మన రాజకీయ పార్టీలు, నాయకులు, వాటి అనుబంధ మీడియా, సోషల్ మీడియాకు ఒకటే పని… ఎదుటోడి మీదకు నెట్టేయడం…!! చివరకు ఏపీలో రోడ్లు బాగాలేవురా బాబూ అన్నా సరే, చంద్రబాబు దుర్మార్గపాలనే కారణం అంటాయి వైసీపీ శ్రేణులు… చంద్రబాబు దుర్మార్గం వద్దనుకునే కదా, నిన్ను కుర్చీ ఎక్కించింది, మరి ప్రతిదానికీ వాడినెవడినో తిట్టడం దేనికి..? మనమేం చేశామో చెప్పవయ్యా బాబూ అంటే వినిపించుకునేవాళ్లు ఉండరు… ఉదాహరణకు… 3,669 కోట్ల మేరకు జనంపై ‘‘ట్రూఅప్ ఛార్జీలు’’ బాదుతున్నారు ఇప్పుడు… లక్షల కోట్ల అప్పులు చేస్తూ, జనానికి పంచిపెడుతూ, మరి ఈ భారం ఏమిటి ప్రభూ అనడిగితే… అది చంద్రబాబు నిర్వాకం, అధికరేట్లకు కరెంటు కొన్నాడు, ఆ భారం మేం మోయాల్సి వస్తోంది అన్నారు వైసీపీ నేతలు… మరి ఇప్పుడు మరో 2,542 కోట్ల బాదుడుకు రంగం సిద్ధమైంది… దీన్నేమనాలి..? ఇదయితే చంద్రబాబు నిర్వాకం కాదు కదా… 2019-20 సంవత్సరం బాపతు నిర్వాకమే కదా… దీన్నేమందాం..?
ఆంధ్రజ్యోతికి ఈ వార్త తెలియదు, ఈనాడు ఎక్స్‌క్లూజివ్… జ్యోతికి గనుక ఈ వార్త ముందే దొరికితే ధూంధాం రచ్చ చేసేదేమో… దానికేమో సరైన బ్యూరో లేదు… ఈనాడు ప్లెయిన్‌గా వార్త ఇచ్చింది, బాగుంది… అయితే ఈ నిర్వాకాన్ని ఎవరి మీదకు నెట్టేస్తుంది వైసీపీ..? వోకే, డిస్కమ్స్ అడిగిన 2,542 కోట్ల వసూళ్లకు యథాతథంగా రెగ్యులేటరీ కమిషన్ అంగీకరించకపోవచ్చు… కానీ ఎంతో కొంత తప్పదు… దానికి ఎవరిని నిందించాలి సర్…? నిజానికి కొత్త విద్యుత్తు చట్టంలో ఉన్న ఓ వివాదాస్పద అంశం ఇది… ట్రూఅప్… అంటే… తన పరిధిలో లేని అంశాల కారణంగా ఖర్చు పెరిగితే, అది వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి ఉద్దేశించిన అంశం… మరి ఈ వార్షిక నివేదికలు (ARR) లు దేనికి..? వాటి ఆధారంగా కరెంటు ఛార్జీల ఖరారు దేనికి..? ఈ ప్రక్రియలు, ఈ ప్రయాసలు దేనికి అని ఎవరూ అడగకూడదా..?, ఇదొక డిబేటబుల్ సబ్జెక్టు… అక్కడ చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా ఈ ట్రూఅప్ తప్పదు… సరే, దీన్ని ఇలా వదిలేద్దాం…
Ads
ట్రూఅప్ తప్పదు అనుకున్నప్పుడు, ఆ నిజాల్నే జనానికి చెబితే బాగుంటుంది… ప్రజలే అర్థం చేసుకోవాలి, చేసుకుంటారు… కానీ జగన్ పీఆర్ విభాగంలో ఎవరు ఏ ప్రెస్‌నోట్ ఇస్తున్నాడో ఎవరికీ తెలియదు, పొలిటికల్‌గా ఎలా సమర్థించుకోవాలో తెలియదు, అసలు జగన్ మీడియా కోఆర్డినేషనే పెద్ద ఫెయిల్యూర్… పైన వార్త చూడండి… ఎవరో శ్రీకాంత్ అనే ఇంధనశాఖ అధికారి అట… ట్రూఅప్ చార్జీలతో జవజీవాలు అట, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా విధింపు అట… కరెంటు సంస్థలకు ఆర్థికశక్తి అట… అసలు జగన్ మీడియా విభాగానికి ఓ దశ, ఓ దిశ ఉందా..? ఇన్నాళ్లూ 3,669 కోట్ల ట్రూఅప్ బాదుడుకు చంద్రబాబున నిందిస్తున్నాం, మరి ఈ తాజా 2,542 కోట్లకు ఎవరిని నిందిద్దాం… సమర్థించేవాళ్లు లేరు, సరిగ్గా ప్రజలకు చెప్పేవాళ్లు లేరు… పైగా ఇదో వక్రబాష్యం… సాక్షిలోనేమో ఇవి సరిగ్గా రాసేవాడు లేడు… మరి ప్రజల్లోకి ఏం వెళ్తుంది..? లక్షల కోట్ల అప్పులు తెచ్చి, జనానికి పంచుడు పథకాల్ని అమలు చేస్తున్నా సరే… ఇదుగో, ఇలాంటివి ప్రజలపై భారం మోపుతూనే ఉంటయ్… అది ప్రభుత్వం భరిస్తే వోకే, కానీ సబ్సిడీగా భరించే సీన్ లేదు, నవరత్నాల్లో ఫిట్ కాదు, పొలిటికల్ ఫాయిదా స్కీముల్లో ఫిట్ కాదు, జనానికి ఎక్కదు… అలాంటప్పుడు నిజమైన కారణాలను ప్రజలకు చెప్పాలి… అదే జగన్ ప్రభుత్వంలో లోపించింది… అదే…!!
Share this Article