హవ్వ…!! ఇది ఫస్ట్ పేజీ వార్తా..? అదీ ఎక్కడో స్పెయిన్‌లో ఓ అగ్నిపర్వతం పగిలిపోతే..!! అగ్నిపర్వతం పేలిపోతే లావా ఉప్పొంగదా..? అది దాని సహజ లక్షణం కదా…. మరీ ఈనాడు వాడేమిటి..? లావా ప్రవహించడమే ఓ విశేషంగా రాస్తాడేమిటి..? తెలంగాణ ప్రాంతంలో వేరే వార్తలే లేవా..? హైలైట్ చేయాల్సిన కథనాలే లేవా..? ఏమోలెండి, ఈమధ్య ఏమీ రాయలేని దురవస్థలో కొట్టుకుంటున్నాడులే… అర్థం చేసుకుందాం… గీత దాటితే కేసీయార్ కొరడా తీసుకుని చెమ్డాలెక్కదీస్తాడనే భయం… ఇన్నేళ్ల నంబర్ వన్ తెలుగు జర్నలిజం గజగజ, లబలబ… సరే, అది వాడి ఖర్మ… కానీ ఆ రాసే వార్తలైనా సరిగ్గా రాసి ఏడవొచ్చుగా… అదే ఇప్పుడు ఈనాడు మీద జాలి, సానుభూతి… నో, నో, అది వేగంగా పత్రిక లక్షణాలు కోల్పోతుందనేది కాదు మన ఉద్దేశం… ఆల్ రెడీ కోల్పోయింది అనేది కూడా కాదు… అసలు దాన్ని పత్రికగా ఇంకా గుర్తించే పాఠకుల దురదృష్టం… అంతే…
నదీప్రవాహాన్ని తలపించేలా ఉందట లావా..? ప్రవాహంలాగా గాకుండా బయటికి రాగానే ఆ పర్వతశిఖరంపైనే గడ్డకట్టుకుపోవాలా..? పైగా అదంతా సముద్రంలో కలుస్తూ భయాందోళనలు పెంచుతోందట… దగ్గరలో సముద్రం ఉంటే అక్కడికే కదా లావా నదులైనా, నీటి నదులైనా పయనించేది..? ఇదేమైనా అద్భుతమా..? అసాధారణమా..? హహహ… అగ్నికీలలు చల్లటి నీటిలో కలవడం ద్వారా విషవాయువులు విడుదలై అక్కడి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారట…. అబ్బఛా… లావా సముద్రనీటిలో కలిస్తే విషవాయువులు విడుదల అవుతాయా..? అవి స్థానికులకు అనారోగ్య సమస్యలు తీసుకొస్తాయా..? భలే చెప్పావు బ్రదరూ…! నువ్వు పాత్రికేయంలో ఇంకా చాన్నాళ్లు ఉండాలి సుమా…
Ads
లావా దెబ్బకి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు…. ఇవన్నీ కామనే వాక్యాలే గానీ… అసలు నిప్పులు చిమ్మి, నీటిని చేరితే…. అదీ ఎక్కడో స్పెయిన్‌లో అగ్నిపర్వతం పేలితే… అది ఫస్ట్ పేజీ వార్త ఎలా అయ్యిందో ఇప్పటికీ సమజ్ అయితలేదు… అరె, వైసీపీ వాళ్లకు భయం అంటే ఏమిటో నేర్పించే వార్తలు, బాపట్లలో పుడితేచాలు బూతులు వచ్చేస్తాయనే కొత్త సూత్రీకరణలు, కేటీయార్ ప్రధాని కాబోతున్నాడనే డప్పులు… అరె, రాయడానికి వార్తలే లేవా..? లేక అవి రాయడానికి కూడా గజగజ… చలిజ్వరమా..? పోనీ, తెలంగాణ రైతాంగం ప్రధాన సమస్యలున్నాయి కదా…. వరి, పత్తి, మొక్కజొన్న… ఆయిల్‌పామ్, జనపనార, రైతుబీమా… ఒక్కటీ వార్త అనిపించలేదా..? రాసేవాడు లేడా..? రాయాలని అడిగేవాడు లేడా..? రాసినా అచ్చేసేవాడు లేడా..? రాసుకొండిరా రాసుకొండి, యాంజిలినా జూలీ పైపెదవి మీద కురుపు లేచిందట… చైనాలో బొగ్గుగని ప్రమాదంలో ఇద్దరు మరణించారట… వెతికితే బొచ్చెడు వార్తలు ఇలాంటివి… ఏముందిర భయ్, పేజీలు నింపామా లేదా..? జనానికి అంటగట్టామా లేదా..? బస్, అరెరె, తాజా వార్త బ్రదర్… దక్షిణ ఛైనా సముద్రంలో ఏదో ఓ చిన్న ఓడ మునిగిపోయిందట… రేప్పొద్దున ఫస్ట పేజీలో కుమ్మేయండి…!!
Share this Article