రినో… అంటే ఖడ్గమృగం… ముట్టె మీద మొలిచి, పెరిగే ఖడ్గం వంటి కొమ్ముతో ఆ పేరొచ్చింది… ఆ కొమ్మును చైనా సంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధులకు మందుగా వాడతారనీ, బ్లాక్ మార్కెట్లో అందుకే దానికి భారీ రేటు పలుకుతుందనీ ఎన్నాళ్లుగానో వింటున్నదే… ఏటా ఆ డబ్బు కోసం ఖడ్గమృగాలను వేటాడుతున్నారు, మరణించిన మృగాల కొమ్ములను కోసుకుంటున్నారు, కొందరు కొమ్ముల్ని కోసేసుకుని తిరిగి వదిలేస్తున్నారు… ప్రత్యేకించి మన ఈశాన్య రాష్ట్రాల్లో ఇది అధికం… వేటగాళ్ల దగ్గర స్వాధీనం చేసుకున్నవీ, తమకు అడవుల్లో దొరికినవీ ఎప్పటికప్పుడు అటవీ శాఖ భద్రంగా బీరువాల్లో దాచిపెడుతోంది… వాటిని ఏం చేయాలి…? ఎవరికీ తెలియదు… వాటి విలువ అపారం, కానీ అమ్మలేరు, ఇంకేమీ చేయలేరు… అలా ఏళ్లుగా బీరువాల్లో మూలుగుతున్నయ్… ఓహో, వాటి విలువ అపారం కాబట్టే ప్రభుత్వం కూడా వాటిని భద్రంగా దాస్తున్నది అని ప్రజలు అనుకుంటున్నారు… ఈ భావన వేటగాళ్ల వేటకు మరింత ఊతం ఇస్తున్నది…
నిజానికి ఆ కొమ్ము ఏమిటో తెలుసా..? మన వెంట్రుకలు, గోళ్లలో ఉండే పదార్థమే గట్టిగా కొమ్ముగా పెరుగుతుంది… మనిషి మరణించాక కూడా కొన్నాళ్లు వెంట్రుకలు, గోళ్లు పెరుగుతూనే ఉంటాయి తెలుసు కదా, ఇదీ అంతే… ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రిగా వచ్చిన హిమంత విశ్వశర్మ వీటిని ఏం చేద్దాం అని ప్రశ్నించాడు అటవీ శాఖ అధికారులను… ఎవరూ బదులు చెప్పలేదు… వీటికి ఏదో విలువ ఉందని మనమే పరోక్షంగా సమాజానికి చెబుతున్నాం కదా, అది కరెక్టేనా అనడిగాడు… నో ఆన్సర్… సెప్టెంబరు 22… ప్రపంచ ఖడ్గమృగ దినం… ఆరోజు వీటిని మనమే కాల్చేద్దాం అన్నాడు… తద్వారా ఇవి గోళ్లు, వెంట్రుకల్లాంటివే తప్ప వీటికి ఏ ఔషధవిలువ లేదు అని చెప్పడం అన్నమాట… వాటి చుట్టూ అల్లుకున్న ఓ భ్రమను తుత్తునియం చేయడం… గొప్పదీ అని చెప్పలేం, కానీ మంచి నిర్ణయమే…
Ads
ఎందుకైనా మంచిది, ముందే అన్నీ పరిశీలించండి అన్నాడు… అంటే అన్ని కొమ్ములనూ ఓసారి పరీక్షించడం, అసలు ప్రభుత్వం వాటిని కాల్చేయడానికి చట్టాలు ఒప్పుకుంటాయా లేదా పరిశీలించడం… Section 39(3)(c) of the Wildlife (Protection) Act of 1972 ప్రకారం వాటిని నిర్మూలించవచ్చునని తేల్చేశారు… గత నెలలో హైకోర్టు పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తే ఎవరూ వాటి నిర్మూలనను వ్యతిరేకించలేదు… ఇక వాటిని పరీక్షించడం మిగిలింది… ఇదీ కాస్త ఆసక్తికరం… దాదాపు 2500 వరకూ రకరకాల కేంద్రాల్లో ఉన్నాయి… మోరిగావ్, మానస్, మంగళదాయ్, గువహతి, మోకాఖత్, నాగావ్, తేజ్పూర్లలో ఫారెస్టు ట్రెజరీలలో ఉన్న వాటి బరువు తూచారు, కొలిచారు, డీఎన్ఏ పరీక్షించారు… కొద్దిరోజులుగా ఫోరెన్సిక్ నిపుణులు ప్రతి కొమ్ము చరిత్రనూ రికార్డ్ చేశారు… వాటిల్లో ఒకటి 51.5 సెంటీమీటర్లు, రెండున్నర కిలోలు ఉంది… ఇలాంటి 5 శాతం వరకూ ఏరి, ఎందుకైనా మంచిదని అలాగే భద్రపరిచారు… నవ్వొచ్చేది ఏమిటంటే..? 21 కొమ్ములు ఫేక్ అని తేలాయి… అంటే ఫేక్ దందా వీటిల్లోనూ ఉన్నదన్నమాట…
ఇక కాల్చిపారేయాలని తేల్చేసినవి 2449 ఉన్నాయి… కేబినెట్ భేటీలో పెట్టి తీర్మానం చేశారు… కానీ హిందూ సంప్రదాయాల మేరకు మరణించిన వాటికి దహసంస్కారం నిర్వహించి, ఆ తరువాతే వాటి కొమ్ములను కాల్చేయాలని నిర్ణయించారు… దీని వెనుక ఉద్దేశం కేవలం కొమ్ముల కోసం సాగే ఖడ్గమృగాల వేట పట్ల మేం కఠినంగా ఉండబోతున్నాం, వాటికి ఏ ఔషధ విలువ లేదు అనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడం… బోకాఖత్లోని కజిరంగ నేషనల్ పార్కులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు… సీఎం స్వయంగా హాజరయ్యాడు… దహసంస్కారం నిర్వహించి, తరువాత ఆ కొమ్ములను దహనం చేశారు… అస్సాంలో వీటి రక్షణ కోసం ప్రత్యేకంగా రినో ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా గతంలోనే ఏర్పాటు చేశారు… ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని నేషనల్ పార్కుల్లో ఉన్న ఖడ్గమృగాల సంఖ్య ఎంతో తెలుసా..? 2600 లోపే…!!
Share this Article