పాపం.. పచ్చమీడియా.. కొన్ని సార్లు అనుకుంటాం.. ఇంత కష్టం పగవాడికి కూడా రావొద్దని. ఇప్పుడు అంతకంటే పెద్ద కష్టం.. పాపం టిడిపి అనుకూల మీడియాకు వచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చిత్ర విచిత్ర మలుపులు తిరిగి.. చివరికి ఓట్ల లెక్కింపు వరకు వచ్చింది. చంద్రబాబుకు మొదటి నుంచి స్థానికసంస్థలంటే ఎందుకో అనుమానం. తాను అధికారంలో ఉన్నప్పుడే, 2018లో జరగాల్సిన ఎన్నికలను పక్కనబెట్టారు. మరీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరగాలని కోరుకుంటారా? అందుకే తన రహస్య మిత్రుడు నిమ్మగడ్డకు ఎలాంటి సంకేతాలిచ్చారో తెలియదు కానీ.. ఎన్నికలు మాత్రం విచిత్ర విన్యాసాలతో వాయిదా పడుతూ వచ్చాయి. సరే, ఇది వైసీపీ క్యాంపు ఆరోపణ అనుకుందాం…
గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ.. ఏకగ్రీవాల తర్వాత పరిస్థితి అనుకూలంగా లేదని తేల్చి కరోనా పేరు చెప్పి వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కావాలనడం, రాష్ట్ర ఎన్నికల సంఘం వద్దనడం.. కోర్టుల్లో కేసులు నడవడం డైలీ సీరియల్లా నడిచాయి.
కరోనా టైంలో ఏపీలో కేసులు ఉధృతంగా రావడంతో టిడిపి తమకు అనుకూలంగా ఉంటుందని భావించింది. మళ్లీ ఎన్నికలు పెడతానని నిమ్మగడ్డ అనడం, వద్దు వద్దు అని ప్రభుత్వం చెప్పడం.. మళ్లీ కోర్టుల్లో కేసులు.. సరే ఎన్నికలు మొదలెట్టారు, మొదట పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనుకున్నా.. ఎందుకైనా మంచిదని సర్పంచులతో మొదలెట్టారు. ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. టిడిపికి కర్రు కాల్చి వాత పెట్టినట్టయింది. మొత్తం 13097 పంచాయతీల్లో 10382 చోట్ల వైఎస్సార్‌సిపి గెలిచింది. అంటే 82 శాతం.
అయితే గుర్తులతో జరిగిన ఎన్నిక కాదు కనక.. మేం గనక పార్టీ గుర్తుతో పోటీ చేస్తే.. అన్నంత వరకు వచ్చి ఆగిపోయారు టిడిపి నాయకులు.
అబ్బో.. ఇలాగయితే పరిస్థితి బాలేదు. గ్రామాల్లో అంతా ఫ్యాన్ హవా ఉంది, పట్టణాల్లో పరిస్థితి తేడాగా ఉండొచ్చన్న అంచనాతో మున్సిపోల్స్ నిర్వహించారు. ఇక్కడా సీన్ రివర్సయింది. 11 కార్పోరేషన్లకు గాను 11 చోట్ల.. 75 మున్సిపాలిటీలకు గాను 74 చోట్ల వైఎస్సార్‌సిపి గెలిచింది.
Ads
మిగిలింది జెడ్పీటీసీ ఎన్నికలు. అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చిన నిమ్మగడ్డ.. నా పదవి కాలం ముగిసిందంటూ వెళ్లిపోయారు. మీ ఎన్నికలు మీ ఇష్టం అంటూ చెప్పేసారు. సరే, అంటూ నీలంసాహ్ని ఎన్నికలు పెట్టగానే.. టిడిపి నేతలు బహిష్కరణ మంత్రం పఠించారు. మేం పోటీ చేయట్లేదహో.. అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బాబు అనుకూల మీడియా కూడా కోరస్ ఇచ్చింది. నిజానికి చాలా జిల్లాల్లో టిడిపి ప్రచారం చేసింది. కొన్ని చోట్ల గట్టిగా తిరిగింది. మళ్లీ మ్యాటర్ కోర్టుకు వెళ్లడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమయింది.
ఇవ్వాళ కౌంటింగ్. ఎటూ టిడిపికి ఆశల్లేవు. అయితే చిక్కంతా బాబు అనుకూల ఏబీఎన్, టీవీ5కి వచ్చింది. ట్యాలీల్లో, స్క్రోలింగ్‌ల్లో టిడిపి పక్కన బహిష్కరణ అని ఇచ్చేశారు. మరీ సైకిల్ గుర్తుతో గెలిచిన వాళ్లను ఎక్కడ చూపించాలన్నది పెద్ద చిక్కొచ్చి పడింది. ఎక్కడయితే బహిష్కరణ అని ఇచ్చారో అదే స్క్రోలింగ్‌లో టిడిపి వాళ్లు అక్కడ గెలిచారు, ఇక్కడ గెలిచారు.. అని కొన్ని సీట్ల పేర్లు రాసుకొచ్చారు. అటు ట్యాలీని, ఇటు స్క్రోలింగ్‌ను బ్యాలెన్స్ చేయడం ఎంతకష్టమో.. పాపం పచ్చ మీడియాకు అర్థమయింది.
ఇంత జరిగినా.. బాబు విషయంలో మాత్రం తేడా రానీయలేదు. కుప్పం నియోజకవర్గంలో టిడిపి విజయాలు అంటూ ఏబీఎన్‌లో బ్రేకింగ్‌లు, ట్వీట్లు వచ్చాయి. ఆసక్తితో లెక్క ఎంత అని చూసినవారికి ఆశ్చర్యం, షాక్ రెండూ ఒకటేసారి తగిలాయి. కుప్పం మండలంలో 21 స్థానాలుంటే, టిడిపి గెలిచింది 2. మొత్తం కుప్పం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీలుంటే టిడిపి గెలిచింది 3. నిజానికి టిడిపి అయినా, బాబు అనుకూల మీడియా అయినా.. గెలుపోటములను సమానంగా స్వీకరించాల్సి ఉండి ఉంటే.. ఈ పరిస్థితి రాకపోయేది. లేని వాస్తవాలను ఉన్నట్టుగా భ్రమించడమే కాదు, దాన్ని నమ్మించడానికి ప్రయత్నించడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ఒక ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన.. పార్టీ మూసుకోవాల్సిన అవసరం లేదని గట్టిగా నమ్మి.. అదే విషయాన్ని నిజాయతీగా చెప్పుకుని ఉంటే.. జనం స్వాగతించేవారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. నేరుగా జనంలోకి వెళ్లి.. ప్రజల సమస్యలపై పని చేస్తే 2024 కల్లా గౌరవ ప్రదంగా ఉండొచ్చు. దానికి బదులు.. నేల విడిచి ఢిల్లీలో చక్రం తిప్పుతానంటే .. ఇలాంటి ఫలితాలే పునరావృతం కావొచ్చు.
- ఎస్‌జీ
Share this Article