ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోణంలో భ్రష్టుపట్టిపోవచ్చుగాక… పార్టీ ఉనికే ఊగిసలాటలో ఉండవచ్చుగాక… కానీ సీపీఐకి ఈ దేశ రాజకీయ చరిత్రకు సంబంధించి ప్రాముఖ్యత ఉంది… ఈరోజుకూ ఆ పార్టీ జెండా కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలున్నారు, అభిమానులున్నారు… ఒకప్పుడు పార్టీ ప్రవచించిన సిద్ధాంతాల కోసం, ఆదర్శాల కోసం ఎందరెందరో తమ ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర కూడా ఉంది… అలాంటి పార్టీకి నారాయణ జాతీయ కార్యదర్శి… ఆయన పిచ్చి కూతలు వింటుంటే, అసలు ఎలా ఆ హోదా వరకూ ఎదిగాడనే సందేహం కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు… నిష్ఠురంగా అనిపించినా నిజాన్ని అంగీకరిద్దాం… లేకపోతే ఒక టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ వ్యభిచారిణులు అని ముద్రవేయడం ఏమిటి..? హేయం, నీచం… నిజమైన కమ్యూనిస్టు, నిజమైన సామాజిక శ్రేయోభిలాషి రెడ్ లైట్ ఏరియాలో నిజంగానే ఒళ్లు అమ్ముకుని బతికే వాళ్లను గౌరవించాలి… అదొక పురాతన వృత్తి.., చేతనైతే వాళ్లను బయటికి తీసుకురావల్సిందే తప్ప, వాళ్లను తూలనాడటం సరికాదు… ఆ దిశలో సోకాల్డ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఏం చేయగలిగాయి..? అదొక చిక్కు ప్రశ్న… అలాంటిది బిగ్‌బాస్ అనే ఓ టీవీ షోలో పార్టిసిపెంట్ల మీద వేశ్యలు అనే ముద్ర వేయడం ఎంత దారుణం… నారాయణ సోయిలోనే ఉన్నాడా..? ఆ పార్టీ అదుపులోనే ఉన్నాడా..? అసలు పార్టీకి తమ నాయకుల మీద నియంత్రణ ఉందా..? లేక అందరూ అలాగే తయారయ్యారా..?
Ads
ఇది నారాయణ మీడియా మీట్… అదీ పార్టీ హెడ్డాఫీసులో పెట్టిందే… బిగ్‌బాస్ ప్రోగ్రాం బ్రోతల్ స్వర్గం, రెడ్ లైట్ కల్చర్ అంటున్నాడు… ఒకే గదిలో 105 రోజులపాటు యువతీయువకులను పెట్టి, డేటింగ్ చేయిస్తున్నారు, సాంస్కృతిక దోపిడీ అని ఆరోపిస్తున్నాడు… కోర్టుకు పోతాను అని బెదిరిస్తున్నాడు… అసలు ఆ ఆలోచనలేమిటి..? ఒక పార్టీ ప్రాధాన్యాంశాలేమిటి..? ఒక టీవీ షో మీద పోరాటమా..? ఇక్కడ బిగ్‌బాస్ అనే ఒక ఆఫ్టరాల్ టీవీ షో గురించి కాదు… అందులో పాల్గొనేవాళ్లను పరోక్షంగా బ్రోతల్స్ అని ముద్రవేయడం కరెక్టేనా..? బిగ్బాస్కన్నా అత్యంత నీచమైన సాంస్కృతిక దరిద్రాన్ని వ్యాప్తి చేసే ఈటీవీ జబర్దస్త్ మీద ఇలా మాట్లాడగలడా నారాయణ..? ఇన్నేళ్లుగా ఇంటింటికీ బూతును స్వేచ్ఛగా చేరవేస్తున్న ఆ జుగుప్స మాటేమిటి..? అత్యంత ప్రమాదకరంగా మారుతున్న టీవీ సీరియళ్ల ముచ్చటేమిటి..? తెల్లారగానే బోలెడు మూఢవిశ్వాసాల్ని ఎంకరేజ్ చేస్తున్న టీవీ స్వాముల మాటేమిటి..? అసలు తెలుగు సినిమా పాటల్లోని బూతు సంగతేమిటి..? జనం మెదళ్లను పాడుచేస్తున్న నాసిరకం డిబేట్ల ముచ్చటేమిటి..? ఇలా ఎన్ని..? ఎన్నెన్ని..? అసలు కల్చరల్ పొల్యూషన్ అనేది ఒక్క బిగ్‌బాస్‌కే పరిమితమా..?
వదిలేయండి, అదొక దరిద్రపు షో అనే అనుకుందాం… ఆ కాన్సెప్టును చాలామంది వ్యతిరేకిస్తున్నారు… డిబేట్ కోసం వాళ్లతో ఏకీభవిద్దాం… కానీ అదొక టీవీ షో, టీవీ సీరియల్‌లాగే ఒక స్క్రిప్టెడ్ షో… అక్కడ ఎవరి పాత్ర వాళ్లు పోషిస్తారు… కాకపోతే ఒక సెక్యూర్డ్ హౌజులో, బోలెడు కెమెరాల నడుమ రకరకాల ఎమోషన్స్ పండించాలి… పార్టిసిపెంట్ల ఆట నిజానికి పాత్రల పోషణ మాత్రమే… ఎవరి వ్యక్తిత్వాలు వాళ్లకుంటయ్… ఒక దగ్గర ఉంటూ, ఒక షోలో పాత్రలు పోషిస్తే ఇక ఇష్టమొచ్చిన ముద్రలు వేసి, కించపరచాలా..? వాళ్లను నీతి, జాతి లేనివాళ్లుగా స్టాంపేయాలా..? ఎంత అన్యాయం..? అందులో పెళ్లయినవాళ్లున్నారు, పిల్లలున్నవాళ్లున్నారు… ప్రొఫెషనల్స్ ఉన్నారు, జర్నలిస్టులు, యాక్టర్స్, కమెడియన్స్, యాంకర్స్… బోలెడు వృత్తుల వాళ్లున్నారు… ఒక్క తెలుగే కాదు, పలు భాషల్లోని బిగ్‌బాస్ షోలను కలిపి స్థూలంగా ఆలోచిస్తే అనేకానేక వృత్తుల వాళ్లు పాల్గొంటున్నట్టు కనిపిస్తుంది మనకు స్పష్టంగానే..! ఇక అక్కడ జరిగేది డేటింగ్, రెడ్ లైట్ కల్చర్, అది బ్రోతల్ స్వర్గమనీ హేయమైన నిందమోపితే ఎలా..? ఇదేనా ఒక జాతీయ పార్టీకి, అదీ తార్కిక జ్ఙానంతో అడుగులు వేయాల్సిన పార్టీకి, ఓ చరిత్ర ఉన్న పార్టీకి జాతీయ స్థాయి ఉన్నత హోదాలో పనిచేస్తున్న ఓ నాయకుడి ధోరణి..?! ప్చ్, ఎలాంటి పార్టీ చివరకు ఏ దశకు కూరుకుపోతోంది..?! అన్నట్టు పైన ఓ క్లిప్పింగ్ ఉంది చూశారు కదా… నాస్తిక నారాయణ బతుకంతా ఓ బాట… ఇప్పుడు ఎర్ర రంగు వెలిసి, కాషాయంలోకి మారిపోయి… సొంతంగా గుళ్లు, ప్రతిష్ఠాపనలు, నిర్మాణాలు, పూజలు, భజనలు… వావ్, నారాయణా..? తిరుమల, విశాఖ పీఠ సందర్శనాలు కూడా… ఇన్నేళ్ల హేతువాదం, శాస్త్రీయవాదం, నాస్తికత్వం ఏమైపోయాయ్..? పార్టీ ఇన్నేళ్లుగా చెప్పేవన్నీ తూచ్ ముచ్చట్లేనా..? నీ స్థాయిలోనే నీకు ఒక సైద్ధాంతిక నిబద్ధత లేదు… ఇదేనా కేడర్‌కు తమరు ప్రసాదిస్తున్న అంతిమ ప్రవచనం..?! బైదివే.., సొంత బలం లేక, ప్రతిసారీ ఏదో ఒక పార్టీతో జతకట్టి, అవసరం తీరగానే వదిలేసి, కొత్త “పార్టీ” కోసం వెతకడాన్ని ఏమంటారు..!? నో, నో, బ్రోతల్ స్వర్గం, రెడ్ లైట్ కల్చర్ అనకూడదు… తప్పు..!!
Share this Article