పార్ధసారధి పోట్లూరి ……….. చైనాలో భారీ స్థాయిలో విద్యుత్ కొరత ! విద్యుత్ కొరత వల్ల భారీ స్థాయిలో బ్లాక్ అవుట్స్ మరియు పరిశ్రమల మూసివేత జరుగుతున్నది. క్రిస్మస్ దగ్గర పడుతుండడంతో పశ్చిమ దేశాలతో పాటు యూరోపు నుండి కూడా భారీగా ఆర్డర్లు రావడంతో ఉత్పత్తిని పెంచే ప్రయత్నంలో ఉండగా, అనుకోని విధంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల మరింత ఒత్తిడిని ఎదుర్కుంటున్నది చైనా. అనుకున్న సమయానికి డెలివరీలు చేయలేకపోవచ్చు చైనా. ఈ సారి పశ్చిమ దేశాలతో పాటు ఇటు యూరోపులో కూడా చాలా వరకు మాల్స్, సూపర్ బజార్ లలో ఖాళీ రాక్స్ దర్శనమివ్వబోతున్నాయి. తీవ్రమయిన విద్యుత్ కొరత ప్రధానంగా చైనా తూర్పు తీరంలో ఉంది. చైనాలోని అత్యధిక జనాభా నివసించేది తూర్పు తీరంలోనే అన్న సంగతి మారిచిపోకూడదు. విద్యుత్ కొరత ఎంతలా ఉంది అంటే చాలా వరకు అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ సౌకర్యాన్ని ఆపేశారు విద్యుత్ ని ఆదా చేయడం కోసం… కొన్ని మునిసిపల్ కార్పొరేషన్ల లో ప్రజలని నీళ్ళు నిల్వ చేసుకోమని కోరుతున్నారు అధికారులు. ఇది కొన్ని నెలల వరకు విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేయలేమని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు…
లాక్ డౌన్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న దేశాలు ముఖ్యంగా అల్యూమినియం, స్టీల్, సిమెంట్ కి సంబంధించి ఆర్డర్లు ఇస్తుండడంతో ఈ మూడు పరిశ్రమలకి భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఏర్పడింది. సిమెంట్ కొరత వస్తే అది చైనా నిర్మాణ రంగం మీద తీవ్ర ప్రభావం చూపించడమే కాదు. పరోక్షంగా చైనా ఆర్ధిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. ఇక స్టీల్, అల్యూమినియం పరిశ్రమల మీద కూడా తీవ్ర ఒత్తిడి ఉంది… ఈ మూడు పరిశ్రమల మీద విద్యుత్ వాడకం మీద ఆంక్షలు విధించింది చైనా గత్యంతరం లేక… విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే స్టీల్, అల్యూమినియం, సిమెంట్ పరిశ్రమల మీద కోత విధించి దానిని సాధారణ ప్రజల విద్యుత్ అవసరాల కోసం ఇస్తున్నది చైనా. ఇంత హఠాత్తుగా విద్యుత్ కొరత ఎందుకు ఏర్పడింది చైనాలో ?
2020 లో కోవిడ్ కి కారణం చైనా అని ఆస్ట్రేలియాలో ప్రదర్శనలు జరిగాయి అయితే దీనిమీద చైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. అప్పటికే చైనా మీద కోపంగా ఉన్న ఆస్ట్రేలియా ముందు 5G నెట్వర్క్ విషయంలో చైనాని నిషేధించింది. తరువాతి కాలంలో మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ఆస్ట్రేలియా ఒక దశలో బొగ్గు ఎగుమతుల మీద నిషేధం విధిస్తామని కూడా హెచ్చరించింది. ఫలితంగా బొగ్గు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో చైనా ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకడం మూలాన బొగ్గు కొరత ఏర్పడింది… చైనాలో సింహా భాగం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టలు ఉన్నాయి. వీటికి నాణ్యమయిన బొగ్గు అవసరం ఉంది. ఆస్ట్రేలియాతో విభేదాల కారణంగా బొగ్గు సరఫరా మందగించింది. ఇప్పుడు అదే బొగ్గు కొరత విద్యుత్ ఉత్పత్తి మీద పడింది. జలవిద్యుత్ ప్రాజెక్టులు వరదల కారణంగా నీటిని దిగువకి వదిలాయి. ఇప్పుడు నీటి నిల్వలు తగ్గి జల విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో విద్యుత్ ని ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. వెరసి అన్నీ అలా కలిసి వచ్చి విద్యుత్ కొరతని సృష్టించాయి.
మరో పక్క చైనా కమ్యూనిస్ట్ పార్టీ ధరల నియంత్రణ బోర్డ్ ధరలు పెరగకుండా [బొగ్గు కొరత వల్ల ధరలు పెరిగాయి ] ఉత్పత్తి తగ్గించమని ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల బొగ్గు ధరలు పెరగకుండా చూడవచ్చు అని వాళ్ళ ప్లాన్. కానీ అది వర్క్ అవుట్ కాదని తెలుసుకునేలోగానే చాలా పరిశ్రమలు తమ ఉత్పత్తి ని 50% తగ్గించడం లేదా కొన్ని పరిశ్రమలని మూసి వేయడం జరిగింది . హాంకాంగ్ దగ్గర లోని Dongguan అనే నగరం మేజర్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా పేరు ఉంది. ఈ నగరంలో ఒక చెప్పులు తయారు చేసే ఫాక్టరీలో 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే తీవ్ర విద్యుత్ కొరత వల్ల యజమాని $10,000 ఖర్చుతో రెండు జెనరేటర్స్ కొనాల్సి వచ్చింది ఉత్పత్తి ఆపకుండా ఉండడానికి. పెరిగిన అద్దెలతో పాటు జెనరేటర్స్ కోసం వాడే డీజిల్ కూడా అదనంగా తోడయింది. మార్కెట్లో పోటీ ధరలకి ఇప్పుడు మేము చెప్పులు అమ్మలేమని వాపోతున్నాడు యజమాని. మేము ఈ ఫాక్టరీ పెట్టి 20 ఏళ్లు అవుతున్నది కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పాడు. ఇదొక ఉదాహరణ.
మూడు తైవాన్ కి చెందిన ఎలక్ట్రానిక్ కంపనీలు ఆదివారం రోజున ఒక ప్రకటన విడుదల చేశాయి. విద్యుత్ కొరత వల్ల మేము సమయానికి మా క్లయింట్స్ కి ఒప్పందం ప్రకారం ప్రొడక్ట్స్ ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాము అని. ఈ మూడు తైవాన్ కంపనీలకి ప్రధాన క్లయింట్స్ వచ్చేసి ఆపిల్ మరియు టెస్లా లు ఉన్నాయి. అయితే క్రిస్మస్ సేల్స్ కి సంబంధించి ఆపిల్ నష్టపోవడంఖాయం కానీ ఆపిల్ కానీ టెస్లా కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యుత్ బోర్డ్ మాత్రం ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రజలకి విద్యుత్ సరఫరా చేస్తామని ఒక ప్రకటన చేసింది. అఫ్కోర్స్ ఇలాంటి ప్రకటనలు మామూలే ఏ దేశం అయినా సరే, విద్యుత్ కొరతకి కారణాలు ఏమిటో, అలాగే భారీ పరిశ్రమల మీద పెట్టిన ఆంక్షలు ఎన్నాళ్ళు కొనసాగుతాయో మాత్రం సరిగ్గా చెప్పదు.
ఇక జపాన్ కి చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ ఆడిట్ సంస్థ ‘నోముర ‘ మాత్రం చైనా అభివృద్ధి రేటుని గతంలో 4.3% గా చెప్పింది కానీ ఇప్పుడు విద్యుత్ కొరత వల్ల ఏర్పడ్డ సంక్షోభం మీద దానిని 3.4% ఉండబోతున్నది అని చెప్పింది. ఇది ఇప్పటి వరకు వేసిన అంచనా మాత్రమే. అదే ముందు ముందు కనుక విద్యుత్ సంక్షోభం ఇలానే కొనసాగితే అభివృద్ధి రేటు 2.5% గా ఉండవచ్చు. గత 25 ఏళ్లలో ఇదే అతి తక్కువ అభివృద్ధి రేటు అవబోతున్నది చైనా కి. ఇక చైనా నుండి ఎగుమతి అయ్యే ఎలెక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీద ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నది. కంప్యూటర్, టీవి, మొబైల్ ఫోన్ ల విడిభాగాల రేట్లు బాగా పెరిగిపోయాయి. అమెరికా చైనాకి చేసే ఎలెక్ట్రానిక్ చిప్స్ ఎగుమతుల మీద నిషేధం విధించడం ఒక కారణం అయితే కోవిడ్ వల్ల ప్రొడక్షన్ పడిపోవడం ఇంకో కారణం. చైనా లో విద్యుత్ ఛార్జీలు చాలా తక్కువగా ఉండడం వలన ఆ భారం విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలమీద పడుతున్నది. కానీ ఇప్పుడు ఆ చౌక బేరం వీలయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం రెగ్యులేటరీ బోర్డ్ ఇళ్ళకి వాడే విద్యుత్ తో పాటు పరిశ్రమలకి ఇచ్చే విద్యుత్ ఛార్జీలని భారీగా పెంచాలనే వాదన బలంగా వినపడుతున్నది. ఇదే జరిగితే ముందు ముందు చైనా చవుకగా తన ఉత్పత్తులని విదేశాలకి అమ్మలేదు. విద్యుత్ రేట్లు పెరిగితే అది పరోక్షంగా ఇతరత్రా ప్రభావం చూపుతుంది కానీ ఇప్పటికిప్పుడు ఎక్కువ ధర పెట్టి బొగ్గు కొనాలి అంటే విద్యుత్ ఛార్జీలని పెంచక తప్పనిసరి పరిస్థితి.
రాబోయే రోజుల్లో జింగ్పింగ్ కి కష్టాలు తప్పేట్లు లేవు. చైనా కమ్యూనిస్ట్ పార్టీలో తనకి ప్రత్యర్ధులుగా ఎదుగుతారు అని భావించినవాళ్ళందరిని తొక్కేసాడు కానీ ఇప్పుడు కొత్తగా పుట్టే అసమ్మతి ఎదుర్కోవడం అంత సులభంగా ఉండబోదు. పైకి కనిపించినంతగా లేదా ఎప్పుడూ అబద్ధాలు మాత్రమే చెప్పే CCP కి ఇకముందు నిజాలు దాచడం కష్టం అవుతుందనే చెప్పాల్సి ఉంటుంది. చైనా జరిగేవి చైనాలోనే ఉండిపోతాయి అని నానుడి. కానీ ఇప్పటి విద్యుత్ సంక్షోభం తాలూకు వార్త మాత్రం చైనా దాటి బయటికి వచ్చేసింది అంటే మార్పు వస్తున్నది అనే కదా అర్ధం ? ఒకప్పుడు సోవియట్ రష్యా కూడా ఇలాగే చేసింది, ఐరన్ కర్టెన్ గా పిలవబడే సోవియట్ ప్రాపగాండా పత్రిక ‘ప్రావ్డా ‘ చెప్పిందే వ్రాసుకోవడం అంతర్జాతీయ జర్నలిస్టుల పని తప్పితే ఆ ఐరన్ కర్టెన్ వెనుక ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలిసేది కాదు. చివరకి ఆర్ధిక ఇబ్బందులని తట్టుకోలేక చేతులు ఎత్తిసిన తరువాత సోవియట్ వివిధ చిన్న చిన్న దేశాలుగా విడిపోయాక అసలు నిజం బయటపడ్డది. రెండు బ్రెడ్డు ముక్కల కోసం గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సి వచ్చింది. సోవియట్ విచ్ఛిన్నం తరువాత. ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే సంవత్సరాలలో సోవియట్ అంత కాకపోయినా చైనా ఎంతో కొంత దెబ్బ తినే అవకాశాలని కొట్టి పారేయలేము…
Share this Article