Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!

September 25, 2021 by M S R

ఎడ్లు పోయాయని స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టేందుకు చేసే ప్రయత్నంతో సినిమా మొదలవుతుంది. పూచేరీ అనే ఊరులోని కున్నిముత్తు (మిథున్‌ మానిక్కం), వీరాయి (రమ్య పాండియన్‌) దంపతులు తప్పిపోయిన ఎడ్ల కోసం పడే తపన, వాటితో వీరి అనుబంధం, ఎడ్లు పోయేందుకు రాజకీయ కారణాలు, దీనిపై ఇతర పార్టీల రాజకీయ డ్రామాలు, మీడియా తీరు, అధికారుల అవినీతితో గ్రామాల్లో వెనుకబాటు ఇలా ఉంటాయి రామే… రావణే మూవీలో… నేటివిటి అంటేనే తమిళ సినిమా. దీంట్లో ఇంకా ఎక్కువ… క్యారెక్టర్లు, పరిస్థితులు అన్ని బయట చూసినట్లే ఉంటయి. చెరువు, స్కూలు, హాస్పిటల్‌, రోడ్ల నిర్మాణం కోసం శిలాపలకాలు, అన్ని పనులు పూర్తయినట్లు రికార్డుల్లో ఉంటాయి. ఎడ్లు పోయినట్లుగానే… రికార్డులో చూపిస్తున్న(అభివృద్ధి చెందిన) ఊరు మాయమైందని ఛానల్‌లో మానేసి సొంతంగా (సోషల్‌ మీడియాలో) స్టోరీ చేస్తుంది మహిళా రిపోర్టర్‌. ఇది వైరల్‌ కావడంతో చెన్నయిలో లాయర్‌గా సెటిల్‌ అయిన ఆ ఊరి వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేస్తాడు. రికార్డులో ఉన్నట్లుగానే అభివృద్ధి పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు ఇస్తుంది. అధికార యంత్రాంగం అంతా ఆ ఊరిలోనే ఉండి పనులు చేయిస్తుంటుంది. అప్పుడే కున్నిముత్తు తన ఎడ్లతో ఊరికి వస్తాడు. కొన్ని సినిమా డ్రామా సీన్లను పక్కనపెడితే రామే, రావణే కొన్నేండ్ల క్రితం ఊరు ఉన్న పరిస్థితిని కండ్ల ముందుంచింది.

raame raavane

ఎడ్లతో వాటి యజమానికి చెప్పలేని అనుబంధం ఉంటుంది. దాన్ని ఈ సినిమాలో బాగా చూపించాడు డైరెక్టర్ అరిసిల్ మూర్తి. నానమ్మను నాటు వైద్యం కోసం తీసుకెళితే ఆ వైద్యుడి బిడ్డతో పెండ్లి కుదిరిస్తుంది. వేరే కులం అమ్మాయిని పెండ్లి చేసుకున్న కారణంగా నాటు వైద్యుడిని పూచేరీ నుంచి వెలేస్తారు. సొంతూరికి ఇచ్చిన కూతురుకు రెండు లేగ దూడ (కరుప్ప, వేరాయి)లను ఇస్తాడు వైద్యుడు. కట్నాల కింద ఇప్పుడు లక్షలు, కోట్ల రూపాయలు, బంగారం అన్నీ ఇస్తున్నారు. ఒకప్పుడు నగదు లేదు. అవసరం తీర్చే వస్తువులే అప్పుడు కట్నాలు. వ్యవసాయ కుటుంబాల్లో కట్నం (అర్నం) కింద పశువులను ఇచ్చేవారు. మెట్టినింటికి అర్నంగా తెచ్చుకున్న రెండు లేగ దూడలు పెరిగి ఎడ్లయివుతాయి. కున్నిముత్తు, వీరాయి బతుకు వీటితోనే సాగుతుంటుంది. కున్నిముత్తు-వీరాయి ఊరికి పోయినప్పుడు పక్కింటి వాళ్ల నానమ్మ మేత, కుడితి పెడితే అవి ముట్టవు. వాటి యజమానులు వచ్చినంకనే తింటయి. ముఖ్యమంత్రి పథకం కింద ఎడ్లపైన బ్యాంకు లోను తీసుకుని ఆ పైసలతో బండి కొని సిటీకి బొగ్గుల కట్టెలను, ఇతర సామగ్రిని తరలించి ఆదాయం పొందవచ్చని ఫ్రెండ్‌ మంథిన్ని (వడివేల్‌ మురుగన్‌) చెబితే ఒప్పుకుంటాడు. లోన్‌ మంజూరైన తర్వాత ఎడ్ల చెవుల దగ్గర ఇనుప బిళ్ల వేసే కంపౌండర్‌ను కొట్టినంత పని చేస్తాడు కున్నిముత్తు. లోను లేకున్నా మంచిదేగానీ ఎడ్లకు నొప్పి కావద్దని అంటాడు. వ్యవసాయ పనులకు శిక్షణ ఇచ్చేటప్పుడు ఎడ్లకు ప్రత్యుత్పత్తికి అవకాశం లేకుండా నాటు పద్ధతిలో చేస్తారు. కాళ్లకు ఇబ్బంది కాకుండా ఇనుప డెక్కలు వేస్తారు. ఎడ్లకు ఇలా చేసేటప్పుడు కున్నిముత్తు అది చూసి తట్టుకోలేడని ఫ్రెండ్‌ అతడిని పక్కకు తీసుకుపోతాడు. ఎడ్లను కొట్టేవాడిని ఆపేందుకు మంత్రి పుట్టినరోజు కార్యక్రమంలో తింటున్న బిర్యానీ కింద పడేసి మరీ పోతాడు. సినిమా మొత్తంలో కున్నిముత్తు-వీరాయి ఎడ్లు అని ఎక్కడా అనరు. వాటిని తమ పిల్లలు అని అంటుంది వీరాయి. ఎడ్లు పోవడంతో ఇద్దరు పడే బాధ సహజంగా ఉంటుంది. తప్పిపోయిన ఎడ్లకు బదులు మంత్రి సొంత డబ్బులతో వేరే రెండు ఎడ్లను ఇస్తుంటే మీడియా బాగా కవర్‌ చేస్తుంది. వీరాయి వచ్చి… ‘మీ పిల్లలు తప్పిపోతే వేరే పిల్లలను తెచ్చి ఇస్తే మీకేమనిపిస్తుంది’ అంటుంది. తప్పిపోయిన ఎడ్ల గురించి ఊరూరు తిరుగుతూ ఓ అంగడిలో రోజంతా ఉంటాడు కున్నిముత్తు. అక్కడి వాళ్లు కున్నిముత్తును ఎడ్ల దొంగ అనుకుని కొడతారు. పోలీసులకు పట్టిస్తారు. ఎడ్ల కోసం వెతుకున్న తనను పోలీసులు దొంగలాగే చూస్తారు. తన ఎడ్లు పోయినప్పుడు పెట్టిన కంప్లయింట్‌ను మరిచిపోతారు. రిపోర్టర్‌ నర్మద (వాణి భజన్‌) సాయంతో పోలీసుల బాధ నుంచి తప్పించుకుంటాడు. ఎడ్లు తప్పిపోయిన విషయం అన్ని టీవీల్లో, పేపర్లలో, సోషల్‌ మీడియాలో బాగా హైలైట్‌ అవుతుంది. కున్నిముత్తు ఇంటి ముందు అన్ని టీవీల లైవ్‌ వ్యాన్లు ఉంటాయి. ప్రతిపక్ష నేతతో సహా అన్ని పార్టీల వాళ్లు సంఘీభావం ప్రకటిస్తారు. ప్రజాసంఘాలు, కుల సంఘాల వాళ్లు వచ్చి స్పీచులు ఇస్తుంటారు. వచ్చిన వాళ్లు ముత్తుకు శాలువా కప్పడం, మిక్సీలు ఇవ్వడం… అన్నీ బయట జరిగినట్లుగానే ఉంటాయి.

Ads

raame raavane

పశుసంవర్ధక మంత్రి పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఉచితంగా పశువులను పంపిణీ చేసే డమ్మీ ప్రోగ్రాంలో ఎడ్లపై ప్రేమతో కున్నిముత్తు చేసి పని మంత్రి ఈగోను దెబ్బతీస్తుంది. ఎడ్లు మాయమవడానికి కారణమవుతుంది. పోలీసుల సహకారమూ ఉంటుంది. దీనిపై ఛానల్‌ మహిళా రిపోర్టర్‌ చేసిన స్టోరీ… రేటింగ్‌లో ఎక్కడో ఉన్న వాళ్ల ఛానల్‌ టాప్‌లోకి వెళ్తుంది. లక్షల మంది పార్టీ కార్యకర్తల్లో ఎవరో చేశారని, క్షమాపణ చెబుతున్నానని మంత్రి ప్రకటించడంతో ఎడ్ల స్టోరీ చప్పబడుతుంది. ‘ఇంకో బ్రేకింగ్‌ న్యూస్ దొరికే వరకే ఇప్పటిది బ్రేకింగ్‌ న్యూస్’ అంటాడు ఛానల్‌ హెడ్‌. పోలీసులు మంత్రుల చెప్పులు, ఎమ్మెల్యేల కుక్కలు పోతే వెతుకుతారుగానీ పేదల ఎడ్ల గురించి పట్టించుకుంటారా అంటుంది వీరాయి (ఇప్పుడు రూరల్‌ ఏరియాలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో ఎడ్లు పోయిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి). కవరేజీ కోసం ఊరికి వచ్చిన తమను ఆశ్చర్యంగా చూస్తున్న బాలికను మహిళా రిపోర్టర్లు పిలిచి స్కూలుకు పోలేదా అంటే మా ఊరిలో లేదని అంటుందామె. జుట్టుకు నూనే రాసుకోలేదని అడిగితే మా ఇంట్లో నిన్ననే అయిపోందని చెబుతుంది. ‘మీ ఇంట్లోనూ నూనె లేదా? మీరెందుకు రాసుకోలేదు’ అని అమాయకంగా అడుగుతుంది అ అమ్మాయి.

raame raavane

ఎడ్ల కొమ్ములకు కట్టే గంటలను కొనేందుకు అంగడికి పోయిన కున్నిముత్తు, వీరాయి వాటి ధర చూసి ఇదేంటని అడిగితే వ్యాపారీ జీఎస్టీ ఉందని అంటాడు. పోయిన ఎడ్ల కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లి, వెతికి ఇంటికి వచ్చిన భర్తతో ‘నీ కోసం చుక్క నీళ్లు తాగకుంటే రోజంతా ఎదురు చూస్తుంటే తాగి వచ్చినవా అని వీరాయి అంటే… నువ్వు ఏడ్చి బాధ దించుకుంటవు. నాతోని అలా అయితలేదు’ అంటాడు కున్నిముత్తు. ఎడ్లు ఎక్కడున్నాయో అని ఓ మంత్రగాడిని ఆశ్రయిస్తే పది కిలో మీటర్ల దూరంలో ఒంటి చింత చెట్టు కింద ఉందని చెబుతాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఓ పశువు అస్తిపంజరం ఉంటుంది. తప్పిపోయి రెండు రోజులే కదా అలా ఉండదని నిర్ధారించుకుంటారు. ‘ఏ పశువు చచ్చినా ఇక్కడే వేస్తరు కదా. అందుకే అలా వాడు (మంత్రగాడు) అలా చెప్పాడు. అక్కడే కూర్చుని అన్నీ చెబితే వాడు అలా ఎందుకు ఉంటాడు’ అని కష్టపడి సైకిల్‌పై వస్తువులను అమ్మే వ్యక్తి వారికి వాస్తవం చెబుతాడు. ముత్తుకు అన్ని సందర్భాల్లో తోడుగా ఉండే ఫ్రెండ్‌కు లూనాకు మూడు తాళాలు వేస్తుంటాడు. అలా ఎందుకని వీరాయి అడిగితే… ‘అశ్రద్ధగా ఉంటే మన పేదరికంతో సహా అన్నిలాక్కునేటోళ్లు సమాజంలో ఉన్నారు. కాళ్లు చాపుకుని ఉంటే అండర్‌ వేర్‌ను ఎత్తుకుపోతారు’ అని అంటాడు. అమెజాన్‌ ప్రైమ్‌లో ఉందీ ఈ సినిమా. ఓటీటీలోనే చూడాలి దీన్ని. తమిళ స్టార్ హీరో సూర్య ఈ మూవీ ప్రొడ్యూసర్…….. – అజ్ఞాతి 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions