సైకో రేపిస్టు రాజుగాడు ఆత్మహతం అయిపోయి రోజులు గడుస్తున్నయ్… అయిపోయింది, మరో రాజుగాడు దొరికేదాకా మీడియా మాట్లాడదు… సత్వర న్యాయం లాభనష్టాలేమిటో ఎవరూ చర్చించరు… ఈ సత్వర న్యాయాలకు దారితీస్తున్న న్యాయవ్యవస్థ వైఫల్యాల మీద కూడా ఎవరూ ఏమీ మాట్లాడరు… అన్నట్టు ఈ సత్వరన్యాయం, న్యాయవ్యవస్థ వైఫల్యం అంటే ఓ వార్త గుర్తొస్తోంది… చెప్పుకోవాలి… ప్రముఖంగా అచ్చేయాల్సిన ఆ వార్తను కొన్ని పత్రికలు, టీవీలు అసలు వార్తగానే చూడలేదు, పట్టించుకోలేదు… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే…? ఉమేశ్‌రెడ్డి… వయస్సు 52… మాజీ సీఆర్పీఎఫ్ జవాను… కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన ఈ వీరకీచకుడు 19 మంది మీద అత్యాచారం చేశాడు… అందులో కొందరిని ఖతం చేసేశాడు కూడా… కొన్ని బయటికే రాలేదని పోలీసులు అంటుంటారు… తను జమ్ముకాశ్మీర్ పోస్టింగులో ఉన్నప్పుడు తమ కమాండెంట్ కూతురి మీదే అత్యాచార ప్రయత్నం చేశాడు… అక్కడి నుంచి మళ్లీ చిత్రదుర్గకు పారిపోయి వచ్చి, ఎలాగోలా అందరి కళ్లుగప్పి డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ పోలీసుల్లో చేరాడు, మధ్యప్రదేశ్‌లో శిక్షణ కూడా పొందాడు…
ఒకసారి ఓ అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం చేయబోతే, చేతికందిన రాయితో బలంగా వాడి నెత్తిన మోది తప్పించుకుంది… తరువాత రిపబ్లిక్ పరేడ్‌లో ఉన్నప్పుడు ఆమె గుర్తించింది… పోలీసులు అరెస్టు చేశారు, నాలుగు తోమితే తన కథలన్నీ బయటపడ్డయ్… తన అత్యాచారాల కథలు గుజరాత్ దాకా విస్తరించినట్టు తెలుసుకుని పోలీసులే షాకయ్యారు… ఆడవాళ్ల లోదుస్తులు దొంగిలించడం, వాటిని ధరించడం వాడికో పిచ్చి… ఓసారి పోలీసులు వాడి గదిలో సోదా చేస్తే ఓ గోనె సంచి నిండా ఆడవాళ్ల లోదుస్తులు దొరికాయి… 1996 నుంచి 2002 వరకు… రెండుసార్లు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు… కొన్ని కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేవు… కొన్ని నేరాల్లో పోలీసులు బలమైన ఆధారాలు సంపాదించారు… అలాంటి నేరాల్లో ఒకటి 1998లో జరిగిన అత్యాచారం ప్లస్ హత్య… అది బెంగుళూరు నగర పరిధి పీణ్యలో జరిగింది… జయశ్రీ అనే సింగిల్ మదర్… ఆమె మరణించాక కూడా ఆమె శవంతో పలుసార్లు సంభోగించాడు వీడు… దర్యాప్తులు, విచారణలు సా-గీ సా–గీ 2006లో సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది…
Ads
- తన ఉరిశిక్షను రద్దు చేయాలని రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకుంటే… అది 2013లో తిరస్కరణకు గురైంది… అంటే నేరం జరిగిన తరువాత 15 ఏళ్లకు..! శిక్ష ఖరారయ్యాక ఏడేళ్లకు..!!
- సుప్రీం కూడా తన ఆర్జీని తిరస్కరించడంతో, ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని మరో పిటిషన్ వేశాడు… హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సుప్రీం సూచించింది… కథ బెంగుళూరుకు వచ్చింది…
- నిన్న హైకోర్టు ఆ పిటిషన్ కూడా కొట్టేసింది… ఇది 2021… రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించి ఎనిమిదేళ్లు…
- ష్.., అప్పుడే అయిపోలేదు… ఈ తీర్పుపై సుప్రీంలో అప్పీల్ చేసుకోవడానికి హైకోర్టు దయతో ఆరువారాల టైం ఇచ్చింది… సో, కథ మళ్లీ ఢిల్లీ చేరనుంది…
- తను మొదటిసారి హత్యాచారం చేసిన 1996 నుంచి లెక్కిస్తే… 25 ఏళ్లు… దాదాపు 20 కేసులు… ఈరోజుకూ ఉమేష్‌రెడ్డి సజీవంగానే ఉన్నాడు… మధ్యమధ్య తప్పించుకుంటూ తన ‘కోరికలు’ కూడా తీర్చుకున్నాడు… చాలామంది వాడి చేతుల్లో హతమయ్యారు… వాడు బతికే ఉన్నాడు..!!
Share this Article