‘‘అక్కడికి నేనేదో శశిథరూర్‌ను అనకూడని మాటలేవో అన్నట్టు, పెద్ద పంచాయితీ… అవున్లెండి, అసలే కాంగ్రెస్… ఇప్పటికే కేసీయార్ తొక్కీ తొక్కీ నారతీశాడు… ఎవరేమిటో అర్థం కారు, ఎవరు కేసీయార్ మనుషులో అర్థం కాదు, అలాంటిది ఫీల్డులో నానా గదుమలూ పట్టుకుంటూ, అందరి కడుపుల్లో తలకాయలు పెడుతూ… కేడర్‌ను కదిలించుకుంటూ… రాష్ట్రమంతా తిరుగుతూ, సభలు పెడుతూ… నానా కష్టాలూ పడుతున్నాను…. ఫీల్డులో పనిచేసేవాడికి తెలుసు, ఈ పెయిన్ ఏమిటో… మేం కేసుల పాలవుతం, మేం జైళ్లపాలవుతం… వీళ్లు ఎక్కడి నుంచో వచ్చి, ఇక్కడ తిరుగుతూ… కేసీయార్ సూపర్, కేటీయార్ బంపర్ అంటుంటే కడుపు రగిలిపోదా మరి..? నోరు జారాను, కానీ ఆఫ్ ది రికార్డు సంభాషణల్ని కూడా రికార్డు చేస్తారని ఏమైనా ఊహిస్తానా..? అందుకే ముందుగా శశిథరూర్‌ను తిట్టాను అనే వార్త ఫేక్ అన్నాను, ఆ ఆడియోను ఆ పత్రికవాళ్లు కేటీయార్‌కు పంపిస్తారని ఏమైనా ఊహిస్తానా..? దొరికిపోయా, సర్లే, అసలు ఫైట్ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినవేళ అనవసర రచ్చ దేనికి..? ఆ తలనొప్పితో మైండ్ ఖరాబ్ చేసుకోవడం దేనికి అనుకుని వెనక్కి తగ్గానా లేదా..? సారీ చెప్పానా లేదా..?
ఐనా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వాడుతున్న భాషతో పోలిస్తే గాడిద, బేవకూఫ్ అనేవి పరుషపదాలా ఏం..? దీనికి నమస్తే వాడు పెద్ద రచ్చ చేసి, పెట్రోల్ పోసి, ఇంకా ఏదో కెలికే ప్రయత్నం చేస్తున్నాడు… అరె, మావాడిని మేమేదో అనుకుంటాం, నువ్వెందుకుర భయ్ పుల్లలు పెట్టి, చోద్యం చూస్తవ్..? నిన్న కర్నాటక సీఎం సుబ్రహ్మణ్యస్వామిని ఏమన్నాడు..? ఫ్రీలాన్స్ పొలిటిషియన్ అన్నాడు… అంటే బీజేపీ మనిషిగానే గుర్తించడం లేదు… ఫోరా భయ్ అంటున్నాడు… అంతెందుకు..? మొన్నమొన్నటిదాకా బీజేపీ మంత్రులు తెలంగాణకు వచ్చి కేసీయార్ సూపర్, అబ్బో, ఆహా, ఓహో అంటుంటే ఇక్కడ బీజేపోళ్లకు కడుపు రగిలిపోలేదా..? అమిత్ షాకు ఫిర్యాదులు చేయలేదా..? ఇక్కడ మేమేదో కొట్టాడుతుంటే మీరొచ్చి సర్టిఫికెట్లు ఇస్తుంటే ఇక మా ఫైట్ దేనికి అంటూ సొంత పార్టీలోనే రచ్చచేయలేదా..?
Ads
ఐనా నేనూ ఎంపీనే, ఏదో కమిటీలో చేరి, నేను ట్రివేండ్రం వెళ్లి… కేరళ సీపీఎం సూపర్, సీఎం పినరై విజయన్ బంపర్ అంటే ఇదే శశిథరూర్‌కు ఎలా ఉంటుంది..? ఐనా ఒకచోటకు వెళ్లి ఏదైనా మాట్లాడుతున్నామంటే… పొలిటికల్ మ్యాథ్స్ చూసుకునే పనిలేదా..? సొంత పార్టీకి నష్టమో లాభమో ఆలోచించుకోవద్దా..? దీనికి నేను థర్డ్ రేట్ క్రిమినల్‌ను అయ్యానా కేటీయార్ కళ్లకు..? వోటుకునోటు, అదొక కేసా..? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని పార్టీలు చేస్తున్నదేమిటి..? రాజకీయ లావాదేవీలు ఏమైనా కొత్తా..? టీఆర్ఎస్ ఏ వికారాలూ చేయనిదే ఇతర పార్టీల నుంచి నాయకులు భక్తితో ఆ పార్టీలోకి వెళ్తున్నారా..? ఖర్మకాలి దొరికానేమో, సోవాట్..? ఇప్పటి పొలిటికల్ కల్చర్‌కు భిన్నంగా, టీఆర్ఎస్ కూడా పుణికిపుచ్చుకున్న కల్చర్‌కు వ్యతిరేకంగా ఏమీ లేను కదా…! అసలు కాంగ్రెస్‌లో వర్గాలు, గ్రూపులు తిట్టుకోవడం ఏమైనా కొత్తా..? తిట్టుకోవడం, కలిసిపోవడం కామనే కదా… ఈమాత్రం దానికి మనీశ్ తివారీకి కోపమెందుకు..? సరే, తగ్గాను కదా… సారీ అన్నాను కదా… ఛల్ హట్, వదిలేయాలి కదా… నేనేమన్నా సునంద పుష్కర్ కేసు గురించి కామెంట్ చేశానా..? లేదు కదా…!
అప్పట్లో 23 మంది కదా రాహుల్ నాయకత్వాన్ని, నెహ్రూ కుటుంబాన్ని వ్యతిరేకిస్తూ సోనియాకు లేఖ రాసింది… ఆ టీంలో లేరా ఈ మనీశ్ తివారీ, ఈ శశిథరూర్..? వీళ్లకు పార్టీ పట్ల విధేయత ఏముందని..? కొత్తగా మంటలు రేపడం తప్ప చేసిందేముంది..? ఇద్దరూ ఈ 23 గ్యాంగ్ దోస్తులే కదా… అందుకేనా ఈ సపోర్ట్..? వీళ్లు కూడా మాట్లాడేవాళ్లే అయిపోయారు, ఏం చేస్తాం మరి..?! ఢిల్లీలో కాదు, ఒకసారి తెలంగాణ పల్లెల్లోకి, గల్లీల్లోకి వచ్చి, పార్టీ కేడర్‌తో కలిసి కదిలితే అర్థం అవుతుంది, పార్టీలో ఓ జోష్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో..! ఈ స్థితిలో హైదరాబాదులో తిరుగుతూ మా పనికి పంక్చర్ చేసేటట్టు, మా పనిని అవమానించినట్టుగా ప్రత్యర్థి పార్టీకి జై కొడితే కడుపు రగిలిపోదా..? అఫ్ కోర్స్, గాడిద, బేవకూఫ్ బదులు కాస్త పాలిష్డ్ తిట్లు వాడాల్సింది, కానీ ఆ వేడిలో తన్నుకొచ్చినయ్ ఆ మాటలు..? ఏం చేసేది మరి..? అవున్లెండి, తప్పదు… మంత్రసానితనం ఒప్పుకున్నాక, టీపీసీసీ పెత్తనం తీసుకున్నాక… బిడ్డ పుట్టినా పట్టాలి, గడ్డ పుట్టినా పట్టాలి… ఏం చేస్తాం..? కడుపు చించుకుంటే నా కాళ్లమీదే కదా పడేది..
థాంక్యూ మాణిక్కం ఠాగూర్ భయ్, అర్థం చేసుకున్నవ్, అండగా ఉన్నవ్, నిలబడ్డవ్… ఐనా ఈ ఆఫ్ ది రికార్డులు, రికార్డు చేయడాలు, అధికారంలో ఉన్నవాళ్లకు పంపించడాలు వదిలేసేద్దాం భయ్యా… ఇప్పుడు ఇంగ్లిషు, నేషనల్ మీడియాతో గోక్కోవడం దేనికి..? సుపారీ జర్నలిజం అని నిందలు దేనికి..? ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం… మళ్లీ ఇప్పుడు కొత్త పంచాయితీ దేనికి ఇప్పుడు..?’’ ( ఇది రేవంత్ రెడ్డి స్వగతం కానేకాదు… కాదు… లేదు, అలాగే అనిపిస్తోంది అంటారా..? మీ ఇష్టం… )
Share this Article