సాయిధరమ్ తేజ హీరోగా నటించిన, కట్టా దేవ దర్శకత్వం వహించిన రిపబ్లిక్ సినిమా గురించి స్ట్రెయిట్‌గా చెప్పుకుందాం నాలుగు మాటలు… అంతకుమించి కూడా అవసరం లేదు… నో డౌట్… దర్శకుడికి సిస్టం మీద అసంతృప్తి ఉంది… ఇది మారాల్సిందే అనే కన్సర్న్ ఉంది… ఆవేశం ఉంది… సినిమా అనే దృశ్యమాధ్యమం ద్వారా సీరియస్ ఇష్యూస్ డిస్కస్ చేయాలనే సంకల్పం ఉంది… కొత్తగా ఏమైనా చెప్పాలనే తపన ఉంది… కానీ అది సరిపోదు, సినిమాకు అది మాత్రమే సరిపోదు… ముందే చెప్పుకున్నాం కదా, సినిమా అనేది దృశ్యప్రధానం… అంటే విజువల్ ముఖ్యం… ఓ బిగువైన కథ, దానికి తగిన కథనం, ప్రేక్షకుడిని తనతోపాటు తీసుకుపోయే సీన్స్ కావాలి… అవి లేకపోతే రమ్యకృష్ణలు, ఐశ్యర్య రాజేష్‌లు ఉన్నా సినిమా పండదు… ఇక్కడా అదే జరిగింది… కేవలం డైలాగ్స్‌తో కథ సాగదు… అసలు సరైన సీన్స్ పడాలే గానీ డైలాగ్స్ అనేవి అప్రధానం… పదునైన డైలాగ్స్ సీన్లను మరింత పైకి లేపగలవు తప్ప అవే బలం అనుకుంటే నడవదు… పైగా ఈ సినిమాలోని చాలా డైలాగ్స్ సినిమా చూసే ప్రేక్షకుల్లో 95 శాతం మందికి అర్థమే కావు…
- రాహుల్ రామకృష్ణకు ఓ ఫ్లాష్ బ్యాక్, జగపతిబాబుకు ఓ ఫ్లాష్ బ్యాక్, రమ్యకృష్ణకు ఓ ఫ్లాష్ బ్యాక్… అన్ని బ్యాకుల నడుమ సినిమా ఫ్రంటుకు ఎలా సాగేది..? పైగా విలన్ల మీద కూడా జాలేసి, ఫాఫం, వాళ్లయినా ఏం చేస్తారులే, సిస్టం వాళ్లను అలా తయారు చేసింది అనే జస్టిఫికేషన్ ఇచ్చేస్తే ఇక కథలో బేసిక్ జోష్ ఏది..?
- రమ్యకృష్ణను ప్రధాన పాత్రలోకి తీసుకున్నప్పుడు ఆమె కేరక్టరైజేషన్ అంతే బలంగా ఉండేలా రాసుకుంటే, ఆమెను తీసుకున్నందుకు కొంత సార్థకత ఉండేది… చాలాచోట్ల పాత్ర తేలిపోయింది…
- ఐశ్యర్యా రాజేష్‌ను చూస్తే మరోసారి పాపం అనిపిస్తుంది… ఆమె ఎంచుకుంటున్న కేరక్టర్లు, దక్కుతున్న కేరక్టర్లన్నీ ఆమెలోని నటిని పూర్తిగా బయటికి తీసుకురాలేకపోతున్నయ్… రిపబ్లిక్ సినిమాలో అయితే మరీ దారుణం… అసలు హీరోయిన్ సోదరుడి హత్య, ఆమెపై దాడి, రేప్ అంటే… ఆమె చుట్టూ కథ ఎంత బలంగా నిర్మింపబడాలి…? ఈ పాత్రచిత్రణను దర్శకుడు మరీ చంపేశాడు…
- ఎట్టెట్టా… కేంద్రప్రభుత్వం ఒక జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కూడా బదిలీ చేయడానికి వీల్లేకుండా ప్రత్యేక అధికారాలతో నియమిస్తుందా..? హీరో ఆవేశంగా ఓ స్పీచు దంచగానే న్యాయమూర్తి ప్రభావితుడైపోయి సానుకూల తీర్పు చెప్పేస్తాడా..? సినిమా కథలకు లాజిక్కులతో పెద్దగా పనిలేదు అనే వాదన కరెక్టేమో గానీ మరీ ఇంత లాజిక్ రాహిత్యం మాత్రం పనికిరాదు… సినిమాటిక్ స్వేచ్ఛ పలుచోట్ల నవ్వొచ్చేలా ఉంది…
- సోషల్, పొలిటికల్ కథ తీసుకుంటే… సిస్టంలో లోపాల్ని డిబేట్‌కు పెట్టాలనుకుంటే… ఇంత నీరసమైన కథనం ఉపయోగపడదు… ప్రేక్షకుడు ఇన్వాల్వ్ కాడు… దీనికితోడు కథలోని సీరియస్‌నెస్ నుంచి అక్కడక్కడా కాస్త రిలీఫ్ కలిగించే వినోదాంశాలూ లేవు… అసలు హీరో హీరోయిన్ల ప్రేమే సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు…
- థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఆ పాటల్ని ఒకసారి చెప్పాలని అడిగితే ఒక్క ప్రేక్షకుడూ చెప్పలేడు… అదీ మణిశర్మ ప్రతిభ… దర్శకుడి నిర్లక్ష్యం…
- సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడిని నీరసం ఆవహిస్తుంది… అంటే కథనలోపం… దర్శకుడి లోపం… చెప్పాలనుకుంటే ఇంకా చాలా మైనస్ పాయింట్లున్నయ్… చివరగా… సాయిధరమ్… ఫార్ములా కథల్లో ఇమడకుండా కొత్తగా పాత్రల్ని ఎంచుకుంటాడు, సిన్సియర్‌గానే కష్టపడతాడు… కానీ రిపబ్లిక్ మూవీ హీరో పాత్ర తనకు బరువెక్కువైంది… ఐనా తన శక్తి మేరకు తను ప్రయత్నించాడు… అయితే అంతిమంగా ప్రేక్షకుడికి బలంగా కలిగే ఫీలింగ్ ఏమిటంటే…. ఫాఫం ఐశ్యర్య… ఫాఫం రమ్యకృష్ణ…!!
Share this Article
Ads