ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ వాణిజ్యప్రకటనలో నటించడానికి ఓ కంపెనీ 2 కోట్లు ఆఫర్ చేస్తే, సాయిపల్లవి ఎడమకాలితో పక్కకు తోసేసింది… బేసిక్‌గా నల్లతోలును తెల్లతోలు చేయడమనేదే అశాస్త్రీయం, అబద్ధం, మోసం, అదొక అనైతిక దందా… మన చట్టాలు, గడ్డి తినే మన వ్యవస్థలు వాటిని ఏమీ చేయలేకపోవచ్చు… కానీ ఆమె నిజాయితీగా, ఒక మనిషిగా వ్యవహరించింది… దాన్ని ప్రమోట్ చేయడమంటే ప్రజల్ని మోసగించడమే అనే నైతికతకు కట్టుబడింది… ఆమె హీరో… రియల్ హీరో… డబ్బు కోసం ఏదైనా తినడానికి సిద్ధపడే సినిమా, టీవీ, మోడలింగ్ ఇండస్ట్రీలో ఓ చిన్న హీరోయిన్ ఆ సాహస నిర్ణయం తీసుకోవడం నాయకలక్షణం లేదా నాయికలక్షణం… ఇక విషయంలోకి వెళ్దాం… ప్రస్తుతం మహేశ్‌బాబు పాన్బహార్ మౌత్ ఫ్రెషనర్ వాణిజ్య ప్రకటనలో నటించడంపై తాజాగా విమర్శలు వస్తున్నయ్… మహేశ్‌బాబుకు ఏం తక్కువైంది..? ఇంత స్టార్డం, ఇంత పాపులారిటీ, ఇంత ఆస్తి ఉన్న తను అనారోగ్యకరమైన ఓ పొగాకు ఉత్పత్తిని ప్రమోట్ చేయడం ఏమిటీ అనేది ఆ విమర్శలు సారాంశం..? ఇది హీరోయిజమా..? ప్రజల గురించి ఏ సోయీ లేకుండా, కేవలం డబ్బు కోసం తాపత్రయపడటమేనా హీరోయిజం అంటే..? ఇదీ తనపైన ఇప్పుడు తాజా ఆరోపణ…
సోకాల్డ్ పాపులర్ నటులకు ఓ సామాజిక బాధ్యత ఉండక్కర్లేదా..? ఈ ప్రశ్నకు మహేశ్‌బాబే సమాధానం ఇవ్వాలి… కానీ ఇవ్వడు, ఇవ్వడానికి తన దగ్గర జవాబు లేదు… సమర్థన లేదు… అసలు ప్రజలకు అనారోగ్యకరమైన కూల్ డ్రింక్స్‌కు తన ప్రమోషన్ యాడ్స్ మీదే బోలెడన్ని విమర్శలున్నయ్… ఇక ఇప్పుడు ఏకంగా పాన్ బహార్ వంటి ఉత్పత్తుల విషయంలో కూడా ఈ కక్కుర్తి అవసరమా అనేది తనకు ఇబ్బందికరమైన ప్రశ్నే… అందరూ చేయడం లేదా అంటారు కొందరు… అందరూ వేరు, మహేశ్ బాబు వేరు… మహేశ్ ఇండస్ట్రీలో కాస్త డిఫరెంట్… అనవసర వివాదాల్లో తలపెట్టడు, లేనిపోని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడు… తన పనేదో తనది… హుందాగా, డిగ్నిఫైడ్‌గా బిహేవ్ చేస్తాడు… అలాంటి హీరోకు ఈ దరిద్రపు డబ్బు దేనికి అనేదే అందరికీ అంతుపట్టని ప్రశ్న…
Ads
మన దేశంలో పొగాకు, ఆల్కహాల్ ఉత్పత్తుల ప్రచారంపై నిషేధం ఉంది… అందుకని ఆ ఉత్పత్తులు తమ ప్రచారాన్ని డొంకతిరుగుడు పద్ధతిలో చేస్తుంటయ్, ఉదాహరణకు మద్యం… ఏదో సోడా లేదా మినరల్ వాటర్ పేరిట తమ బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటాయి… సేమ్, పొగాకు ఉత్పత్తులు కూడా… మాణిక్‌చంద్ వాడు గోధుమపిండి పేరిట ప్రచారం చేసుకుంటాడు, కానీ వాడి అసలు వ్యాపారం ఏమిటో అందరికీ తెలుసు… పాన్ బహార్ మౌత్ ఫ్రెషనర్ పేరిట ప్రచారం చేసుకున్నా ఇంతేగా..! అజయ్ దేవగణ్ విమల్ ప్రకటనల్లో, సల్మాన్ ఖాన్ రాజశ్రీ ప్రకటనల్లో చేస్తాడు… విమల్ వాడు షారూక్‌ను కూడా ఈ ప్రకటనల్లో దింపుతున్నాడని వార్తలున్నయ్… Elaichi Universe పేరిట పాన్ బహార్ రకరకాల భాషల్లోని సూపర్ స్టార్లను రంగంలోకి దింపుతోంది… మహేశ్ బాబు కూడా ఆ భారీ ప్రచారప్రణాళికలో ఓ భాగం… ఆల్రెడీ టైగర్ ష్రాఫ్ చేరిపోయాడు… సో, తనొక్కడే కాదు… అయితే..?
నిజానికి పాన్ మసాలాలు ఆరోగ్యానికి మంచివి కావు… ఊళ్లలో ఆరెంపీలను అడిగినా చెబుతారు… ప్రముఖ కేన్సర్ పరిశోధనల సంస్థల్లోని నిపుణుల్ని అడిగినా చెబుతారు… ఇదే పాన్ బహార్ మౌత్ ఫ్రెష్నర్ పేరిట జేమ్స్ బాండ్ హీరోగా ప్రసిద్ధి పొందిన పియర్స్ బ్రాస్నన్తో ఒప్పందం చేసుకుంది… పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు… కానీ ఏమిట్రా ఈ పని అంటూ తనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన ఒప్పందాన్ని సమీక్షించుకున్నాడు… తనను పాన్ బహార్ కంపెనీ మోసం చేసిందని, మౌత్ ఫ్రెష్నర్ పేరుతో పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశాడు… ఆ సంస్థపై న్యాయపోరాటం కూడా ప్రారంభించాడు… బోలెడంత కంట్రవర్సీ… ఈ వార్తలు మహేశ్‌బాబుకు తెలియవా..? నువ్వు ఓ హీరోవు మహేశ్… కోట్ల మంది నిన్ను ప్రేమిస్తారు… నీకు ఈ పెంట కరెన్సీ అవసరమా..?!
Share this Article