పొలిటికల్ స్ట్రాటజిస్టుుల, సలహాదారులు ఇప్పుడే కాదు… మహాభారత కాలం నుంచీ ఉన్నారు..! ఈ ప్రశాంత్ కిశోర్‌లు, రాబిన్ శర్మలు, అనేకానేక మంది సలహాదారులు ఏ కేటగిరీలోకి వస్తారో తెలియదు, ఖజానా నుంచి, పార్టీల బొక్కసాల నుంచి ప్రజల సొమ్మును ఎందుకు తినేస్తారో తెలియదు కానీ… ఓసారి మనం అలా భారతకాలానికి వెళ్లొద్దాం… మనకు చాణక్యనీతి తెలుసు… తను సాధించిన పగ, పన్నిన వ్యూహాలు, ఆ బుర్ర చురుకుదనం, ఆయన రాసిన ఆర్థికశాస్త్రాలు, పాలన నీతుల మీద బోలెడు గ్రంథాలున్నయ్…
భారతకాలంలో విదురనీతి కూడా మనకు కాస్త తెలిసిందే… విదురుడు కురురాజ్యం పాలన వ్యవహారాలను చూసుకునేవాడు… ప్రజల కోణంలో సంక్షేమం, రాజధర్మం తదితరాంశాల మీద ధ్యాస ఎక్కువ… విదురుడు ప్రధాని… తను గాకుండా మరో సలహాదారు ఉండేవాడు… పేరు కణికుడు… విదురుడికి పూర్తి కంట్రాస్టు కేరక్టర్… శత్రువుల్ని ఎలా గుర్తించాలి, ఎలా శిక్షించాలి, గూఢచర్య వ్యవస్థ ఎలా ఉండాలో చెబుతాడు… పెగాసస్ స్పైవేర్ టైపు… తన బోధనల్ని కణికనీతి అంటారు… భీముడికి చిన్నప్పుడే విషం పెట్టి చెరువులోకి తోసేయడం దగ్గర్నుంచి లక్క ఇల్లు ఆలోచన వరకూ కణికుడే ప్రధాన సూత్రధారి అట… కాకపోతే గాలిదుమారం అంతా శకుని మీదకు పోయింది…
Ads
మాకు మహాభారతం క్షుణ్నంగా తెలుసు అనుకునేవాళ్లకు కూడా ఈ కణికుడి కేరక్టర్ అంతుపట్టదు… అంత రహస్యంగా పని జరిగిపోయేది… మహాభారతం మీద అనేక కళారూపాలు అసంఖ్యాకం… కానీ కణికుడి పాత్ర మనకు కనిపించేది లేదు… అక్కడక్కడ తప్ప… ప్రధాని భద్రతసలహాదారు టైపులో రాజ్యం రక్షణ విషయంలో కణికుడు చెప్పిందే ఫైనల్… భీష్ముడు, విదురుడు తదితరులు ఉన్నా సరే ధృతరాష్ట్రుడికి కణికుడి మీదే గురి… ఎందుకంటే… కణికుడిది కూటనీతి…
లక్ష్యం ఛేదించాలంటే ఏ మార్గంలో వెళ్తామనేది ముఖ్యం కాదు, టార్గెట్ కొట్టామా లేదా అనేదే కణికుడి పంథా… ప్రస్తుత రాజకీయాలు కూడా అంతే కదా… మీడియా, సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు, ఫేక్ ఖాతాలు, బూతులు, ఇతర పార్టీల నేతలపై దుష్ప్రచారాలు, కేసులు, ఐటీ దాడులు, సీబీఐ విచారణలు గట్రా… ధృతరాష్ట్రుడికి కొడుకు మీద ప్రేమ, తన తరువాత రాజ్యాన్ని కొడుకే పాలించాలనే కోరిక… కానీ అడ్డుగా ధర్మరాజు… మద్దతు చెప్పే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు తదితరులు… అందుకే కణికుడి సలహాలంటే తనకు మహా గురి…
నిజానికి కుటిలనీతి అంటాం గానీ… రాజ్యం రక్షణ విషయంలో తప్పదు అంటాడు కణికుడు… రాజ్యరక్షణ రాజనీతిలో ప్రధానం అంటాడు… ఓసారి ధృతరాష్ట్రుడు కణికుడిని అడుగుతాడు… ‘‘ఈ పాండవుల్ని ఏం చేద్దాం..?’’ దానికి కణికుడు ఏమంటాడంటే..?
‘‘శత్రువు శత్రువే… తనతో బంధుత్వం పరిగణనలోకి రాదు… రాకూడదు… ఒక్కసారి లక్ష్యంగా చేసుకున్నామంటే ఇక ఎంత వేడుకున్నా విడిచిపెట్టకూడదు… ఏదో ఒక ఉపాయంతో శత్రువును నశింపజేయాలి… కొన్నిసార్లు దుర్బలుడే కదా, మనల్నేం చేయగలడులే అని ఉపేక్షించకూడదు… కాషాయం కట్టాలి, లోకాన్ని నమ్మించాలి… రాజా… మీ చేతిలో ఆయుధం, అధికారం ఉంటే తప్ప ఈ లోకం మీ మాట వినదు… ఆ ఆయుధం, అధికారం జనాన్ని భయపెడుతూ ఉండాలి… అంటే మనం శత్రువుల్ని నిర్మూలించే తీరు ఇతరులకు ఓ పాఠంగా మారి వణికించాలి… మీ లోపాలను దాచుకోవాలి, శత్రువు లోపాల్ని కనిపెట్టాలి, మన బలహీనతలు ఎవరికీ తెలియనీయొద్దు…
అవసరమైతే శత్రువును కొన్నాళ్లు భుజాన మోయాలి, ఓ సమయం వస్తుంది, అప్పుడు ఎలా కొట్టాలంటే, రాతిబండ మీద కుండను బలంగా కొట్టినట్టు… పెంకులు ఎక్కడెక్కడికో ఎగిరిపడాలి… రాజకీయంలో, యుద్ధంలో గురువు, పుత్రుడు, మిత్రుడు, తండ్రి, తాత అంటూ ఎవరూ ఉండరు… శత్రువుగా మారుతున్నాడంటే ఇక నిర్మూలనే లక్ష్యంగా ఆలోచించాలి… నవ్వాలి, ఆ నవ్వు చాటున కోపం దాచేయాలి… దెబ్బ తీయాలి, లోకం ముందు తన కోసం ఏడవాలి, ఎవడినీ నమ్మేది లేదు…’’ ఇలా సాగేది కణికనీతి… మనం చాణక్యుడు, విదురుడు అంటుంటాం గానీ… ప్రతి పొలిటిషియన్ ఈరోజుకు కణికుడి పేరు తెలియకపోయినా సరే… తన నీతినే పాటిస్తూ ఉంటాడు..!! అఫ్‌కోర్స్, అన్ని దేశాల్లోనూ అంతే…!!
Share this Article