ముందుగా ఒక సీన్ ఊహించండి… అత్యంత భద్రత కలిగిన ఓ వ్యక్తి కాన్వాయ్ వెళ్తోంది… ఓ నిర్ణీత ప్రాంతం రాగానే కాస్త స్లో అయ్యింది… ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ వాహనం విసురుగా కాన్వాయ్‌లోని ఆ వ్యక్తి వాహనం వైపు వచ్చింది… దానికి ఫిట్ చేసి ఉన్న మెషిన్ గన్ కాల్పులు ఆరంభించింది… వెంటనే అలర్ట్ అయిన ఆయన గన్‌మెన్ ఇతర వాహనాల నుంచి దిగారు… ఎవరు కాలుస్తున్నారో, తాము ఎవరిని కాల్చాలో అర్థం గాక అటూఇటూ చూశారు… ఎవరూ కనిపించలేదు…
ఆ గన్‌మెన్ చీఫ్ సదరు వీవీఐపీని కవర్ చేయడానికి అడ్డంగా వెళ్తే తనపైనా కాల్పులు జరిగాయి… టార్గెట్ బయటకు పడిపోయాడు, బుల్లెట్లు సూటిగా తన దేహాన్ని ఛిద్రం చేశాయి… అంతే… కాల్పులు జరుపుతున్న వాహనం దానంతట అదే పేలిపోయింది… ఏ ఆధారాలూ బయటపడకుండా ఉండేందుకు…! తరువాత టార్గెట్ వీవీఐపీ మరణించాడు… అసలు కాల్చింది ఎవరు..? ఓ మిస్టరీ సినిమా సీన్ చూస్తున్నట్టుగా ఉంది కదా…
సేమ్, ఇరాన్ అణుశాస్త్రవేత్త మోసన్ హత్య ఇలాగే జరిగిందీ అంటున్నది ఇరాన్ మీడియా… అక్కడి ప్రభుత్వం, the Islamic Revolutionary Guard Corps కూడా ఇదే అనుమానిస్తోంది…
Ads
వాళ్ల అనుమానం, ఆరోపణ ఏమిటంటే..? ఈ పని చేసింది ఇజ్రాయిల్… ఒక ఉపగ్రహం నుంచి ఈ హత్యను ఆపరేట్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్లస్ రిమోట్ కంట్రోల్ సాయంతో కచ్చితంగా టార్గెట్‌ను షూట్ చేశారు, అందుకే ఆయన పక్కనే ఉన్న ఆయన భార్యకు ఒక్క బుల్లెట్ కూడా దిగలేదు… అసలు వ్యక్తులు లేని అత్యంతాధునిక, టెక్నికల్ ఆపరేషన్ అని వాళ్ల వివరణ… పైన చార్ట్ చూశారు కదా, ఆపరేషన్ ఇలాగే జరిగి ఉంటుందని వాళ్ల భావన…
ఈ అణుశాస్త్రవేత్త మోసన్… హత్య జరిగింది నవంబరు 27న… టెహ్రాన్‌లో… అణుకార్యక్రమాల్ని ఆపడానికి కీలకమైన సైంటిస్టులను హతమార్చడం అనేది ఎప్పట్నుంచో ఉన్నదే… ఈయన ఇరాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన సైంటిస్టు… ఇక ఇజ్రాయిల్ ఇలాంటివి చేయడంలో పేరొందిందే… ప్రత్యేకించి తన సీక్రెట్ సర్వీస్ మొసాద్ ఎప్పటికప్పుడు ప్రత్యేక టెక్నాలజీ సాయంతో ఆపరేషన్లు చేస్తుంటుంది… టార్గెట్లను వేటాడటంలో మొసాద్ మోస్ట్ కట్టర్ సీక్రెట్ సర్వీస్…
అయితే ఇక్కడ క్లారిటీ రానిది ఏమిటయ్యా అంటే..? అత్యంత భద్రత కలిగిన ప్రముఖుల కాన్వాయ్‌లో బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్ వాడతారు… పైగా ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌ను అడ్డుకునే జామర్లు వాడుతుంటారు… మరి ఈ కాన్వాయ్ అంత తేలికగా ఎలా దొరికిపోయింది అనేది ప్రశ్న… సరే, ఈ ఆపరేషన్ ఎలా ఉన్నా… ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు, వాళ్ల భద్రతా వ్యవస్థల అధికారులకు వణుకు పట్టుకుంది… ఉపగ్రహాల సాయంతో, కృత్రిమ మేధస్సు సాయంతో జరిగే ఇంతటి యాక్యురేట్ హత్యా ఆపరేషన్లను ఎలా నిరోధించాలి..? అసలు ఇప్పుడు ఇరాన్ ఆరోపిస్తున్నది నిజమేనా..? ఆ వివరాల సేకరణలో మునిగిపోయారు..!!
Share this Article