భాగవతం, రామాయణం తదితర హిందూ పౌరాణికాలకన్నా… మహాభారతం భిన్నమైంది… అదొక సముద్రం… లోతుల్లోకి వెళ్లేకొద్దీ అనేకానేక జీవితపాఠాలు… అయితే అవన్నీ ఈ కాలానికి వర్తిస్తాయా, మనం వాటిని ఎలా స్వీకరిస్తాం అనేది వేరే విషయం… కానీ వేల ఉపకథలు, వేల పాత్రలు, వేల వ్యక్తిత్వాలు… వాటి నడుమ సంఘర్షణ, బంధాలు, మోసాలు, వ్యూహాలు… భారత కథలకు సంబంధించి వచ్చినన్ని కళారూపాలు వేరే ఏ గ్రంథంపైనా రాలేదేమో బహుశా… చివరకు పాత్రల నడుమ సంభాషణలు కూడా విస్తృత రచనావస్తువులయ్యాయి… అందులో ప్రధానమైంది కర్ణుడు- కృష్ణుడి నడుమ జరిగినట్టు చెప్పే సంభాషణ… కల్పనే కావచ్చు, కానీ కదిలించేదే… నిజానికి కర్ణుడు- కృష్ణుడు రెండు సమాంతర రేఖలు… కానీ తరచి చూస్తే అక్కడక్కడా కలిసిపోయిన పోలిక గోచరిస్తుంది…
రా కృష్ణా, నువ్వు కబురు పంపించినట్టుగానే, ఎవరూ లేకుండా ఒంటరిగా నిరీక్షిస్తున్నా నీకోసం… అభివాదం…
Ads
నిన్ను చూస్తే ఓ భిన్నమైన భావన, ఏదో తెలియని ఆత్మీయత కమ్మేస్తాయి నన్ను కర్ణా… తప్పుడు శిబిరంలో పొరపాటున ఇరుక్కుపోయిన మంచి పాత్రలాగా గోచరిస్తావు… ఎందుకంటావు..?
జగన్నాటక సూత్రధారివి… నన్నడుగుతావేం కృష్ణా… అసలు నువ్వు నన్ను కలవడానికి రావడం అనేదే ఓ గొప్ప విశేషం… నీ ప్రత్యర్థి శిబిరంలో ఉన్నా సరే, నేను నీ అడుగుల్ని, ఆలోచనల్ని అభిమానిస్తాను కృష్ణా… ఐనా త్వరగా చెప్పెయ్, ఊరకరారు మహానుభావులు…
పోనీ, నువ్వు నా రాకకు కారణం ఏం ఊహిస్తున్నావ్ కర్ణా…
ఊహ దేనికి..? నిజమే చెబుతా… నిన్ననే పాండవుల తల్లి వచ్చిపోయింది నా దగ్గరకు, నా జన్మరహస్యం వెల్లడించింది… శిబిరం మార్చుకోమని అడిగింది… నువ్వూ అదే అడగడానికి వచ్చావు, అంతేనా కాదా..?
నిజమే కర్ణా… నీ తల్లికి నువ్వేమని బదులిచ్చావు..? తల్లి అని తెలిసీ ఆమె కోరికను తిరస్కరించావా..?
కృష్ణా… ఆమెను తల్లిగా చూడలేదు, చూడలేను, నా దగ్గరకు బోలెడు మంది రోజూ ఏదో సాయం, ఏదో దానం కోసం వస్తుంటారు… ఆమె కూడా తన కొడుకుల ప్రాణరక్ష కోరుతూ వచ్చింది… అంతేతప్ప, నా తల్లిగా రాలేదు, నా మేలు కోసం రాలేదు, నాపై ఆమెకు ప్రేమలేదు… తన అవసరం కాబట్టి ఆమెలోని అమ్మ రూపాన్ని ఓ పాచికగా బయటికి తీసింది… అలాంటి స్త్రీని అమ్మా అని ఎలా పిలవను..? అందుకే అమ్మా అని ఒక్కసారి కూడా సంబోధించలేకపోయాను కృష్ణా… కానీ నా దగ్గరకు వచ్చినవారెవ్వరూ దానం తీసుకోకుండా పోలేదు, నేను అలా ఖాళీ చేతులతో పంపించను… అర్జునుడు తప్ప ఇంకెవరు నాకు దొరికినా హాని చేయబోను అని హామీ ఇచ్చాను… ఆమె పెద్దకొడుకుగా కాదు సుమా… కేవలం కర్ణుడిగా మాత్రమే…
కర్ణా, నేనూ నీ శిబిరం మార్చుకొమ్మని అడగాలనే వచ్చాను… నాకూ అదే సమాధానమా..?
అవును కృష్ణా… నేనిలాగే బదులిస్తానని కూడా నీకు తెలుసు… ఐనా ఒక ప్రయత్నం చేస్తున్నావు, నన్ను పరీక్షిస్తున్నావు…
కర్ణా, నువ్వు శిబిరం మారితే రాజ్యం దక్కుతుంది, సువిశాల ఆర్యావర్తం నీదవుతుంది, అన్నింటికీ మించి నువ్వు కోరుకుని, స్వయంవరంలో కూడా ప్రయత్నించిన ద్రౌపది నీదవుతుంది… నువ్వు ఆరో భర్తగా ఆమెను నేను ఒప్పిస్తాను… సూతపుత్రుడివని నిన్ను ఈసడించుకున్న రాచమహిళను పెళ్లాడి సొంతం చేసుకోవడంలోని పురుషానందం నీకు తెలియంది కాదు…
కృష్ణా… మళ్లీ పరీక్ష పెడుతున్నావు… నాకిప్పుడు ఆమె మీద కోరిక లేదు, ఆసక్తి లేదు… నా కొడుకులే నా అంత పెరిగి యుద్ధవీరులయ్యారు… పైగా ఆమె పట్ల నాకొక అపరాధ భావన ఉంది… నిండు సభలో ఆమెను కులట అని దూషించాను, నాది తప్పే, దానికి నిష్కృతి లేదు, ఆమె కళ్లల్లోకి నేను చూడలేను… ఇక పెళ్లా..? అయిదు అని దూషించినవాడిని, ఆరుగా ఆమెకు జత కలవగలనా కృష్ణా… ఇక రాజ్యం అంటావా..? నాకు అంగరాజ్యమైనా, ఆర్యావర్తమైనా ఒకటే… ఐనా రాజ్యం కోసమే కదా పాండవుల యుద్ధకాంక్ష, అది ఇప్పించడానికే కదా నీ మద్దతు, నీ మేనత్త ప్రయత్నం… వాళ్లు నన్నెందుకు రాజుగా అంగీకరిస్తారు… ఇచ్చినా ఆ రాజ్యం నాకెందుకు..? అది దానం అవుతుంది… నేను దానం చేసేవాడినే గానీ తీసుకునేవాడిని గాను కృష్ణా… రాజ్యం వీరభోజ్యం, గెలవాలి తప్ప దానంగా పొందడం క్షాత్రధర్మం కాదు…
స్వార్థపరుడు, రాజ్యం కోసం వ్యక్తిత్వాన్ని వీడినట్టు దుర్యోధనుడు కోపగిస్తాడని, లోకం పరిహసిస్తుందని భయమా కర్ణా…
దుర్యోధనుడు అంత సంకుచితుడు కాదు… అడిగితే పట్టాభిషేకం చేస్తాడు నాకు… లోకనింద నాకు కొత్తేమీ కాదుగా కృష్ణా…
కర్ణా, ధర్మం వైపు నిలబడాలని ఎందుకు ఆలోచించవు..? ధర్మం పక్షాన ఉండటమే పుట్టుకకు సార్థకత కదా..?
ఏది ధర్మం కృష్ణా..? నన్నొక రాజును చేసి, నా ఉనికికి ఓ గుర్తింపునిచ్చి, నన్ను ఆంతరంగికుడిగా విశ్వసించిన నా నిజమైన స్నేహితుడి వెంట నిలబడటమే నేను నమ్మిన ధర్మం… తన కోసం తప్పులు కూడా చేశాను, తప్పులని తెలిసీ ధైర్యంగా చేశాను, స్నేహధర్మంగా చేశాను… తన వెంట ఓ సైనికుడిని, అంతే… పాపమో, పుణ్యమో… మరణానంతరం స్వర్గమో, నరకమో… సిద్ధంగా ఉన్నాను కృష్ణా… ధర్మాధర్మ మీమాంసలోకి కూడా నేను వెళ్లను… దుర్యోధనుడి వెంట వెళ్లడం తప్ప… ఐనా నువ్వు రాజ్యం కోసం యుద్ధానికి సిద్ధపడిన పాండవులకు మద్దతునివ్వడం నీకు ధర్మమెలా అవుతుంది కృష్ణా..?
నువ్వు చెప్పిన కారణాలే కర్ణా… ఐతే అందరూ అనుకున్నట్టుగా నా మేనత్త కొడుకులు కాబట్టి, నేను పాండవుల వైపు ఉన్నానని నువ్వూ భ్రమపడకు… వైరం అంటూ మొదలయ్యాక, యుద్ధంలో దిగాక బంధుత్వాలు అప్రస్తుతాలు… కృష్ణ… అంటే ద్రౌపది… నన్ను పరిపూర్ణంగా విశ్వసించే, ఆరాధించే నా భక్తురాలు, నా స్నేహితురాలు… అనేక సందర్భాల్లో ఆమె కడగండ్లపాలు గాకుండా కాపాడలేకపోయాననే ఆత్మనిందలో పడిపోయాను… ఇంద్రప్రస్థ పట్టమహిషిని, సొంత కుటుంబ, కులీన మహిళను సభలో వివస్త్రను చేయడానికి ప్రయత్నించిన కౌరవుల ఏహ్యమైన మానసికధోరణి మీద ఆమెకు పగ… అది తీరాలంటే యుద్ధం జరగాలి… ఆమె గెలవాలి… అందుకే నాది పాండవశిబిరం, అది నేను నమ్మిన ధర్మం… యుద్ధం గెలిపిస్తే నాకేమీ రాజ్యాలు రావు, ఐనా నా ద్వారకలోనే నేను రాజును కాను, కేవలం రాచసోదరుడిని మాత్రమే…
కృష్ణా, నిజమే… ధర్మానికి ఎవరి బాష్యం వాళ్లది… ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ… అందరికీ కౌరవ పక్షాన నిలబడినందుకు వాళ్ల ధర్మ భాష్యాలు వేరు… ఏది ధర్మమో నీ కోణంలో సూత్రీకరించకు కృష్ణా… నేను నమ్మిన ధర్మం వైపే నన్ను ఉండనీ… చావో, బతుకో తేలిపోనివ్వు కృష్ణా… చావు చింత లేదు నాకు, వీరుడిని… చావును ఆహ్వానించేవాడినే తప్ప బీరువుగా పారిపోను… యుద్ధంలో గెలిస్తే స్నేహితుడికి ఓ కానుక ఇచ్చినవాడిని అవుతాను… రుణం తీర్చుకోవడం కాదు, ప్రాణాలొడ్డి నా స్నేహితుడి విజయాన్ని, గౌరవాన్ని దక్కించడం… ఒకవేళ ఓడిపోయి మరణిస్తే నా శాపగ్రస్త జీవితానికి ముగింపు, ఇక చాలు కృష్ణా… పుట్టగానే తల్లి వదిలించుకుంది, నదిలో పడేసింది, విద్య నేర్పడానికి ద్రోణుడు ఛీత్కరించాడు, సూతుడివి అని తూలనాడాడు, విద్య నేర్పిన పరుశురాముడూ శపించాడు… ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు తీసుకుపోయాడు, యుద్ధంలో నా రథం కూరుకుపోవాలని ఏదో శాపం… నా ప్రమేయం, నా తప్పేమీ లేకుండానే శాపాలు… నేనెన్ని దానాలు చేసినా విధి నన్ను పరిహసిస్తూనే ఉంది కృష్ణా…
కర్ణా, నువ్వూ నేనూ ఒకటే కదా… కారాగారంలో జన్మించాను, పుట్టుకకు ముందు నుంచే నాకోసం మృత్యువు నిరీక్షిస్తూ ఉంది… పుట్టాక ఎక్కడికో భయంభయంగా తరలించబడ్డాను… నువ్వు కనీసం రథాలు, డాళ్లు, బాణాలు, నగరం నడుమ పెరిగావు… నేను ఆవుల మందల మలమూత్రాలు, ఆ వాసనల నడుమ పెరిగాను… విద్య లేదు, గోవులు కాస్తూ ఎదిగాను… రోజుకొక రాక్షసుడో, రాక్షసో వచ్చేది, చంపడానికి ప్రయత్నాలు… ఊరుఊరంతా గగ్గోలు… ప్రతిరోజూ నాకు గండమే… పదహారేళ్లకు సాందీపని మహర్షి వద్దకు వెళ్లేవరకూ నాకు విద్య లేదు… వరుస పరాజయాలు, పరాభవాలతో ఆ జరాసంధుడికి భయపడి నా రాజధానినే సముద్రతీరానికి మార్చేశాను… జనం అందరూ పిరికివాడని, అసమర్థుడిననీ వెక్కిరించారు… ఇప్పుడైనా యుద్ధంలో గెలిస్తే ధర్మరాజు నాకు ఇచ్చేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు… పైగా లక్షల మంది మరణానికి, యుద్ధానికీ నేనే కారణమని ప్రపంచం నన్నే నిందిస్తుంది… తరచి చూస్తే నువ్వూ నేనూ ఒకటే కర్ణా… కాకపోతే పరాభావం, పరాజయం సందర్భంలో మన ప్రతిస్పందనలు వేర్వేరు, అవే మన గతుల్ని, ఫలితాల్ని నిర్దేశిస్తున్నాయి, అంతే… నువ్వు పరాజితుడివీ కాదు, నేను విజేతనూ కాను… అలా జరగాల్సి ఉంది, జరిగింది…
స్పష్టతనిచ్చావు కృష్ణా… నేను ఎటువైపు, ఎందుకు అనే వీసమెత్తు సందిగ్ధత ఏదో ఇన్నాళ్లూ నాలో ఉండేది… ఇప్పుడు అదీ పోయింది… ఇక వెళ్లు కృష్ణా… దానమో, సాయమో… నన్ను ఏదో ఓ కోరిక కోరి శూన్యహస్తాలతో వెళ్తున్న మొదటి వ్యక్తివి నువ్వే… ఐనా దేవుడివి, నీకు నేనేం ఇవ్వగలను..? యుద్ధరంగంలో కలుద్దాం.., అర్జునసారథివి, నా బాణాలు తగిలి బాధిస్తే మాత్రం నన్ను నిందించకు… కోపమొస్తే నన్ను వెంటనే వధించి, నీలో ఐక్యం చేసుకో కృష్ణా… ఆనందంగా ఆయుధాలు విసర్జించి ఆహుతి అవుతాను… చూశావా..? నా నుంచి ఏదో కోరుతూ వచ్చావు, నేనివ్వలేదు సరికదా నేనే నిన్ను ఇలా కోరుకుంటున్నాను, ఇదేనా నువ్వు చెప్పే విధివిలాసం కృష్ణా…?
కర్ణా… ఒక్కటి మాత్రం నిజం, నాకు నువ్వేమిటో తెలిసీ పరీక్షించాను… నన్ను గెలిచావు కర్ణా… దానం, ధర్మం, స్నేహం, పౌరుషం, నైపుణ్యం, ప్రేమ… నువ్వొక ఆదర్శం… రా, నన్ను ఓసారి కౌగిలించుకో… బహుశా ఇది చివరి కలయికేమో… నా ప్రశంసాలింగనం దుర్లభం… అది నీకు దక్కడం అంటేనే, అది నీకు నేనిచ్చే అత్యున్నత యోగ్యతాపత్రం… సెలవు…
Share this Article