిల్లో కొన్ని జస్ట్, వాళ్ల కడుపులు నింపుకునేవి… అదేలెండి, మన చక్షుర్మతి టైపు…! గ్రహసంచారం, నాడీజ్యోతిష్యం వంటివి చాలామంది బలంగా విశ్వసించేవి… కొందరైతే ఏదీ చూడకుండానే జస్ట్, అలా కళ్లు మూసుకుని బాధితుల భవిష్యత్తు చెప్పేస్తారు… చెప్పేవాడికి వినేవాడెప్పుడూ అలుసే కదా… రకరకాల రెమిడీలు చెప్పినా ఫలించలేదు అనుకొండి, జరిగేదాన్ని ఎవరమూ ఆపలేం కదా అంటారు… ఎస్, అన్ని వాదాలు, అన్ని విద్యలూ సంగమించే ఒకే ఒక సత్యం… ‘జరగబోయేదాన్ని ఎవరూ ఆపలేరు…! మరి ఈ జ్ఞానచక్షుర్మతి ఏం చెబుతాడు..? ఏమీలేదు, జీటీవీ వాడిలాగే పొద్దున్నే ఆధ్యాత్మికం పేరిట ఇలాంటి ఏదో ఓ ప్రోగ్రాం పెట్టాలి… యంత్రాలు, తాయెత్తులు, రుద్రాక్షలు, రాళ్లురప్పలు అమ్ముకునే ప్రోగ్రాములను చూస్తుంటాం కదా… ఇదీ అలాంటిదే ఓ మూఢవిశ్వాసాలకు పట్టం కట్టే ఓ పిచ్చి షో… అంతే…!!
Share this Article