నిజానికి బాలీవుడ్‌కే కాదు… ఇది ఇండియన్ సినిమాకు సంబంధించి కాస్త ఇంట్రస్టింగ్ వార్తే..! కరీనాకపూర్‌ను తప్పించి, ఓ భారీ సినిమాలో సీత పాత్రకు కంగనా రనౌత్‌ను ఎంపిక చేయడం..! ఆ సినిమా పేరు… సీత- The Incarnation… పాపులర్ రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథ… అదీ సీత కోణంలో కొత్తగా కథను చెప్పడం… అంతేకాదు, హిందీతోపాటు తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు… నిజానికి చాలారోజులుగా సాగుతున్నది ప్రిప్రొడక్షన్ పని… దీనికి దర్శకుడు అలౌకిక్ దేశాయ్… ఇక అసలు వార్తలోకి వెళ్తే… నిన్నమొన్నటిదాకా సీత పాత్రను కరీనాకపూర్ చేస్తున్నదనే అందరూ భావించారు… ఆమె చేయడానికి అంగీకరించింది… సాధారణంగా ఆరేడు కోట్లు తీసుకునే ఆమె ఈ సినిమా కోసం 12 కోట్లకు పైగా అడిగిందని ఈమధ్య వార్తలొచ్చాయి… ఆ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్‌ను కరీనా సమర్థించుకుంది కూడా…! అది ఇండస్ట్రీలో మహిళల గౌరవాన్ని పెంచడమే అని చెప్పుకుంది… కానీ..?
ఇప్పుడు హఠాత్తుగా ఆ సినిమా ప్రాజెక్టు నుంచి ఆమె పేరు మాయమైపోయింది… కంగనా రనౌత్ వచ్చింది… కంగనాయే స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో ఆ విషయాన్ని చెప్పుకుంది… ఆ సమాచారాన్ని షేర్ చేస్తూ… ఆ సీతారాముడి దయతో మంచి టాలెంటెడ్ టీంతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని పేర్కొంది… చివరలో జైసియారాం అని రాసుకుంది… అదొక టెక్నిక్… మణికర్ణిక పేరుతో చేసిన ఝాన్సీరాణి సినిమా, జయలలిత బయోపిక్ తలైవి సినిమా కంగనా ఇమేజీని పెంచాయి… ఇప్పుడు సీత పాత్ర తనకు మరో సవాల్ ప్లస్ మంచి చాన్స్… అఫ్‌కోర్స్, మంచి నటే కాబట్టి అలవోకగా ఆ పాత్రను పోషించగలదు… అయితే..? కరీనాను తప్పించి కంగనాను తీసుకోవడం వెనుక ఈ నిర్మాతలు వేరే కోణాలు ఆలోచించారా..? ఆ చర్చ ఒకటి సాగుతోంది…
Ads
కరీనా కొడుకులకు పెట్టుకున్న పేర్ల మీద సోషల్ మీడియాలో, మీడియాలో బాగా చర్చ సాగింది… అది ఆమె పట్ల వ్యతిరేకతను పెంచింది… లక్షల మంది హిందువులను ఊచకోత కోసిన తైమూర్ పేరును పెద్ద కొడుక్కి, సిక్కుల అయిదో గురువు అర్జన్ దేవ్‌ను చంపించిన మరో మొఘల్ పాలకుడు జెహంగీర్ పేరును చిన్న కొడుక్కి పెట్టుకుందనేది ఆమె మీద సాగిన చర్చ… (చిన్న కొడుకు పేరును జెహ్ అని మాత్రమే ఉచ్చరిస్తున్నారు ప్రతిచోటా…) సరే, ఆమె కొడుకుల పేర్లు ఆమె ఇష్టం, ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ ఇష్టం… కానీ ఇద్దరూ బాగా పేరున్న సెలబ్రిటీలు, ఇండస్ట్రీలో పాపులర్ కుటుంబాల నుంచి వచ్చినవాళ్లు కాబట్టి మీడియా ఆ చర్చను కొన్నాళ్లు కొనసాగించింది… సైఫ్ ప్రస్తుతం ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రావణ పాత్ర పోషిస్తున్నాడు, అందులో సీత పాత్రను కృతిసనన్ పోషిస్తోంది… నిజానికి నటీనటులు పోషించే పాత్రల్ని వాళ్ల వ్యక్తిగత జీవితాలు, విశ్వాసాల కోణాల్లో చూడటం కరెక్టు కాదు… కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు చూస్తున్నాం కదా… ఆమె సీత పాత్రను పోషించడాన్ని వ్యతిరేకిస్తూ కొన్నాళ్లు #BoycottKareenaKapoorKhan హ్యాష్ టాగ్‌తో సోషల్ ప్రచారం కూడా నడిచింది… ఆమె బదులు కంగనా, యామీ గౌతమ్, అనుష్క శర్మ బెటర్ అని ప్రచారం చేశారు కొందరు… కరీనాను ఇంకా ఫైనలైజ్ చేయలేదు బాబోయ్ అని నిర్మాత, దర్శకుడు, టీం బహిరంగంగా చెప్పుకున్నారు…
ఇంకోవైపు చూస్తే కంగనా… బీజేపీ అనుకూలత, హిందుత్వ పట్ల మొగ్గు… జావేద్ అఖ్తర్ వంటి బాలీవుడ్ ప్రముఖులతో ఫైట్ సాగిస్తోంది… తనే స్వయంగా అయోధ్య గుడికి సంబంధించిన చరిత్ర, కథతో అపరాజిత అయోధ్య అనే సినిమా తీస్తోంది… థాకడ్, తేజస్, ఇమ్లీ అనే ప్రాజెక్టులు కూడా ఆమె చేతుల్లో ఉన్నయ్ ప్రస్తుతానికి… డిమాండ్‌లో ఉన్న నటి ఇప్పుడు… సో, కరీనాను ఏ కారణం వల్ల వద్దనుకున్నా సరే, నిర్మాతలకు కంగనా సరైన ప్రత్యామ్నాయంగా కనిపించినట్టుంది… పైగా ఇప్పుడు ఆమె సక్సెస్ బాటలో ఉంది… కరీనాకన్నా కంగనా వయస్సులో చిన్నది… నిజానికి కరీనా గనుక ఈ పాత్రకు ఒప్పుకోకపోతే ఆలియా భట్‌ను తీసుకోవాలని నిర్మాతలు ఆలోచించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది… వాస్తవంగా ఆమె సీత పాత్రకు బాగా సూటయ్యేది… ఇద్దరూ బాగానే నటిస్తారు గానీ ఆలియా మొహంలో ఫీలింగ్స్ ఇంకాస్త బాగా పలుకుతాయి… కంగనాకన్నా లేతమొహం…! ఆదిపురుష్‌లో సీత పాత్ర పోషించే కృతిసనన్‌కన్నా కూడా ఆలియా బెటరే… ఐనా నిర్మాతల లెక్కలు వేరు, వాళ్లు పరిగణనలోకి తీసుకునే అంశాలు వేరు కదా…!!
Share this Article