మంద బర్రె… మరీ స్పెషల్……….. పబ్లిసిటీ లేని మన పొడ తూర్పు
మనుగడ పరంపరలో… ప్రకృతి, పరిసరాలు ఏమైనా ఫర్వాలేదు అన్నట్లుగా మనిషి ముందుకు సాగుతున్నాడు. ఉపయోగపడే వాటిని రక్షించుకుంటూ, అవసరం లేని వాటిని గతంలోకి కలిపేస్తూ వస్తున్నాడు. ఆహార అవసరాలను తీర్చే జంతువులను, పక్షులను కాపాడుకుంటూ (తింటూనే)… వీటిలోనూ మేలు రకం వాటి మనుగడ ఉండేలా చేస్తున్నాడు. ఎక్కడ ఏ పరిశోధనలు చేసినా ఇదే పరమార్థం. ప్రపంచంలో మాంసం, పాల అవసరాలు తీర్చే ఎన్నో జీవాలు ఉన్నాయి. గ్లోబల్ వరల్డ్‌లో పెంపుడు జంతువులను, పక్షులను ఎక్కడి నుంచి ఎక్కడికైనా తెస్తున్నారు. అయితే ఆయా దేశాలు, ప్రాంతాలకు ప్రత్యేకమైనవీ ఉన్నాయి. జియాగ్రఫికల్గా, క్వాలిటీ, ప్రొడక్షన్ పరంగా… ఏదో ఒక విశిష్టత కలిగినవి మన చుట్టే ఉంటున్నాయి.
Ads
మనిషి అవసరాలను తీర్చే ఇలాంటి 14 జీవాలకు ప్రత్యేక హోదా ఇచ్చి గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున ‘ది నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏజీఆర్)’ పని చేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు అనుబంధంగా ఉంటుంది. దేశీయ పెంపుడు జంతువులపై, పక్షులపై ఎప్పటికప్పుడు సర్వే చేసి వాటి ప్రత్యేకతలను ప్రమాణికంగా తీసుకుని వాటిని యూనిక్ బ్రీడ్‌గా గుర్తిస్తుంది. కేవలం దేశీయ జాతులపై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలపై నిర్ధారించి యూనిక్ బ్రీడ్‌గా ప్రకటిస్తుంది. జెర్మ్ ప్లాజమ్, రోగ నిరోధక శక్తి, పాలలో పోషకాలు, మాంసంలో నాణ్యత వంటి అంశాలను సర్వేలో ప్రామాణికంగా తీసుకుంటుంది. ది నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ ఇలా ప్రతి ఏటా యూనిక్ బ్రీడ్లను జాతులను ఖరారు చేస్తుంది. 2021 కోటాలో ఇటీవలే 19 రకాల జీవాలను యూనిక్ బ్రీడ్ కేటగిరిలో చేర్చింది. తెలంగాణలోని పొడ తూర్పు రకం ఆవు/ఎద్దుకు ఈ హోదా దక్కింది. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రిసెర్చ్‌లోని వంజర కోడి (పీడీ2) ఈ జాబితాలో ఉంది…
మన రాష్ట్రంలోనే ఉండే పొడ తూర్పు ఆవుకు ప్రత్యేకత ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ముఖ్యంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇవి ఉంటాయి. కరువు ప్రాంతాల్లో మనుగడ వీటి ప్రత్యేకత. పొడ తూర్పు ఎద్దులు, ఆవులూ వ్యవసాయంలో బాగా పని చేస్తాయి. తెలంగాణ నుంచి ఇలా ఒక పశువుకు యూనిక్ బ్రీడ్ హోదా దక్కడం ఇదే మొదటిసారి. ఎందుకోగానీ దీనికి ఎక్కడా ప్రచారం రాలేదు. జీవాలకు యూనిక్ బ్రీడ్ గుర్తింపు విషయంలో తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిషా రాష్ట్రాలు ముందున్నాయి. మన పొడ తూర్పుతోపాటే ఒడిషాలోని మంద బర్రెకు ఇదే హోదా వచ్చింది. ఈ హోదా వచ్చిన 18 జీవాల సంగతి పక్కకు పోయింది. అన్ని టీవీలు, పేపర్లలోనూ మంద బర్రె గుర్తింపు హైలైట్ అయ్యింది. జీవాలకు యూనిక్ బ్రీడ్ గుర్తింపు కోసం ఒడిశా ప్రభుత్వం ప్రత్యేకంగా పని చేస్తోంది. అందుకే ఒడిషా నుంచి ఈ గుర్తింపు పొందిన బర్లు, గొర్లు, ఆవులు ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒడిశాలోని చిలికా, కలహండి రకం బర్లు ఇప్పటికే యూనిక్ బ్రీడ్ హోదా పొంది ఉన్నాయి. యూనిక్ బ్రీడ్ హోదా వచ్చిన తర్వాత ఈ రెండు జాతుల విషయంలో చేసినట్లుగానే ఒడిశా ప్రభుత్వం మంద బర్రె సంరక్షణకు, వీటిని సాదే వారికి లాభాలు వచ్చేందుకు ప్లాన్ చేసింది. ఒడిశాలో కోరాపుట్, మల్కన్‌గిరి, నవరాగ్పూర్ ప్రాంతాల్లోనే మంద రకం బర్లు ఉంటాయి. వ్యవసాయ పనులలోనూ వీటిని బాగా ఉపయోగిస్తారు. మొతంగా ఈ బర్లు లక్ష వరకు ఉన్నాయని ఆ స్టేట్ ఎనిమల్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్, అక్కడి అగ్రికల్చర్-టెక్నాలజీ యూనివర్సిటీ పశువుల జెర్మ్ ప్లాజమ్ ఆధారంగా సర్వే చేసి నిర్ధారించాయి. యూనిక్ బ్రీడ్ కాబట్టి మిగిలిన బర్ల కంటే మంద బర్రె పాలకు, పాల ఉత్పత్తులకు ఎక్కువ ధరలు వచ్చేలా ఇప్పుడు ఒడిశా ప్రభుత్వం ప్లాన్ అమలు చేస్తోంది. మంద రకం బర్లకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ఇవి పాలు ఇవ్వని రోజులు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు సగటున రెండు లీటర్ల నుంచి 2.5-4 లీటర్ల పాలను ఇస్తాయి. ఫ్యాట్ పర్సెంటేజ్ 8 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలా మంద రకం బర్రెల్లోని ప్రత్యేకతలను చూపెట్టి మార్కెట్లో ఈ బర్రెకు ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేస్తున్నారు.
ది నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 202 దేశీయ జీవాలను యూనిక్ బ్రీడ్లుగా గుర్తించింది. వీటిలో ఎడ్లు/ఆవులు 50, బర్లు/దున్నపోతులు 19, మేకలు 34, గొర్లు 44, గురాలు 7, ఒంటెలు 9, పందులు 10, గాడిదలు 3, జడల బర్రె 1, కోళ్లు -9, బాతులు 2, కుక్కలు 3, పెద్ద బాతులు 1 ఉన్నాయి. 2021లో యూనిక్ బ్రీడ్‌గా ప్రకటించిన వాటిలో ఆవులు/ఎడ్లు : పొడ తూర్పు (తెలంగాణ), నారి (రాజస్థాన్/గుజరాత్), దగ్రి (గుజరాత్), తూతు (నాగాలాండ్), శ్వేత కపిల (గోవా), హిమాచలి పహారీ (హిమాచల్ ప్రదేశ్), పూర్ణియ (బీహార్)… బర్లు : గోజ్రి (పంజాబ్/హిమాచల్‌ప్రదేశ్), ధరాడీ (కర్ణాటక), మంద (ఒడిశా); పందులు : మాలి (త్రిపుర), పూర్ణియ (బీహార్/జార్ఖండ్)… కుక్కలు : రాజపాలయం (తమిళనాడు), తిప్పిపాలై (తమిళనాడు), ముధోల్ హండా (కర్ణాటక)… కజాలి రకం గొర్రె (పంజాబ్), కచ్చీ రకం గాడిద (గుజరాత్), మైథిలీ రకం బాతు (బీహార్), వంజర రకం కోడి (హైదరాబాద్) కొత్తగా చేర్చిన వాటిలో ఉన్నాయి. మన చుట్టూ ఎన్నో దేశీ రకం జంతుజాతులు ఉంటాయి. వాటిని గుర్తించే ఓపిక, తీరిక ప్రభుత్వాలకు ఉండాలి కదా!
– అజ్ఞాతి (ఇన్పుట్ సోర్స్ :: హిందుస్థాన్ టైమ్స్)
Share this Article