కొన్ని అంతే… తెలంగాణ ఉద్యమం ఓ సమర్థ, నిస్వార్థ, ప్రగతిశీల నాయకత్వాన్ని అందించలేకపోయిందనీ…. అంతకుముందే భ్రష్టుపట్టిన నేతల్నే తిరిగి కుర్చీలు ఎక్కించిందనీ ఏడవలేం… కనీసం సరైన వ్యవసాయ విధానాలతో రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సరైన అండగా నిలబడలేని ప్రభుత్వాన్ని అందించిందనీ ఏడవలేం… బయట జరిగే ప్రచారాలు వేరు, జరుగుతున్న నష్టాలు వేరు… ఉదాహరణకు… ఆత్మహత్యలకు రైతుబీమాయే సరైన పరిష్కారం అనే అపరిణత ఆలోచన విధానం నేడు మనం ఎదుర్కునే ఓ విషాదం… సాగు చేసినా, చేయకపోయినా రైతుబంధు ఇచ్చేస్తే సరి అనే మరో పరిష్కారం మరింత అపరిణత, నష్టదాయక ఆలోచన విధానం మరో విషాదం…
ఒరేయ్, పత్తి వేయండర్రా అంటారు, తీరా పత్తి వేసి దెబ్బతింటే ఆదుకునే మనిషి ఉండడు… వరి వేసి కుమ్మేయండర్రా అంటారు… తీరా కొనేవాడు ఉండడు… మక్కలు కొనేవాడు దొరకడు… ఊరూరా లోకల్ మార్కెటింగ్ అంటారు పరమానందయ్య శిష్యరత్నాలు… పల్లె నుంచి రాష్ట్ర స్థాయి దాకా రైతు సమన్వయ సమితులు అంటారు, రైతు వేదికలు అంటారు, అసలు అది అడుగు కదిలేది లేదు, ఎవడికీ పనికొచ్చేది లేదు… ఆమధ్య ఆయిల్ పామ్ అన్నారు… అందర్నీ అటువైపు తీసుకుపోతాం, ఇక బంగారు తెలంగాణ కాదు, ప్లాటినం తెలంగాణ అన్నారు… అసలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఉందానే సందేహాల్లో ముంచెత్తుతూ…! అసలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూల నేలలు ఏమో కూడా ఈ పాలకులకు తెలియదు… అసలు రైతులకు సంబంధించి సరైన ఆలోచన విధానం అంటూ ఉంటే కదా… అఫ్ కోర్స్, పాలకపక్షంకన్నా ప్రతిపక్షం మరీ దరిద్రం, వాళ్లకు అసలేమీ తెలియదు…
Ads
ఇది నిన్నటి టీఆర్ఎస్ అధికార పత్రిక, ప్రభుత్వ గెజిట్ నమస్తే తెలంగాణలో ఫస్ట పేజీ వార్త… తెలంగాణ రైతాంగానికి ఓ కొత్త దిశ చూపిస్తుట్టుగా బిల్డప్… డప్పు… ఇంకేముంది..? పెట్రోల్‌లో ఇథనాల్ కలిపేద్దాం… వరి, మక్క, నూకలు, చెరుకు… అన్నీ ఇథనాల్ వైపు మళ్లించేద్దాం… ఇక ఆకాశమే మన హద్దు అన్నట్టుగా కథనం… నిజంగా ప్రభుత్వ విధానాల్ని, ఆలోచనల్ని చూస్తే జాలేయడం లేదు… తెలంగాణ సమాజం ఎంచుకున్న పొలిటికల్ చాయిస్ చూసి సానుభూతి చూపడమే…! (ధాన్యం కొనకపోతే కాళేశ్వరం దేనికి అనే ప్రతిపక్ష నాయకులు, సారీ, నాయకులు కాదు, అంగుష్టమాత్రులను చూసి మరింత జాలేస్తోంది… ప్రాజెక్టులు కేవలం పంటల కోసం కాదురా తండ్రీ…)… అసలు ఇథనాల్ అంటే ఇక తెలంగాణ బ్రాండ్ ఇథనాల్ మాత్రమే అన్నట్టుగా బిల్డప్పు… అబ్బే, అప్పుడే అయిపోలేదు, వీళ్లకు ఏమీ తెలియదు, పట్టదు, తెలంగాణ రైతాంగం అంటేనే ప్రస్తుత ప్రభుత్వానికి చిన్నచూపు అనడానికి మరో మంచి వార్త కనిపించింది…
ఆయిల్ పామ్ అయిపోయింది, ఇథనాల్ అయిపోయింది, ఇప్పుడిక వేరే డప్పు అందుకొండి, అది జనపనార అంటోంది… వీళ్లకు అసలు జనపనార ఏ నేలల్లో పండుతుందో తెలుసా అసలు..? తెలంగాణ సమాజం దుర్గతి ఇది… జనుముకు కొన్ని ప్రత్యేక నేలలు అవసరం… ఉమ్మడి ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో కొంతమేరకు జనుము పంట… అంతే… అత్యధికంగా పండేది బెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న మన పాత భూభాగం బంగ్లాదేశ్, నేపాల్ తదితర ప్రాంతాలు… అవే వాటికి అనువైన నేలలు… తెలంగాణలో ఏం పండిస్తారని..? ఒక్కసారి చేతనైతే… తెలంగాణలో అధికార వ్యవస్థ అంటూ జనం కోసం పనిచేస్తూ ఉన్నట్టయితే చత్తీస్ గడ్ చిరుధాన్యాల తాజా పాలసీ అధ్యయనం చేయాలి…
వాళ్లు చిరుధాన్యాలకు క్వింటాల్‌కు 3 వేల ధర ఖరారు చేశారు, 14 జిల్లాల్లో ఎవరు పండించినా ప్రభుత్వమే కొంటుంది… దాన్ని ప్రాసెస్ చేసి అంగన్‌వాడీ, బాల్వాడీ కేంద్రాలకు పౌష్ఠికాహారంగా పంపిణీ చేస్తుంది, అంటే ఒకేసమయంలో రైతును, మహిళల్ని, పిల్లల్ని పట్టించుకుంటోంది… బహుళ ఉపయుక్త విధానం… అంతేకాదు, వరి నుంచి చిరుధాన్యాలకు మారితే ఎకరానికి 9 వేలు ఇస్తానంటోంది… విశేషం ఏమిటంటే..? ఈ చిరుధాన్యాల ప్రాజెక్టుకు అధికారిక, శాస్త్రీయ భాగస్వామి మన రాజేంద్రనగర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్శిటీ పరిధిలో ఉన్న చిరుధాన్యాల పరిశోధన కేంద్రం… మనకు మాత్రం దాన్ని ఉపయోగించుకునే సోయిలేదు…
మరి మనమేం చేయవచ్చు…? మనకు తెలిసిన, మన నేలలకు అనువైన పంటల్ని ప్రమోట్ చేయాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మార్కెట్ డిమాండ్ ఉన్న అపరాలు, నూనెగింజల్ని ప్రోత్సహించాలి… కందులు, పెసర్లు, శెనగలు, మినుములు, నువ్వులు, పల్లి, పొద్దుతిరుగుడు ఎట్సెట్రా… ఆ సోయి లేదు, ఆ దిశగా ఆలోచనల్లేవు… ఎంతసేపూ పొలిటికల్ లబ్ది కోసం వేసే వేషాలు తప్ప… వేల కోట్ల మేరకు రైతుబంధు వృథా ఖర్చు తప్ప… నిజంగా రైతును సరైన వ్యవసాయం దిశగా నడిపించిందెక్కడ..? రాజకీయాలే అంతిమం కాదు, పాలన అనేది ఓ సంక్లిష్ట, విస్తృత సబ్జెక్టు… ఏడేళ్లలో ఇప్పుడు వీళ్లకు ఈ సోయి వస్తుందనుకోవడం కూడా మన పొరపాటే…. నిజమేమిటంటే.. ఇలాగే నిష్ఠురంగా ఉంటుంది…!!
Share this Article