సహస్రమానం భవతి!
———————
వాల్మీకి రామాయణం. అయోధ్య కాండ. కోసలరాజ్య రాజధాని సరయూతీర అయోధ్యలో దశరథుడు కొలువుతీరాడు. పక్కన కులగురువు వశిష్ఠుడు కూర్చుని ఉన్నాడు. మంత్రి, సామంత, దండ నాయకులు, సేనాపతులు వారివారి ఆసనాల్లో వారున్నారు. పురప్రముఖులు, పౌరులు, జానపదులు అందరూ వేలాదిగా హాజరయిన సమావేశమది.
Ads
“అరవై వేల ఏళ్లు పాలించాను. ముసలితనం మీద పడుతోంది. మా పెద్దబ్బాయి రాముడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇక నేను దిగిపోయి మా ఇక్ష్వాకు వంశ ఆచారం ప్రకారం జ్యేష్ఠ పుత్రుడయిన రాముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను. చైత్రం ప్రవేశించి చెట్లన్నీ చిగురించి ప్రకృతి పచ్చని పట్టుచీరతో శోభిస్తోంది. వాతావరణం హాయిగా ఉంది. రాముడి పట్టాభిషేకానికి ఇదే తగిన సమయమనుకుంటున్నాను- మీరేమంటారు?” అని దశరథుడు సభను అడిగాడు.
ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్నామని సభ దిక్కులు పిక్కటిల్లేలా ఆనందోత్సాహాలతో సమాధానం చెప్పింది. వెంటనే ఏర్పాట్లు చేయాల్సిందిగా వశిష్ఠుడిని కోరాడు. ఆ రాత్రి గడిచి తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం ఆగిపోయి, నెత్తిన అయోధ్య కిరీటం పెట్టుకోవడానికి సాక్షాత్తు కారణజన్ముడికి పద్నాలుగేళ్ళు పట్టింది. పట్టాభిషేకం తరువాత రాముడు పదకొండు వేల సంవత్సరాలు కోసలరాజ్యాన్ని పరిపాలించాడు. యుగాలు ఎన్ని దొర్లినా ఎవరికయినా, ఎప్పటికయినా రామరాజ్యమే ఆదర్శం, కొలమానం.
అయితే దశరథుడి అరవై వేల ఏళ్ల ఆయుష్షు, రాముడి పదకొండువేల ఏళ్ల పాలన ఈరోజుల్లో అంగీకరించడానికి అందరూ సిద్ధంగా ఉండకపోవచ్చు. భక్తి ఉన్నవారు భగవంతుడి కాలప్రమాణాల జోలికి వెళ్లరు. నిజానికి కాలానికి కట్టుబడనివాడే భగవంతుడు. అందుకే త్యాగయ్య కృష్ణుడిలో రాముడిని చూస్తూ “కాలాతీత విఖ్యాత” అన్నాడు.
ఎప్పుడో త్రేతాయుగంలో దశరథుడి అరవైవేల ఏళ్లు, రాముడి పదకొండు వేల ఏళ్లు అని పారాయణం చేస్తున్నాం. నిండు నూరేళ్లు బతకడమే కష్టమయిన ఈరోజుల్లో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తూ డెబ్బయ్ ఐదేళ్లు బతికినా చాలు- అని మనకు మనమే ఇరవై అయిదేళ్ల ఆయుష్షును కోసేసుకున్నాం.
“శతమానం భవతి శతాయుః
పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”
అని నిండు నూరేళ్లు సంపూర్ణమయిన ఆరోగ్యంతో, కళ్లు కనపడుతూ, చెవులు వినపడుతూ…ఇంద్రియాలు పనిచేస్తూ బతకమనే మన వేద ఆశీర్వచన మంత్రం కోరుకుంటోంది. కానీ- నలభై ఏళ్లకే వృద్ధాప్యం ఛాయలతో ప్రపంచం డీలా పడుతోంది. యాంటీ ఏజింగ్ క్రీములు, సర్జరీలు, కడుపుకోతలు కోసుకుంటూ, గాలి భోంచేస్తూ మహా అయితే పదేళ్ల వయసు తగ్గినట్లు భ్రమ పడుతున్నాం. జుట్టుకు రంగులు, ఊడిన పళ్లకు కట్టుడు పళ్లతో పెట్టుడు అందం పట్టుబడినట్లు పొంగిపోతున్నాం. ఇక ఇలాంటి చిల్లరమల్లర యాంటీ ఏజింగ్ పనులు కాకుండా- ఒకే ఒక యాంటీ ఏజింగ్ బ్రహ్మాస్త్రం సిద్ధమవుతోంది. ఈ ప్రయోగాలు సత్ఫలిస్తున్నాయని వార్తలు. చూడబోతే కరోనా వ్యాక్సిన్ కంటే వృద్ధాప్యాన్ని శాశ్వతంగా దూరం చేసే వైద్య ప్రక్రియే ముందు వచ్చేలా ఉంది.
ఒక ఊరు ఊరంతా ఈ నిత్యనూతన వృద్ధాప్యరహిత సహస్ర వర్ష ఆయుఃప్రమాణ బూస్టర్ డోసులు తీసుకుని వెయ్యేళ్లుబతుకుతోందని అనుకుందాం. అప్పుడు ఆ ఊళ్లో చర్చలు, సంభాషణలు ఇలా ఉంటాయి.
చూడండి! మా అమ్మాయికి ఏడువందల ఏళ్లు నెత్తిమీదికి వచ్చినా ఇంకా పెళ్లి గిల్లి వద్దనే అంటోంది. మా రోజుల్లో నాలుగు వందల ఏళ్లకే తాళికట్టించుకునే వాళ్లం. ఏమి కాలమో! ఏమి పిల్లలో?
అవునండీ! మా రెండో వాడూ అంతే మొన్ననే ఎనిమిది వందలు నిండి కొంచెం జుట్టు కూడా నెరుస్తోంది. సంబంధాలే కుదరడం లేదు. మాకేమో తొమ్మిది వందల యాభై వచ్చింది. మహా అయితే ఇంకో యాభై ఏళ్లకు మించి ఉండం కదా?
నారాయణ, చైతన్య పేపర్, టీవీ యాడ్స్ లో సారాంశమిది. ఐఐటీ, సివిల్స్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ కోచింగ్- నాలుగు వందల ఏళ్లు. ఫీజు- నలభై కోట్లు. ఏసీ హాస్టల్- యాభై కోట్లు.
“ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాన్తి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః ।
లక్ష్మీస్తోయతరఙ్గభఙ్గచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాత్ మాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా”
అర్థం:-
చూస్తుండగానే ఆయువు నశిస్తుంది. ప్రతిరోజు యౌవనం కరిగిపోతూ ఉంటుంది. గడచినరోజులు తిరిగిరావు. కాలం జగతిలో అన్నిటినీ తినేసి నామరూపాల్లేకుండా చేస్తుంది. నీటి అలల్లా లక్ష్మి (సంపద) చంచలమైనది. మెరుపులా జీవితం చంచలమైనది. కాబట్టి శరణాగతుడనైన నన్ను కరుణతో నీవే రక్షించు.
శివాపరాధక్షమాపణస్తోత్రంలో శంకరాచార్యులు చెప్పిన ఈమాట వేనవేల వేదాంత గ్రంథాలతో సమానం. పదమూడు వందల సంవత్సరాల క్రితం శంకరుడి అభిప్రాయమిది. మూడు పదుల కాలం మాత్రమే బతికి మరో మూడు యుగాలు గడిచినా తరగని ఆధ్యాత్మిక సాహిత్యాన్ని, అద్వైత దృక్పథాన్ని ఇచ్చినవాడు శంకరాచార్యులు.
కలకాలం బతకాలన్న ఆశ ఈనాటిది కాదు. కొందరు పోయినా బతికి ఉంటారు. కొందరు బతికే ఉండి ఎప్పుడో పోయి ఉంటారు. కొందరు ఎప్పుడు పోదామా అని బతుకీడుస్తుంటారు. కొందరు పోలేక బతుకుతుంటారు. కొందరు తాము పోయినా ఇతరులను బతికిస్తుంటారు. కొందరు తాము పోయినా ఇతరులను బతకనివ్వరు. నిజంగా వెయ్యేళ్ల ఆయుష్షు కనుక దొరికితే బతుకు ఎంత దుర్భరమవుతుందో ఎవరికివారు ఊహించుకోవాల్సిందే. అయినా- శుభం పలకరా పెళ్లి కొడకా! అంటే…అన్నట్లు అశుభం ఎందుకు? అందరూ వెయ్యేళ్లు మిసమిసలాడే యవ్వనంతో బతకండి. అమృతం తాగిన దేవతలే కుళ్లుకునేలా కలకాలం ఈభూమ్మీద ఇలాగే ఉండిపోండి. “సహస్రమానం భవతి”
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article