నచ్చావురా సుడిగాలి సుధీర్… పైపైన చూస్తే నువ్వు ఓ టీవీ ప్లే బాయ్… కామెడీ కోసమే అని తెలుసులే… వినోదం కోసం మ్యాజిక్కులు చేస్తవ్, స్టంట్స్ చేస్తవ్, సినిమాల్లో హీరో వేషాలు, జబర్దస్త్‌లో కమెడియన్ వేషాలు… అవమానాలు కూడా భరిస్తున్నవ్… కానీ నీలోని అసలు మనిషిని శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బయటికి తీసుకొస్తున్నవ్…. సోకాల్డ్ కామెడీ నిర్మాతలు, కమెడియన్లు నీ నుంచి నేర్చుకోవాల్సింది కొండంత ఉంది.,.. అసలు వాళ్లకు నువ్వు అర్థం కావు…
సుధీర్, నీ డాన్సులు, నీ రష్మి ప్రేమాయణాలు ఏమైనా ఉండనీ… కానీ నీలోని మానవీయ కోణాన్ని, ఆర్ద్రతను ఇలాగే కాపాడుకో సుధీర్… అదే నిన్ను ఈ తలతిక్క టీవీ ప్రోగ్రాముల్లో డిఫరెంటుగా ఉంచుతోంది… తెలుగు టీవీ ప్రేక్షకగణం నిన్ను అభిమానిస్తోంది… అంతెందుకు..? కామెడీ అంటే జబర్దస్త్ బూతులు మాత్రమే అనుకునే నిర్మాతలు, పడీ పడీ వెకిలిగా నవ్వే రోజాలు, మనోలు, శేఖర్ మాస్టర్లు కూడా కళ్లు తెరవనీ…
Ads
కామెడీ అంటే పంచులు, చెణుకులు మాత్రమే కాదు… నవ్వడం మాత్రమే కాదు… మధ్యలో ఎక్కడో ఓ చోట గుండె తగలాలి… ఆ గుండెలో ఎక్కడో దాగున్న తడి తగలాలి… అది పొంగి కళ్లల్లోకి మత్తడి దూకాలి… అది అందరికీ తెలియదు… కొందరు కమెడియన్లకు మాత్రమే తెలుసు… ఆ తెలిసిన కమెడియన్లలో సుధీర్ కూడా ఒకడు… ఏ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒకప్పుడు తనను బ్యాన్ చేశారో, తనను వెలివేశారో… ఇప్పుడు తనే ఆ షోకు బలం… ఏదో ఓ సామాజిక అంశం… కరోనా బాధితులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, ప్రైవేటు టీచర్లు, పాతతరం డాన్సర్లు… ఎవరైతేనేం… మనసును మెలిపెట్టే ఓ అంశాన్ని తీసుకుని, వాళ్లను తీసుకొచ్చి, స్కిట్ చేయించి, కూర్చోబెట్టి, గౌరవించి, కాళ్లు మొక్కి… వాళ్లకు ఎంతో కొంత డబ్బిచ్చి, ఆదరించి, పది మందికీ వాళ్ల బాధను చూపించి…… నువ్వు గ్రేటురా సుధీర్…
ఓ తాజా ప్రోమో చూస్తే ఇదే అనిపించేది… కామెడీదేముంది..? ఎవడైనా చేస్తాడు… మరీ ఈతరం ప్రేక్షకులకు అలవాటైన రోత కామెడీని ఎవడైనా చేయగలడు… కానీ కామెడీ షోలో కన్నీళ్లు పెట్టించేవాళ్లు కొందరే… సుధీర్ కూడా వారిలో ఒకడు… ఈసారి ఏదో వృద్ధాశ్రమం నుంచి కొందరన్ని తీసుకొచ్చాడు… రక్తబంధాలు లేవు, ప్రేమల్లేవు, ఏ మానవీయతా లేదు… ఐనవాళ్లే వదిలేసుకున్న పాత్రలు అవి… కొంతసేపు వాళ్లతోనే షో నడిపించాడు… హృద్యంగా ఉంది, హృదయం కదిలించేలా ఉంది… చివరకు కదిలిపోయిన వర్ష, మరో ఆర్టిస్టు అక్కడికక్కడ ఆర్థికసాయం ప్రకటించారు… వాళ్లు ఒక ఓల్డేజీ హోం ముసలామె కాళ్లు మొక్కుతున్న సీన్ కదిలించేసింది… అది మానవీయ స్పందన… రష్మీలు, అనసూయలు, రోజాలకు ఇవి అర్థం కావు… కామెడీ స్టార్స్‌లో ఆ ఛాయలే కనిపించవు… అర్థమయ్యే స్థితిలో వాళ్లు ఉండరు… కానీ నటి ఇంద్రజ ఆ వృద్ధాశ్రమం మందుల ఖర్చు నేను భరిస్తాను అని ప్రకటించింది… ఇది కేవలం ఆ షో కోసమో, ఆ స్కిట్ రక్తికట్టడం కోసమో ప్రకటించబడిన ఔదార్యం అనుకునేలా లేదు… సెట్లో అందరినీ కన్నీళ్లు పెట్టించేలా సాగింది ఆ ఎపిసోడ్… కామెడీ షో అంటే కేవలం బూతులు, అక్రమసంబంధాలు, వికారం-వాంతుల డైలాగులు కాదు… కామెడీ నడుమ కన్నీళ్లు కూడా ఉంటయ్… రోజా… అర్థమవుతోందా..?! అరియానా, అవినాష్, శేఖర్ మాస్టర్, నవ్వడం కూడా రాని శ్రీదేవీ, ఆషురెడ్డి, రెచ్చిపోదాం అనే రాజీవ్, మేఘన ఎట్సెట్రా…. అందరూ కాస్త కళ్లు తెరవండి…!! ప్రత్యేకించి మల్లెమాల బాధ్యులు…!!
Share this Article