Nancharaiah Merugumala……………….. పుకార్లతో సినిమావాళ్లకు మేలేగాని కీడు ఇసుమంతైనా ఉండదు!
చాలా మంది తెలుగు జర్నలిస్టులకు అక్కినేని నాగచైతన్యకున్న ఆలోచన లేకపోయింది. గుండె ధైర్నం లేకపోయింది. ఈ మధ్య చైతూ, అతని భార్య సమంతా రూత్ ప్రభూ చెల్లుచీటీలు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో, ఇంకా ప్రధాన స్రవంతి మీడియాలో పుకార్లను వార్తలుగా రాసి ప్రసారం చేశారు. దాని వల్ల వారిద్దరికీ మంచి ప్రచారం దొరికింది. శుక్రవారం రిలీజైన చైతన్య సినిమాకు కూడా ప్రీరిలీజ్ పబ్లిసిటీకి ఈ పుకార్లు తోడయ్యాయి. తెలుగు సినిమారంగంలో ఒకప్పటి తొలి రెండు కుటుంబాల్లో ఒకటైన అక్కినేని ఫ్యామిలీలో పుట్టిన మూడో తరం హీరో సంసారం ముక్కలౌతోందని వార్తలు రాసిన మీడియా మనుషులు పెద్ద పాపం లేదా తప్పు చేసినట్టు రెండు రోజులుగా నా వంటి పూర్వ పాత్రికేయులు, సర్వీసులో ఉన్న అంత యంగ్ కాని జర్నలిస్టులూ కూడా తెగ బాధపడిపోతూ అక్షరాల్లో ఈ మానసిక క్షోభను ఆక్రోశంగా, శాపనార్ధాలుగా వ్యక్తంచేసి చేతులు దులుపేసుకున్నారు.
రెండు వారాలుగా ఈ విడాకుల గోల గురించి రాసిన పాత్రికేయుల పాపం పరిహరించాలని దేవుణ్ని కోరుతూ ఇప్పుడు మంచి నీరుతో పారుతున్న మూసీ లేదా ముచుకుందా నదిలో స్నానాలు కూడా చేశారు. వారు ఇంతగా నొచ్చుకున్నారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు గాని, ఇంకా యువ హీరోగానే పేరున్న నాగచైతన్య మాత్రం ఈ విడాకుల వదంతులతో తనకు కొద్దిపాటి బాధ కలిగిన మాట వాస్తవమేనని చెప్పాడు. కాని, వెంటనే తనకు మీడియా, ఎంటర్టైన్మెంట్ మీడియా ఎలా నడుస్తాయి, వాటి పోకడలు ఏంటి? అనే విషయాలపై అవగాహన కలిగిందని ‘ఫిల్మ్ కంపానియన్ సౌత్’ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల చైతన్య చెప్పాడని ఇండియన్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్ తెలిపింది. ‘‘ఈరోజుల్లో ఒక వార్త స్థానాన్ని మరో వార్త వచ్చి ఆక్రమిస్తుంది. ఏదీ జనం మనసుల్లో ఎక్కువ కాలం నిలబడదు. అందరికీ సంబంధించిన నిజమైన వార్త కలకాలం బతుకుంది. టీఆర్పీల కోసం పబ్లిక్ మీదకు వదిలిన వార్త ఆయష్షు తక్కువ. అది త్వరగా పాచిపోయి కంపుకొడుతుంది– నాకు ఈ జ్ఞానోదయం అయ్యాక మా విడాకుల ‘వార్త’ నా గుండెకు గుచ్చుకునే శక్తిని కోల్పోయింది,’’ అని అక్కినేని నాగేశ్వరరావుగారి, దగ్గుబాటి రామానాయుడుగారి ఉమ్మడి మనవడు ధైర్యంగా చెప్పాడు. అయితే, తన జ్ఞాన నేత్రాలు తెరుచుకోక ముందు, ‘ ఈ ఎంటర్టైన్మెంట్ (మీడియా) ఇలా పోతాందేంటి?’ అని నొచ్చుకున్నానని అంగీకరించాడు. వ్యక్తిగత విషయాలను, తన వృత్తిగత అంశాలను వేర్వేరు పెట్టెల్లో పెట్టి రేత్రిపూట ప్రశాంతంగా పడుకునే అలవాటు తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నానని చైతూ తన ఆదర్శ పేరెంట్స్కు జేజేలు పలికాడు.
Ads
ఇన్ని కబుర్లు చెబుతున్న నాగచైతన్య తన సినీరంగంలో సలెబ్రటీలు ఎలా మీడియాను తమ అనుకూల ప్రచారానికి వినియోగించుకుంటారో, తమ ప్రయోజనాల పరిరక్షణకు వెర్రిమొర్రి మీడియా ప్రతినిధులను ఎలా వాడేసుకుంటారో ఒక్క మాటైనా చెప్పలేదు. మీడియాలో తమకు అనుకూల వార్త రావడానికి, వ్యతిరేక వార్త రాకుండా చేయడానికి రిపోర్టర్లను, మీడియా సంస్థల యాజమాన్యాలను ఎలా మనిప్యలెయిట్ చేస్తారో చైతూ వెల్లడించలేదు. 1960లు, 70లు, 80ల్లో హిట్ సినిమాలు లేక తెరమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్న రోజుల్లో తెలుగు సినీ నటీనటులు కొన్ని తెలుగు సినిమా పత్రికల్లో మూల్యం చెల్లించి మరీ ఎలా వార్తలు రాయించుకున్నారో పాత తరం మనుషులను, మీడియా వృద్ధులను అడిగితే తెలుస్తుంది. అలాగే, తమ గురించి నిజాలు పది శాతమైనా లేని పుకార్లను వార్తలుగా రాసే పత్రికల ఎడిటర్లు లేదా యజమానులను బెదిరించి, బతిమాలి లేదా ప్రత్యక్షంగా మేలు చేసి అలాంటి వార్తల ప్రచురణ నిలిపివేయించుకున్న తెలుగు టాప్ స్టార్లూ ఉన్నారు. కాని, పైసలు జాగ్రత్తగా ఖర్చుచేసే నందమూరి తారకరామారావు గారు మాత్రం పైన చెప్పిన సందర్భాలు ఎదురైనప్పుడు పత్రికలను ప్రభావితం చేయలేదని పలువురు చెప్పారు. రాజకీయ నాయకుల మాదిరిగానే మీడియా ప్రచారం ద్వారా విపరీతంగా ప్రయోజనం లేదా లబ్ధి పొందుతున్న సినిమావాళ్ల గురించి, వారి దాంపత్య బతుకుల గురించి సోషల్ మీడియాలో వచ్చిందని సెకండ్ హ్యాండ్ పుకార్లు ప్రచారం చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రమాణాల గురించి పాత్రకేయ పెద్దలెవరూ దిగులుపడొద్దని మనవి. పని రోజుల్లో ఎన్నో తప్పులు చేసి కొన్ని దిద్దుకుని, మరికొన్ని దిద్దుకోకుండా 30–40 ఏళ్లు మీడియాలో బతికేసి విశ్రాంతి జీవితం గడుపుతున్నోళ్లు– ఇలాంటి సినీ గాసిప్ వార్తలతో కలతచెందవద్దు.
నాగచైతన్య కన్నా వెంకటరాఘవాపురం జనానికే ధైర్యం ఎక్కువా
–––––––––––––––––––––––––––––––––––––––
34–35 ఏళ్ల సమంతా, నాగచైతన్యా ఇంత కంటే పెద్ద విపత్తులను తట్టుకుంటారు. వారు అంత సున్నిత మనస్కులు కాదు. ఇప్పటికి పదేళ్లుగా ఎన్నో పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన నాగ చైతన్య ఎన్నడూ, ‘ నా తల్లిదండ్రులు విడాకులు తీసుకుని మరీ విడిపోయారు, ’ అని అనలేదు. చిన్నప్పుడు చెన్నైలో అమ్మ దగ్గర, టీనేజ్ వచ్చాక హైదరాబాద్లో నాన్న దగ్గరే… అంటాడేగాని అసలు విషయం చెప్పడు. అంత పెద్ద కుటుంబాల్లో పుట్టి, ఒక మోస్తరు మంచి చదువు చదివిన నాగచైతన్యకు కూడా ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందో చెప్పే ధైర్యం లేదు. ఆయన తాత నాగేశ్వరరావు గారు సొంతూరు (కృష్ణాజిల్లాలో గుడివాడ కంటే కొల్లేరుకు దగ్గర– కొత్త పేరు కొత్త రామాపురం) వెంకట రాఘవాపురంలో పుట్టి పెరిగిన కమ్మవారు, గొల్లవారు, దళితులు ధైర్యంగా తల్లిదండ్రుల విషయాలు బజార్లో మాట్లాడగలరు. అసలు సిసలు సూపర్ స్టార్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ తాను తన తండ్రి రెండో సహచరికి పుట్టానని, తనకు జన్మనిచ్చినవారిది లీగల్ మ్యారేజ్ కిందకి రాదని చెప్పాడా? తల్లి కన్నడ బ్రాహ్మణ స్త్రీ అని చెప్పాడా? అని మీరడగవచ్చు. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న దంపతుల కొడుకు అయిన నాగచైతన్యకు లజిటమసి సమస్య లేదు. అయినా అతను ‘గుట్టు మెయింటెయిన్’ చేస్తాడు. కాని, జూ.ఎన్టీఆర్కు లజిటమసి ఇష్యూ ఉంది. తన సినీరంగ విజయాలతో అతను ఆ ఇబ్బందిని అధిగమించాడు. లజిటమసి కోసం అతనికి చిన్నప్పుడే విశ్వవిఖ్యాతుడైన తాతగారి పేరు పెట్టారు. ఇప్పుడు తాతగారి పేరు తీసేసి మరే కన్నడ, తెలుగు పేరు పెట్టుకున్నా అతని కరియర్కు నష్టం ఉండదు. కాబట్టి పాత్రికేయ మిత్రులారా, సినీ సలెబ్రటీలపై ఏం రాసినా సదరు నటీనటులకు లాభమేగాని ఇసుమంత కూడా నష్టముండదు. నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, అల్లు, కొణిదెల, కమ్ముల వంటి సాధారణ ఇంటి పేర్లకు అసాధారణ పేరుప్రఖ్యాతులు కష్టపడి సంపాదించిపెట్టిన గొప్ప వాళ్ల కడుపున పుట్టినోళ్లను మనతో, మన కుటుంబ సభ్యులతో పోల్చి వారిని ఘోరంగా అవమానించకండి….
Share this Article