ఈనాడు ఇంట్రస్టింగ్, ఇన్వెస్టిగేటివ్ వార్తలు రాయడం మానేసి చాలారోజులైంది కదా… ఏదో కరోనా మీద నలుగురి బైలైన్ ఇంటర్వ్యూలు రాస్తూ పొద్దుపుచ్చుతోంది… మోడీ, జగన్, కేసీయార్… ఏ ప్రభుత్వం జోలికీ వెళ్లేది లేదు… కళ్ల ముందు ఏం జరుగుతున్నా ఉలికేది లేదు, కదిలేది లేదు… కానీ అకస్మాత్తుగా ఈరోజు ఓ బ్యానర్ కనిపించింది… శీర్షిక చెక్ ఢాం… ఆ ఫోటో చూడగానే, ఆ హెడ్డింగ్ చదవగానే ఇదేందబ్బా, ఎక్కడో చదివాం కదా అనిపించింది… అబ్బే, ఈనాడు బ్యానర్ స్టోరీ అంటే ఏదో ఎక్స్‌క్లూజివ్ అయి ఉంటుంది, ఎంగిలి స్టోరీ అయి ఉండదులే అనుకున్నా సరే ఎక్కడో డౌట్ పీడిస్తూనే ఉంది… నిజానికి మంచి వార్తే… జనానికి అవసరమైన వార్తే… అధికార పార్టీ నాయకులు, అధికారులు చెక్ డ్యాముల పేర్లతో డబ్బులు ఎలా నొక్కేస్తున్నారో, అవి నాలుగు రోజులకే నాణ్యతలోపాలతో, డిజైన్ లోపాలతో ఎలా ఫట్‌మని తెగిపోతున్నాయో చెప్పే స్టోరీ… ఎక్కడికక్కడ జనాన్ని ప్రజాప్రతినిధుల కంపెనీలు ఎలా కుమ్మేస్తున్నాయో చెప్పే స్టోరీ…
ఆఁ… గుర్తొచ్చింది… కాస్త వెనక్కి… అంటే 11వ తేదీ దిశ డిజిటల్ పేపర్‌లోకి వెళ్తే… అంటే జస్ట్ రెండు రోజులే తేడా… ఇదే వార్త కనిపించింది… ఇదే కంటెంట్… ఇదే హెడ్డింగ్ కూడా… అరె, ఈనాడుకు ఈ ఎంగిలి వార్తల దరిద్రం ఏమిటీ అనుకోవడానికి ఏమీలేదులే… ప్రజోపయోగకరమైన వార్తల విషయంలో, వేరే పత్రికల్లో స్టోరీలు వచ్చాయి కదాని వదిలేయడం కరెక్టు కాదు, రాయాలి, రాయొచ్చు… కానీ అదే హెడ్డింగ్, అదే కంటెంట్… కనీసం వాల్యూ యాడిషన్ కోసం కూడా ట్రై చేయలేదు… దిశ వాళ్లే నయం, ఎక్కడెక్కడ ఎంతెంతకు ఎవరెవరు కంట్రాక్టులు చేజిక్కించుకున్నారో, ఫీల్డ్ మీద ఏం జరుగుతుందో వివరంగానే రాసుకొచ్చారు… సమస్య తీవ్రతను పట్టుకున్నారు…
Ads
రాస్తే గీస్తే వెలుగు రాయాలి, దానికి ఈమధ్య ఏ సోయీ లేదు… నమస్తే సాక్షి, నమస్తే ఎలాగూ రాయవు… జ్యోతి కూడా నమస్తే అంటోంది… అందుకని ఈనాడులో ఇది బ్యానర్ స్టోరీగా చూస్తే ఆశ్చర్యం అనిపించింది… ఈమధ్య కాలంలో ఆ పత్రికలో కనిపించని సాహసం ఇది… కాస్త ఆచితూచి, సమస్యను వివరిస్తూనే, జాగ్రత్తగా, ఎవరికీ కోపం రాకుండా అక్షరాల్ని పేర్చి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నట్టుగా సాగింది కథనం… పోనీలే, కనీసం ఎంగిలి స్టోరీ అయినా సరే, తన బాధ్యతగా తను కూడా రాసింది… మిగతావాళ్లకు ఆ సోయి కూడా లేదు కదా అంటారా..? అవున్నిజమే… ఈమాత్రం కథనాలకే ఆనందపడాల్సిన పరిస్థితికి చేరుకున్నది తెలంగాణజనం..!! ఇంకా ఈ చెక్ డ్యాము బాగోతాల మీద PCC రేవంత్, బండి సంజయ్ కళ్లు పడనట్టున్నాయి కదా…!!
Share this Article