ఆదానీ తెలివైనోడు… ఎంత తెలివైనోడు కాకపోతే సంపదలో వేగంగా అంబానీకి చేరువవుతున్నాడు మరి…! మనం చెప్పుకునేది ఏమిటంటే..? ఆదానీకి మీడియా దందా ఎంత లాభసాటో అర్థమైంది… లేటుగానైనా సరే, లేటెస్టుగా సమజైంది… కళ్లు తెరుచుకున్నయ్… అరె, మనం ఇన్ని రంగాల్లోకి మన వేళ్లను విస్తరించాం కదా, అసలు ఇన్నేళ్లూ మీడియా అనే దందాను ఎందుకు వదిలేశాం అని ఆత్మమథనంలో పడ్డాడు… వెంటనే నిర్ణయం తీసేసుకున్నాడు… మనం కూడా మీడియాలో అడుగుపెట్టేయాలి… ముందుగా ఒక చీఫ్ ఎడిటర్‌ను అపాయింట్ చేసేశాడు… ఆయన ఎవరయ్యా అంటే… క్వింట్ మీడియా హౌజు ఉందిగా, దానికి ఇన్నాళ్లూ ప్రెసిడెంట్ కమ్ ఎడిటోరియల్ డైరెక్టర్… పుగళ్ల సంజయ్… ఆయన నిన్న తన పోస్టుకు రాజీనామా చేసేసి, ఆదానీ గ్రూపు ఎడిటర్ ఇన్ చీఫ్ అయిపోయాడు…
మీడియా అంటే… అదొక దందా… బినామీ పెట్టుబడులు, వందల కోట్ల లావాదేవీలు, షెల్ కంపెనీలు, అక్రమార్జనల్ని రకరకాల మార్గాల్లోకి మళ్లించే గేట్ వే అది… పైగా మీడియా ఫేస్ అనేది అదనపు సుఖం… అందులో వచ్చే లాభాల మాట ఎలా ఉన్నా… అదొక ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు… మన దేశంలోనే మీడియా సంస్థల మీద బోలెడన్ని ఈడీ కేసులున్నయ్, అఫ్ కోర్స్, ఎవరికీ శిక్షలు పడవు, ఎటూ తేలవు, ఒకటీ అరా తలనొప్పులు తప్ప..! మన తెలుగు మీడియాలు కూడా శుద్ధపూసలేమీ కాదు తెలుసు కదా… అసలు ఈ ట్రెండ్ ఇక్కడిదే కాదు, అంతర్జాతీయం… న్యూస్18 అని రిలయన్స్ వాడు ఎప్పుడో మీడియా దుకాణం తెరిచేశాడు… (కాకపోతే ఆ నెట్‌వర్క్ ప్రొఫెషనల్ క్వాలిటీ పరమవికారం)… అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్టునే కొనేశాడు…
Ads
అంబానీలాగే దేశాన్ని శాసిస్తున్న, ఇంకా శాసించాలని తహతహలాడుతున్న ఆదానీకి మీడియా హౌజు లేకపోతే అది నామర్దాయే కదా మరి… అందుకని అర్జెంటుగా మీడియా దుకాణం ఓపెన్ చేస్తున్నాడు… దానికి ఇప్పుడు ఎడిటర్‌గా తీసుకున్న సంజయ్‌కు పాత్రికేయంలో నలభై ఏళ్ల సీనియారిటీ ఉంది… పలు మీడియా సంస్థల్లో మంచి హోదాల్లోనే పనిచేశాడు… ఇంతకీ సదరు మీడియా హౌజు రూపస్వభావాలేమిటి..? ఇప్పుడైతే బుద్ధి ఉన్నవాడెవడూ ప్రింట్ మీడియాలో జోలికి పోడు… మరి ఆదానీ వెళ్తాడా..? వెళ్లడు కదా… వీలయితే టీవీ చానెళ్లు ప్లస్ డిజిటల్ మీడియా పెట్టేయాలని ఆలోచిస్తున్నాడట… అసలు కొత్తగా టీవీ చానెళ్లు పెట్టి, కష్టపడటం దేనికి..? లాభాల్లో ఉన్న ఓ వర్కింగ్ చానెల్‌నే కొనేస్తే పోలా..? అవును, ఆదానీ అదే ఆలోచనలో ఉన్నాడు… మైహోంకు టీవీ9 దొరికినట్టు, ఆదానీకి ఇంకేదో చానెల్ దొరక్కపోదు… డౌటేముంది..? అది కూడా మరో రిపబ్లిక్ టీవీలాగా కాషాయగీతమే ఆలపిస్తుంది… ఐనా లక్షల కోట్ల సంపద ఉన్నా సరే, సొంత మీడియా ఉంటే కలిగే కిక్కే వేరప్పా…!! ఎలాగూ సందర్భమొచ్చింది కదా చెప్పుకుందాం… హిందుస్థాన్ టైమ్స్, ఏబీపీ వంటి మీడియా హౌజులు కూడా తెలుగులో న్యూస్ సైట్లు తెరవబోతున్నయ్… రిపోర్టర్లను రిక్రూట్ చేసుకుంటున్నయ్… తెలుగులో డిజిటల్ పాత్రికేయ స్పర్థ గణనీయంగా పెరగబోతోంది… మంచిదేగా… స్వాగతిద్దాం…!!
Share this Article