మునుపు… నాలుగు బట్టలు సంచీలో కుక్కుకుని, బస్సెక్కి కూర్చుంటే చాలు… సంపూర్ణ తీర్థయాత్ర, దక్షిణభారత యాత్ర, ఉత్తర భారత యాత్ర అంటూ రకరకాల సర్వీసులు నడిపించేవారు… తిండీతిప్పలు, సత్రాల గోల అంతా నిర్వాహకులే పడేవాళ్లు… ఇప్పుడు కూడా ఒకటీఅరా అక్కడక్కడా ఈ సర్వీసులు ఉండొచ్చు… నిజానికి అది చాలా సుఖం… ఒకసారి డబ్బు చెల్లిస్తే చాలు, నిర్వాహకులే మొత్తం ఆర్గనైజ్ చేసేవాళ్లు… ఎక్కడో రోడ్డు పక్కన బస్సు ఆపుకోవడం, కట్టెలు అంటించడం, ఎంచక్కా మన తిండినే వండిపెట్టడం… యాత్రికులను ఎప్పుడు, ఎక్కడ దింపాలో, ఏ టైంకు ఏ సెంటర్కు వెళ్లాలో అన్నీ వాళ్లకు తెలుసు… అఫ్ కోర్స్, ఇప్పుడు కూడా టూర్ ట్రావెల్స్ రకరకాల ప్యాకేజీలతో ఆర్గనైజ్ చేసేవాళ్లు ఉన్నారు, దేశవిదేశాలకూ తీసుకెళ్తారు, కాకపోతే ఎక్కువ రేట్లు, నాసిరకం సర్వీసులు… పైగా అవి టూరిజం ప్లేసెస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాయి తప్ప టెంపుల్ సర్క్యూట్స్కే పరిమితమైన ప్యాకేజీలు తక్కువే… ప్రత్యేకించి మనకు అంతగా తెలియని చార్ ధామ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే కాస్త ఇబ్బంది…
పాత తీర్థయాత్రల సర్వీసుల పనినే ఇప్పుడు ఐఆర్సీటీసీ చేస్తోంది అప్పుడప్పుడూ… ఆమధ్య శ్రీరామాయణ యాత్ర అని ఓ ప్రత్యేక టూర్ ప్యాకేజీ సక్సెస్ చేసుకుంది… ఇప్పుడు చార్ ధామ్ యాత్ర అంటోంది… దానికి దేఖో అప్నా దేశ్ అని పేరుపెట్టింది… 16 రోజుల యాత్రా స్పెషల్, ప్రత్యేక రైలు… ఈ టూర్ ఢిల్లీ, సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి మొదలై రిషికేష్, జోషిమఠ్, బద్రీనాథ్, పూరి, రామేశ్వరం, ద్వారక కవర్ చేస్తుంది… ఈ యాత్రలో గంగ ఆరతితో పాటు లక్ష్మణ్ ఝూలా, త్రివేణి ఘాట్, రామజన్మభూమి, హనుమాన్ గఢి, సరయూ ఆరతి, నందిగ్రామ్, కాశీ విశ్వనాథ్, జగన్నాథ్ గుడి, కోణార్క్ గుడి, చంద్రభాగ బీచ్, ధనుష్కోటి, ద్వారకాధీశ్ గుడి… ఇవీ యాత్రికులు సందర్శించుకోవచ్చు… మొత్తం 8500 కిలోమీటర్ల యాత్ర… 16 రోజులు… ఈ ప్రత్యేక రైలులో రెండు డైనింగ్ రెస్టారెంట్లు… ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ అని రెండురకాల కోచులు… ప్రతి కోచ్కూ సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలు…
Ads
యాత్రలో భాగంగా ఆరు చోట్ల రాత్రి వసతి బయట డీలక్స్ సదుపాయాలతో కల్పిస్తారు… 9 రాత్రులు రైలులోనే పడక… కేవలం శాకాహారం, అదీ వాళ్ల మెనూ ప్రకారమే వడ్డిస్తారు… బీమా కవరేజీ ఉంటుంది… (చెప్పడానికి బాగానే చెబుతారు గానీ ఐఆర్సీటీసీ సర్వీస్ నాసిరకంగా ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి…) యాత్రలో భాగంగా బోటింగులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, సైట్ సీయింగ్, ఎంట్రన్స్ ఫీజు, లోకల్ గైడ్స్ ఛార్జీలు గట్రా యాత్రికులే భరించాలి… కనీసం ఒక్క కరోనా వేక్సిన్ డోసయినా వేసుకుని ఉండాలి, కరోనా సంబంధ జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించాలి… ఇవన్నీ కామనే గానీ… రేటు కూడా ఎక్కువే… ఫస్ట్ ఏసీ అయితే లక్షాపదివేలు… 8500 కిలోమీటర్లు, 16 రోజులు అంటే ఈమాత్రం రేటు సమంజసమే అంటారా..? సరే, సెకండ్ ఏసీ అయితే 90 వేలు… ఇందులో ఒకటీఅరా మినహా మొత్తం ఉత్తరభారత కేంద్రాలే ఉన్నాయి… అంటే దారిమధ్యలో ఉన్న ప్రధాన తీర్థయాత్రా కేంద్రాలను కలపలేదు… పైగా ఇది కేవలం ఢిల్లీ నుంచి బయల్దేరి, మళ్లీ ఢిల్లీకి తీసుకొచ్చే యాత్ర… చెన్నై నుంచి మొదలుపెట్టి సికింద్రాబాద్ మీదుగా చార్ ధామ్ సర్క్యూట్ కవర్ చేసేలా ప్లాన్ చేస్తే… చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది… సౌతిండియా యాత్రికులకూ సౌకర్యం… ఐనా అవన్నీ అంత జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేస్తే దాన్ని ఐఆర్సీటీసీ అని ఎందుకంటారు..?!
Share this Article