పవన్ కల్యాణ్ పిచ్చోడేమీ కాదు… జనం అన్ని ఎన్నికల్లోనూ ఘోరంగా తిరస్కరించి ఉండవచ్చుగాక… ఎంచక్కా మళ్లీ సినిమాలు చేసుకుంటూ ఉండవచ్చుగాక… కానీ తను నిర్మించుకున్న పొలిటికల్ ప్లాట్‌ఫాం మనుగడ కాపాడుకోవాలి కదా… ఎప్పుడో ఓసారి, ఏదో ఓ సందర్భం, ఏదో ఓ అంశాన్ని పట్టుకుని ప్రచారతెర మీదకు రావడం… నేను రాజకీయాల్లోనే ఉన్నానహో అని చాటుకోవడం… అది ఆయన అవసరం… నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకెవరూ ఉన్నట్టు లేదు… ఆ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సహా అందరూ వదిలేసినట్టున్నారు… ఐనాసరే, ఉనికిని చాటుకోక తప్పదు… సరిగ్గా తన సినిమా ఇండస్ట్రీకే సంబంధించిన ఓ అంశం దొరికింది… ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే పేరిట, వ్యూహాత్మకంగా ఒక్కొక్కరినీ కెలికాడు… కావాలనే కులాన్ని లాగాడు… సరిపోయింది, నాలుగు రోజులపాటు మళ్లీ పవన్ కల్యాణ్ ప్రచారతెరపై ఉంటాడు… వైసీపీ ఆ ఉచ్చులో పడిపోయింది…
- పేర్ని నాని తప్పకుండా స్పందిస్తాడని తెలుసు, స్పందించేందుకే సన్నాసీ అన్నాడు… దాంతో కొడాలి నానిని మించి రెచ్చిపోయాడు, భాష అదుపు తప్పింది, బూతులు సంధించాడు… పవన్ కల్యాణ్‌కు పోయిందేముంది..? నోరు ఖరాబైంది నానిదే కదా… పీకే విమర్శ చేస్తే తప్పకుండా కౌంటర్ చేయాలా..? అదీ ఈ రేంజులో..? మంత్రులంతా స్పందించి, తలా ఓ మాట అనేశారు సరే, ఏమైంది..? వాళ్లంతటవాళ్లే పీకేకు ‘‘ఎక్కువ ప్రాధాన్యం’’ ‘‘అనవసర ప్రాధాన్యం’’ ఇచ్చారు… పవన్ కోరుకున్నదే జరిగింది…
- జస్ట్, పవన్ కల్యాణ్ విమర్శల్ని వదిలేసి ఉంటే పవన్ కల్యాణ్ వ్యూహం అడ్డంగా ఫెయిలయ్యేది… ఆన్‌లైన్ టికెట్లు, థియేటర్లలో రేట్లపై సర్కారు నిర్ణయాన్ని సినిమాటోగ్రఫీ వ్యవహారాలు చూసే ఎవరైనా అధికారితో ‘‘పాయింట్ టు పాయింట్’’ కౌంటర్ ఇప్పిస్తే సరిపోయేది… భలే ఉండేది… మీడియాకు ఎటూతోచక వేరే అంశాన్ని ఎంచుకుని దానిపై పడేది, పీకే టెంపరరీ పొలిటికల్ స్ట్రాటజీ వీగిపోయేది… ఎలాగూ వంగి వంగి దండాలు పెట్టే సినిమా బ్యాచ్ సమర్థిస్తుంది, సమర్థిస్తూనే ప్రెస్‌నోట్ విడుదల చేసింది… పవన్ కల్యాణ్ అభిప్రాయాలతో మాకేమీ సంబంధం లేదని కుండబద్ధలు కొట్టేసింది…
- కావాలనే దిల్ రాజు అధికార కులాన్ని ప్రస్తావించాడు… కావాలనే సీఎం జగన్‌తో మోహన్‌బాబు బంధుత్వాన్ని లాగాడు… మోహన్‌బాబు టెంపర్‌మెంట్ తెలిసిందే కదా, ఎలాగూ స్పందిస్తాడని, వీలైనంతగా రచ్చ జరుగుతుందనీ పీకే అనుకున్నాడు… మోహన్‌బాబు వెంటనే నోరు విప్పకుండా, ‘మా’ ఎన్నికలయ్యాక ‘‘సమాధానం’’ చెబుతాను బిడ్డా, కాస్త ఆగు అని స్పందించాడు…
- పవన్‌కు కౌంటర్ ఎలా ఇవ్వాలో, ఏం ఇవ్వాలో కూడా జగన్ ఆఫీసు నుంచి ఎవరికీ డైరెక్షన్ లేదు, ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్లు ఏదేదో మాట్లాడారు… ఉదాహరణకు మంత్రి అనిల్ సంపూర్ణేష్‌ను లాగాడు, మాకు పవనైనా ఒకటే, సంపూ అయినా ఒకటే అన్నాడు… పరోక్షంగా ఇది సంపూను అవమానించడం… ఈ వివాదంతో సంబంధం లేని సంపూను ఇందులోకి లాగి ఇజ్జత్ తీయడం ఏమిటి..? ఇదేం సంస్కారం..? వైసీపీకి పొలిట్ బ్యూరో వంటి వ్యవస్థ ఏదైనా ఉంటే, ఆ పెద్దలు ఒకసారి, భిన్నకోణంలో గనుక సమీక్షించుకుని చూసుకుంటే… పీకేపై కౌంటర్ల విషయంలో ఎలా తొందరపడ్డారో, ఎలా దిశారహితంగా వ్యవహరించారో అర్థమవుతుంది…!~!
Share this Article
Ads