అందరూ ఆడిపోసుకుంటారు గానీ… నిజానికి జగన్ ప్రభుత్వం కాదు, రెడ్లకు మస్తు పదవుల్ని ఇచ్చి, అమితంగా ప్రేమిస్తున్నది కేసీయార్…! పవన్ కల్యాణ్ కూడా తిట్టిపోస్తాడు గానీ, సరిగ్గా లెక్కతీస్తే బహుశా జగన్‌కన్నా అనేక రెట్లు కేసీయారే రెడ్లను ప్రేమిస్తున్నట్టున్నాడు… ప్చ్, పాపం, కేసీయార్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక… ‘‘రెడ్లను తొక్కుతున్నాడు, సరైన ప్రాధాన్యం ఇవ్వడు, అంతా వెలమరాజ్యం అయిపోయింది, కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ కాబట్టి, రెడ్లను తొక్కితే కాంగ్రెస్ పని మటాష్ అనుకుంటున్నాడు, అసలు తెలంగాణలో రెడ్లను అణిచేస్తే అన్నిరకాల సామాజిక దురహంకారాలు, వివక్షలు అంతమై, అంతిమంగా బంగారు తెలంగాణ సిద్ధిస్తుందని భావిస్తున్నాడు…’’ అంటూ ఇన్నాళ్లూ కేసీయార్ మీద నిందలు మోపుతున్నారు కొందరు… కానీ నిజం ఏమిటో కూడా రెడ్లకే తెలుసు… ఆయన ప్రత్యర్థి పార్టీలోని రెడ్లను కూడా అక్కున చేర్చుకుని, కోవర్టులుగా మార్చుకున్నాడు అని కూడా కొందరు అనవసర ప్రచారాలు కూడా చేస్తుంటారు… కానీ రెడ్ల మీద ఆయన ప్రేమ స్వచ్ఛం, అనుపమానం, అది మత్తడి దూకేంత ఉధృతి… అనుమానంగా ఉందా, సందేహంగా చూస్తున్నారా… ఈయన మాటల్ని ఓసారి చదవండి…
పల్లా రాజేశ్వరరెడ్డి… రెడ్డే… జమ్మికుంటలో రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో కుండబద్ధలు కొట్టి ఘంటాపథంగా చెప్పాడు… 33 శాతం ఎమ్మెల్యేలు, 40 శాతం ఎమ్మెల్సీలు, 33 శాతం కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులు… అసలు ఇంతమంది రెడ్లకు కేబినెట్‌లో స్థానం ఇవ్వడమే కేసీయార్ ప్రేమకు నిఖార్సయిన నిదర్శనం అని కూడా చెప్పాడు… దాదాపు తొమ్మిది కేబినెట్ స్థాయి కలిగిన పోస్టులు ఇచ్చాడట… ఎహె, జగన్ గానీ, జగన్ నాన్న గానీ రెడ్లకు ఈ న్యాయం చేయలేదని కూడా లెక్క తేల్చేశాడు… నిజానికి రెడ్ల మీద కేసీయార్ ప్రేమ, పల్లా రాజేశ్వరరెడ్డి తేల్చిన లెక్కల మీద తెలంగాణలో జరగాల్సినంత పొలిటికల్ చర్చ జరగడం లేదు… కేసీయారే ఇంత న్యాయం చేస్తుంటే ఇంకా రేవంత్‌రెడ్డి నేతృత్వం అవసరమా కాంగ్రెస్‌కు..? షర్మిల పార్టీ అవసరమా ఇప్పుడు..? బీజేపీలోని రెడ్లు కూడా వెంటనే రాజీనామాలు చేసేసి, ప్రగతిభవన్ దగ్గర క్యూ కట్టడం బెటర్ కదా..? సీపీఐలోని రెడ్డి సాబ్‌లు కూడా పునరాలోచించుకోవాలా..? నిజమైన ‘రెడ్డిబంధు’ కేసీయార్‌కు యావత్ రెడ్డి సమాజం మద్దతు పలకాల్సిన అవసరం ఉందా లేదా..? ఏమాత్రం చాన్స్ దొరికినా రెడ్లు తన కుర్చీకున్న నాలుగు కాళ్లూ కోసేస్తారనే భయసందేహాలు కూడా కేసీయార్‌కు ఏమీ లేవు… ఆయన ప్రేమ భయరహితం, ఆ ప్రేమ అనంతం… అసలు ఒక దశలో తన సీఎం కుర్చీ ఖాళీ చేసి, ఎవరైనా రెడ్డిని కూర్చోబెడితే ఎలా ఉంటుందని కూడా ఆలోచించి ఉంటాడా..? ఏమో, అదొక్కటీ పల్లా రాజేశ్వరరెడ్డి క్లారిటీ ఇవ్వడం లేదు…! ఈసారి ఆత్మీయ సమ్మేళనంలో కాస్త ఆ క్లారిటీ ఇవ్వాలి రెడ్డి గారూ… ప్లీజ్…!! ష్, మళ్లీ గట్టిగా ఎక్కడా అనకండి, అంతటి జేసీరెడ్డి వంటి ప్యూర్ రెడ్డి నేతలే రాయలసీమను వదిలేసి, తెలుగుదేశాన్ని వదిలేసి, మరో రెడ్డి ప్రేమికుడు చంద్రబాబును విడిచిపెట్టి తెలంగాణకు వచ్చేస్తాను అంటున్నాడంటే కారణం ఏమిటి..? కేవలం రెడ్ల మీద కేసీయార్‌కున్న ప్రేమ… సో, చాలామంది రెడ్లు ఏపీని వదిలేసి వచ్చేసే సూచనలే కనిపిస్తున్నయ్…!! జగన్ ఇకనైనా కాస్త రెడ్లకు సముచిత ప్రాధాన్యం, గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం కూడా బాగా కనిపిస్తోంది సుమా…!!
Ads
Share this Article