2015… ప్రధాని మోడీ అప్పట్లో రోజుకు రెండుమూడు దేశాల్ని చుట్టేస్తున్న కాలం… ఎక్కడికి వెళ్లినా ఆ డ్రెస్సులు ధరించి, ఆ దేశాధ్యక్షుల్ని కౌగిలించుకుంటూ, వాళ్ల సంస్కృతిని, ఆతిథ్యాన్ని రుచిచూస్తూ ప్రపంచమంతా ప్రదక్షిణలు చేస్తున్న పర్యాటకశకం… పనిలోపనిగా మంగోలియా వెళ్లాడు… వ్యూహాత్మకంగా దానికి చేరదీయడం, డబ్బులిచ్చి బుజ్జగించడం, మన ఫోల్డ్‌లో ఉంచుకోవడం మన అవసరం… వెళ్లగానే అక్కడి డ్రెస్సు వేశాడు, ఫోటోలు దిగాడు, వీడియోలు తీశారు… విల్లంబులు పట్టుకుని ఫోజులిచ్చాడు… మనం ఉదారంగా ఆర్థికసాయం ప్రకటించడంతో అక్కడి ప్రభుత్వం ప్రేమగా కంఠక అనే ఓ గుర్రాన్ని బహూకరించింది… (కంఠక అంటే గౌతమబుద్ధుడి గుర్రం పేరు)… గుర్రాల్ని బహుమతులుగా ఇవ్వడం వాళ్ల సంస్కృతి, ఆతిథ్యంలో గొప్పది… కానీ ఆ గుర్రాన్ని మోడీ అక్కడే కాన్సులేట్‌లో వదిలేసి వచ్చాడు… కారణం :: 2005లో ప్రభుత్వం తీసుకున్న ఓ విధాన నిర్ణయం మేరకు మనం ఏ విదేశీ అతిథికీ జంతువుల్ని కానుకలుగా ఇవ్వొద్దు, ఒకవేళ మనవాళ్లకు ఎవరైనా ఇచ్చినా మన దేశంలోకి తెచ్చుకోకూడదు… ఎందుకంటే..? గతంలో ఇలాగే జంతువుల్ని ఇచ్చిపుచ్చుకునే అలవాటు ఉండేది మనవాళ్లకు, కానీ జంతువులను వేర్వేరు క్లైమాటిక్ జోన్లలోకి మార్చడం, వాటికి అవి అలవాటుపడక మరణించిన విషాదాలూ ఉన్నయ్… అంటే కానుకలు, సరుకులుగా వాటిని పరిగణించి తీసుకురావడం లేదా పంపించడం వాటికి మరణశిక్ష విధించడమే ఒకరకంగా… సో, ఆ కంఠక ఆరేళ్లుగా ఆ మంగోలియా కాన్సులేట్‌లోనే ఓ ఖరీదైన కానుకలాగా భద్రంగా చూసుకోబడుతోంది… ఇక్కడ ఇక సీన్ కట్ చేద్దాం…
మనం ఏం నేర్చుకున్న పాఠం ఏమిటి..? సందర్భం, అవసరం ఏదైనా సరే, జంతువుల్ని దేశాలు దాటించడం కరెక్టు కాదు అని…! కానీ… మహారాష్ట్రలో బాల్ ఠాక్రే మనమడు, ఉద్దవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే రూట్ వేరు… సార్ తమ్ముడేమో అడవుల్లో, గుట్టల్లో, కాలువల్లో తిరుగుతూ కొత్త కొత్త ఎండ్రికాయల్ని, పాముల్ని, కప్పల్ని, సాలీడ్లను కనిపెడుతూ ఉంటాడు… కానీ ఆదిత్య పైత్యం వేరు… 2016… అప్పటికే ముంబై కార్పొరేషన్‌పై శివసేనదే పెత్తనం… యువరాజా వారు కార్పొరేషన్ ఆధీనంలో ఉండే జూ (The Veer Mata Jijabai Bhosale Udyan) అధికారులకు ఆర్డరేశారు… దక్షిణ కొరియా, సియోల్ నుంచి పెంగ్విన్లను కొనుక్కొచ్చి, జూలో పెట్టాలనేది రాచకుమారుల వారి అభిలాష… ఆదిత్యుడే కోరుకున్నాక ఇక తప్పేదేముంది..? Donald, Daisy, Popeye, Olive, Flipper, Bubble, Molt ఇలా పేర్లున్న Humboldt జాతి పెంగ్విన్లను కొన్నారు… ఖర్చు 2.5 కోట్లు… వీటిని తీసుకురాగానే ఒక పెంగ్విన్ చనిపోయింది… ఏమయ్యా, ఆదిత్యా, ఇంత ఖర్చు పెట్టించి, ఓ పెంగ్విన్‌ను బలిగొన్నావు కదయ్యా అని ప్రతిపక్షాలు తిట్టిపోశాయి… తరువాత ఒక పెంగ్విన్ పిల్ల పుట్టగానే చనిపోయింది…
Ads
పెంగ్విన్లను కొనుక్కురావడంతోనే సరిపోదు కదా… వాటికి సరిపడా వాతావరణాన్ని జూలో క్రియేట్ చేయాలి… ఐనా క్లైమాటిక్ జోన్ మార్పడితో వాటికి ప్రాణగండాలు తప్పవు… 2018లోనే కోట్ల మెయింటెనెన్స్ కంట్రాక్టు ఇచ్చారు… ఓ దశలో దానికి కోటిన్నర జరిమానా కూడా పడింది… నిజానికి మన ప్రభుత్వ జంతుప్రదర్శనశాలల్లో పరిస్థితులు అందరికీ తెలిసినవే కదా… పాపం, ఎక్కడి నుంచో ఏవేవో జంతువుల్ని తెస్తారు, అవి సరిగ్గా ఇమడవు, చచ్చిపోతుంటాయి… అనవసరంగా వాటిని డెత్ ఛాంబర్లలోకి తరలిస్తున్నట్టే… ఈమధ్య 10 కోట్ల ఓ కంట్రాక్టును పిలిచారు… ఆ ఎన్‌క్లోజర్ మొత్తం 16 డిగ్రీల ఉష్ణోగ్రత, అవి ఉండే నీళ్లు 11 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా మెయింటెయిన్ చేయాలి… వాటి ఫుడ్, వెటర్నరీ అవసరాలు కూడా అందులోనే… 35 వేల అడుగుల ఎన్‌క్లోజర్… ఈ పెంగ్విన్లకు అంత కర్చా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు… ఈలోపు ప్రభుత్వం ఇంకో షాక్ ఇచ్చింది, దాన్ని 15 కోట్లకు పెంచింది… దీనిపై బీజేపీయే కాదు, ప్రభుత్వంలో పార్టనర్‌గా ఉన్న కాంగ్రెస్ కూడా విమర్శలు చేసింది… ఈ స్కాం సంగతి వదిలేయండి… హేమిటో, ఇంత భారీ ఖర్చుతో పెంగ్విన్లను బయటి నుంచి తీసుకురావడం, ప్రాణగండంలో పడేయం మనిషిలోని కర్కశత్వానికి సూచిక అనిపిస్తుంది…! వంద శాతం ఇది జీవహింసే..!!
Share this Article