వరి వేస్తే ఉరే… ఇక రైతుల నుంచి ఎక్కువ కొనేది లేదు… వరి మాన్పించి, రైతులను ప్రత్యామ్నాయం వైపు మళ్లించాలి… అంతా కేంద్ర సర్కారు నిర్వాకమే… ఓ ముందుచూపు లేదు, అంతర్జాతీయ ఎగుమతుల్లేవు, దొడ్డు బియ్యం, బాయిల్డ్ బియ్యం ఒక్క బస్తా కూడా కొనబోమని చెబుతున్నది…… దాదాపు ప్రతి పత్రిక పతాక శీర్షిక ఇదే… తమకు పొలిటికల్ నష్టం ఏమీ లేకుండా, బీజేపీని ఇరుకునపెట్టడానికి ఇలా నెపాన్ని కేంద్రంపైకి నెట్టేస్తున్నది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వానికి మొదటి నుంచీ వ్యవసాయం మీద- కొనుగోళ్ల మీద ఓ ప్రణాళిక లేదు… అసలు వాటి గురించే ఆలోచించేవాళ్లు ఎవరున్నారని..! ఓ దీర్ఘకాలిక వ్యూహమో, పాలసీయో ఉంటే కదా… అప్పటికప్పుడు పెద్దసారు ఏది చెబితే అదే పాలసీ… గుర్తుందా..? నియంత్రిత పంటల విధానం అంటూ ఆమధ్య ప్రచారం చేశారు, మొక్కజొన్న వేయొద్దు, బయట మార్కెట్ లేదు, రేటు రాదు అని రైతుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు… అసలు కారణం ఏమిటంటే మొక్కజొన్న కొనుగోళ్ల భారం తగ్గించుకోవడం..! పత్తి వేయండి, మన తెలంగాణ బ్రాండ్ అంటేనే సూపర్, లాంగ్ స్టేపుల్, ధరకు తిరుగులేదు అని ప్రచారం చేశారు… పత్తిని ఎలాగూ తను కొనదు కదా, మార్కెట్ శక్తుల గుప్పిట్లోకి రైతుల్ని ఇలా తరలించసాగింది… (సీసీఐ కొనుగోళ్లు అనేది మరో పెద్ద అధ్యాయం)…
ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో అధికశాతం పత్తి రైతులే, అందులోనూ కౌలు రైతులు… ఐనా పత్తి వైపే మరల్చాలట… సాగు చేయని రైతులకు కూడా ఏటా వేల కోట్ల రైతుబంధు ఇచ్చే ప్రభుత్వం కౌలు రైతులకు మాత్రం రూపాయి సాయం చేయదు… ఇదీ పాలసీ…! తీరా ఏమైంది..? పత్తి వేసి చేతులు కాల్చుకున్న రైతులు దాన్ని వేయడం తగ్గించేశారు… ఇప్పుడు పత్తి గణనీయంగా తగ్గిపోయింది… సర్కారు కిక్కుమనదు, అనలేదు… మొక్కజొన్న మళ్లీ పెరుగుతోంది… సరిపడా వర్షాల కారణంగా రాష్ట్రమంతా నీళ్లు కనిపిస్తున్నయ్, వరి పెరిగింది… ఇప్పుడు వరి రైతు ఏమైపోవాలి..? ఆమధ్య ఆయిల్ పామ్ ధూంధాం అన్నారు… ఇక రాష్ట్రంలో ఎటుచూసినా పామాయిల్ మిల్లులు, చెట్లు అన్నట్టుగా ప్రచారం జరిగింది… నిజంగా ఆయిల్‌పామ్ సాగుకు అనువైన నేలల మీద, స్థిరమైన నీటిలభ్యత మీద సర్కారులో ఏ స్థాయిలో ఎవరికీ ఓ అవగాహన ఉన్నట్టు లేదు… రాష్ట్రమంతా ఏదో రైతు సమన్వయ సమితుల నెట్‌వర్క్ అన్నారు, ఇకపై వ్యవసాయాన్ని అదే నియంత్రిస్తుంది అన్నారు.., ఏ ఊళ్లో, ఏ పొలంలో ఏ పంట వేయాలో అదే చెబుతుంది అన్నారు.., కొనుగోళ్లకు సమస్య లేదుపో అన్నారు… ఎంత సింపుల్‌గా అంటే… ఏ ఊళ్లో పండిన పసుపు వాళ్లే దంచుకుని అమ్ముకోవాలట, మిర్చిని పొడి చేసి మార్కెట్ చేసుకోవాలట… ఏమైనయ్ ఈ సమితులు..? అవును మరి… పాలకుల మాటలకు పాలితులు ఎప్పుడూ అలుసే…
మరో విషయం చెప్పుకోవాలి ఇక్కడ… మోడీ దొడ్డుబియ్యం కొనను అంటున్నాడు, అందుకే వరి వద్దు, వరి వేస్తే ఉరేసుకున్నట్టే అంటున్నారు కదా… మోడీ దుర్మార్గుడే అనుకుందాం, మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులో, ప్రజాప్రతినిధులో ఏం చేస్తున్నారు..? కేంద్రం కొనకపోతే మన రైతుల్ని ఎలా ఆదుకోవాలి అనే ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏవి..? ఎందుకు లేవు..? వేల కోట్లను రైతులకు ధారబోయడం కాదు, లాభసాటి వ్యవసాయానికి ఓ దిశను నిర్దేశించాలి, అదెందుకు చేతకావడం లేదు..? ఒక్కసారి ఈ నిల్వల పరిస్థితి చూడండి… (ఎఫ్‌సీఐ ప్రస్తుత ఆహారనిల్వలు, లక్షల టన్నుల్లో…)
Ads
మన ఆహారభద్రతకు ఉంచాల్సిన నిల్వలకన్నా దాదాపు 3.5 రెట్లు ఎక్కువ ఉన్నయ్… అంతర్జాతీయంగా బాయిల్డ్ రైస్‌కు గిరాకీ లేదు, మనకన్నా వేరే దేశాలు మంచి దిగుబడులు, నాణ్యతను సాధిస్తున్నాయి… మన దేశంలోనే ఉప్పుడు బియ్యం ఎవరూ తినడం లేదిప్పుడు… 75 లక్షల టన్నుల గోధుమలు స్టాక్ ఉంటే సరిపోయే స్థితిలో ఇప్పుడు 6 కోట్ల టన్నులున్నాయి ఎఫ్‌సీఐ దగ్గర… వాటిని ఏం చేయాలి..? ఇదే కెసిఆర్ అక్కడ ఉంటే ఏం చేసేవాడు…? FCI తాజా నిల్వల స్థితికి సరిపడా గోదాముల్లేవు.., తరుగులు, పందికొక్కులు, వర్షాలు, ఎలుకలు, డ్యామేజీ… కానీ ఒక్కటి మాత్రం నిజం… ప్రజల్ని ఆదుకోవడం అంటే మోడీకి చిరాకు… కరోనా కాలంలో కూడా ప్రజలను ఆదుకోవడానికి ఉదారంగా ఆహారనిల్వల్ని మార్కెట్‌లోకి పుష్ చేయాలనే సోయి లేకుండా పోయింది… ఎక్కువ పరిమాణంలో చేస్తే అది మార్కెట్‌లో ధరల్ని క్రాష్ చేసి, మళ్లీ నష్టపోయేది రైతులే… అందుకే జాగ్రత్తగా చేయాల్సి ఉండింది… చేయలేదు… ఇక్కడ కేసీయార్ సర్కారు ఎంతో, అక్కడ మోడీ సర్కారు కూడా అంతే కదా…!! మరేం చేయడం కరెక్టు అంటారా..? మనం ఇప్పటికీ ఆయిల్స్ దిగుమతి చేసుకుంటున్నాం… వేలకోట్ల విదేశీద్రవ్యం వెచ్చిస్తున్నాం… సరిపడా పప్పుదినుసుల సాగు లేదు… రైతుల్ని అటువైపు మళ్లించడమే కరెక్టు… శనగ, పల్లి, పెసర, కంది, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు ఎట్సెట్రా… వాళ్లకు సరైన రైతుసాయం అందాలి… మార్కెటింగ్, భీమా భరోసా కావాలి… కానీ మోడీ మీదకు తప్పు నెట్టేయడానికి మాత్రమే కేసీయార్ ప్రయత్నం చేస్తున్నాడు… సబ్జెక్ట్ తెలియని ఇక్కడి బీజేపీ నేతలు బ్బెబ్బెబ్బె అంటున్నారు… అంతేతప్ప, ఆచరణయోగ్యమైన, రైతుప్రయోజనకరమైన ప్రణాళికలేవీ..? అక్కడ మోడీకి పట్టదు, ఇక్కడ కేసీయార్‌కు పట్టదు… దొందూ దొందే…!!
Share this Article