‘బిగ్‌బాస్ హౌజు ఆర్డర్లో లేదు, సెట్ చేద్దాం’ అంటూ వీకెండ్ షోకు వచ్చాడు నాగార్జున… సీరియస్‌గా చూశాడు, నీతులు చెప్పాడు, కసిరాడు, మందలించాడు, కన్నెర్ర చేశాడు, టేక్ కేర్ అని బెదిరించాడు…. హహహ… అసలు ఆర్డర్లో లేనిది హౌజులో సభ్యులు మాత్రమే కాదు, ఈసారి బిగ్‌బాస్ నడుస్తున్న తీరే ఆర్డర్లో లేదు… ఆ టీమే ఆర్డర్లో లేదు… నాగార్జున వేలెత్తి చూపాల్సింది ముందుగా బిగ్‌బాస్ క్రియేటివ్ టీంను..! ప్రత్యేకించి ఇప్పుడు హౌజులో ఎవరెవరు మనుషులున్నారు, ఏమేం జంతువులున్నాయి అన్నంత రీతిలో చర్చ సాగుతోంది… అరె, బయట కాదు, సాక్షాత్తూ నాగార్జునే, టీవీ వేదిక మీదే అదే స్థాయి చర్చ పెట్టాడు… శ్వేత వర్మ అనే వైల్డ్ కేరక్టర్‌ను అలాగే రాంచరణ్‌కు పరిచయం చేశాడు… నిజంగా ఒకటీరెండు టాస్కులు, నామినేషన్ల తంతు చూస్తుంటే ‘జంతువులు’ అనే పదం వాడటానికి ఏమాత్రం వెనుకాడాల్సిన పనిలేదు… (కొందరు)… సరే, సభ్యుల్లో కొందరికి సంస్కారం వాసనలే లేవు… నోరిప్పితే బూతులు… మరి వాటిని యథాతథంగా చూపించేసి, ప్రోమోలు కట్ చేసి, వందల సార్లు ఆ ప్రోమోలు ప్రసారం చేసేసి, ఇప్పుడు వాటిపై చర్చ దేనికి నాగార్జునా..? అసలు సెట్ చేయాల్సింది ఎవరిని చెప్పు..?
ఉదాహరణకు ఉమాదేవి… ఓవరాక్షన్… నోరిప్పితే బూతుల ఝరి… ఓసారి ఓ బ్యాడ్ వర్డ్ వాడింది… దాన్ని పదే పదే చూపించి, రచ్చ చేసి, చివరకు వీకెండ్ షోలో ఆమెతోనే తప్పు అనిపించి, గుంజీలు కూడా తీయించాడు నాగార్జున… ఆ బ్యాడ్ వర్డ్ వాడిన సీన్ చూపకుండానే ఉంటే అయిపోయేదిగా… అదేమైనా ప్రత్యక్ష ప్రసారమా..? కాదు కదా… ఆఫ్టరాల్ రికార్డెడ్, ఎడిటెడ్, పక్కా స్క్రిప్టెడ్… సేమ్, మరో చర్చ… సన్నీ అనబడే వ్యక్తి సిరి అనే అమ్మాయి టీషర్టు లోపలిదాకా చేయి పెట్టి, అదేదో క్లాత్నో, దిండునో బయటికి తీశాడని ఆరోపణ… దానిపై విచారణ… చివరకు తప్పు ఏమీ జరగలేదని నిర్ధారణ… అసలు ఆ చర్చ వింటుంటేనే అదోలా అనిపించింది… నేను ఏదో భ్రమకు గురయ్యాను, తరువాత సన్నీకి సారీ చెప్పి, లైట్ తీసుకో అని కూడా చెప్పాను అంటున్నది ఆ సిరి అనే నటి.., మరిక ఇదంతా మళ్లీ చర్చకు పెట్టి, ఆ వీడియోలు చూపించి, తూచ్ అనిపించడం దేనికి..? సిరి, రవి ఒకరికొకరు హత్తుకుంటే, ఇక సిరి చేసిన కేరక్టర్ అసాసినేషన్ తప్పు మాఫీ అయిపోయినట్టట..? ఇదంతా వినోదం అనుకోవాలా ప్రేక్షకుడు..? ఇప్పుడు చెప్పు నాగార్జునా..? ఆర్డర్లో ఉండాల్సింది మీ టీమా..? హౌజు సభ్యులా..?
Ads
శ్రీరాంచంద్ర, హమీదా మధ్య లవ్ ట్రాక్ అప్పుడే స్టార్ట్ చేయిస్తున్నాడు బిగ్‌బాసోడు… ఆల్రెడీ ఉమాదేవి, లోబోల నడుమ పెట్టేశాడు, వాళ్లు తమ పాత్రల్లో జీవించేస్తున్నారు… చూసేవాళ్లకు అది ప్యూర్ నటన అని అర్థమైపోయి, స్క్రిప్టు పండటం లేదు… లహరికి ఇంకా ఎవరితోనూ లంకె పెట్టినట్టు లేదు… త్వరగా స్టార్ట్ చేయండ్రా బయ్, అవే కాస్త నయం, ఈ జంతువులు కొట్లాడుకుంటున్న టాస్కులకన్నా… అన్నట్టూ, ఉమాదేవితో గుంజీలు తీయించిన నాగార్జున శ్వేత వర్మను అంత తేలికగా ఎందుకు వదిలేసినట్టు..? ఆమె రెండు చేతులతో మొహం మీద కొట్టుకుంటే అదేనా శిక్ష..? ఇవేకాదు, మొత్తం అంతే… మగాడు గిగాడు అన్న పదంలో గిగాడు అనేది నాగార్జునకు బూతు అనిపించిందట… అందులో బూతు ఏముంది..? మగాడివైతే రా అని ప్రియ సవాల్ చేస్తే.., అలా మాట్లాడకు, మగాడు గిగాడు వంటి మాటలు మాట్లాడకు అన్నాడు రవి… అసలు ఈసారి బిగ్‌బాస్ టీంలో అందరూ ఇలాంటి గిగాళ్లే జమయినట్టు కనిపిస్తోంది…
బిగ్‌బాస్ నడుస్తున్న తీరే చెత్తచెత్తగా ఉంది ఈసారి… లగ్జరీ బడ్జెట్ కోసం బిగ్‌బాసోడు పై నుంచి ఓ గొట్టం ద్వారా బాల్స్ వేస్తాడు, టీవీ తెరపై పేర్లు వచ్చిన సభ్యులు వెళ్లి వాటిని కిందపడకుండా పట్టుకోవాలి… యానీ మాస్టర్ పట్టుకోవాల్సిన బాల్‌ను నటరాజ్ మాస్టర్ ఉరికొచ్చి మరీ పట్టుకుని, ఆమె చేతిలో పెడతాడు… ఇదేం ఆటరా బయ్… అసలు ఈసారి వీకెండ్ షో కూడా చూడండి… డిస్పీ-హాట్‌స్టార్‌కు రాంచరణ్ బ్రాండ్ అంబాసిడరట… (3 కోట్ల పారితోషికం ఇస్తున్నారులెండి… దేనికైనా రేటుంటుంది ఇండస్ట్రీలో…) అసలు ఒక ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్ అనేదే కొత్తగా ఉంది… బిగ్‌బాస్ సమర్పించేది స్టార్ వాడే కదా… రాంచరణ్ ఈ వీకెండ్ షోకు వచ్చాడు… పరస్పరం పొగడ్తలు, భజనలు అయ్యాక నాగార్జున సభ్యుల్ని పరిచయం చేశాడు… హాట్ స్టార్ వీడియోలు చూపించారు… మాస్ట్రో టీం నితిన్, తమన్నా, మరో హీరోయిన్ వచ్చారు… ఓ జోష్ లేదు, ఓ ఎనర్జీ లేదు… పైగా ఇదంతా అయ్యేసరికి ముప్పావు గంట… పక్కా ప్రమోషన్… స్టార్ వాడి సొంత డబ్బా… ఇదంతా మనం వినోదం అనుకోవాలి… ఖర్మ…!!
Share this Article