Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గాంధీ హత్య తర్వాత… గాడ్సే కులస్థులపై దాడులు… కులమేం పాపం చేసింది..?!

October 2, 2021 by M S R

……. By……….. Nancharaiah Merugumala…………  హంతకుల కులపోళ్లను చంపడం గాంధీజీ హత్యతోనే మొదలైందా?

–––––––––––––––––––––––––––––––––––––––––

జనాకర్షక నేతలను చంపినవారి కులస్తులను లేదా మతస్తులను వేటాడి చంపే ఆనవాయితీ 1948 జనవరి 30న ఇండియాలో మొదలైందనే విషయం బెజవాడలో స్థానిక కాంగ్రెస్‌ కాపు ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు హత్య జరిగే వరకూ మా తరం వారికి తెలియదు. ‘గాంధేయ మార్గం’లో నిరశన దీక్షలో ఉన్న వంగవీటి రంగాను 1988 డిసెంబర్‌ 26 తెల్లవారుజామున కొందరు కత్తులతో పొడిచి చంపారు. చంపినది ఆయన బద్ధశత్రువు, కంకిపాడు తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యే దేవినేని రాజశేఖర్‌ వర్గీయులనే అంచనాతో కాంగ్రెస్‌ కాపులు తమ అనుచరులతో కమ్మవర్గంపై దాడులు చేసి కొందరిని చంపారు. దొరికినచోట దోపిడీలు, కమ్మల ఆస్తులు ధ్వంసం చేశారు.

Ads

ఇలా తమ ‘ప్రియతమ’ నాయకుణ్ని చంపిన జాతి వారిపై దాడులు చేయడం రంగా హత్యతో కాపులు మొదలబెట్టారనుకున్నాం. కాని, వెంటనే మాకు 1984 అక్టోబర్‌ 31న అప్పటి కాంగ్రెస్‌ హిందూ ప్రధాని ఇందిరాగాంధీని ఇద్దరు సిక్కు బాడీగార్డులు తుపాకులతో కాల్చిచంపాక జరిగిన ఘటనలు గుర్తుకొచ్చాయి. ఇందిర హత్య వార్తతో రెచ్చిపోయిన కాంగ్రెస్‌ హిందూ గూండాలు, కార్యకర్తలు దిల్లీ, తదితర నగరాల్లో సిక్కులపై దాడులు జరిపి వేలాది మందిని చంపారు, గాయపరిచారు. కోట్లాది రూపాయల ఆస్తులు దహనం చేశారు. నాలుగేళ్ల తర్వాత జరిగిన వంగవీటి రంగా హత్యానంతర దాష్టీకాలు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మాకు, ‘‘ఈ తరహా మూక హింసకు పవిత్ర భారతంలో వేలాది ఏళ్ల చరిత్ర ఉంది. స్వతంత్ర భారతంలో మాత్రం గాంధీ హత్య జరిగాక, హంతకుల కులం వారిపై హతుడి అభిమానులు లేదా కులపోళ్లు దాడులు చేసే సంస్కృతి మొదలైంది’’ అని కొందరు పాత్రికేయ పెద్దలు వివరంగా చెప్పారు…

gandhi

దాదాపు 74 ఏళ్ల క్రితం దిల్లీలో జరిగిన మోహన్‌దాస్‌ గాంధీ హత్య తర్వాత, చంపినవాళ్లు ముస్లింలని జనం పొరపాటుపడకుండా నివారించడానికి ఆలిండియా రేడియో, ‘గాంధీజీని చంపిన వ్యక్తి హిందువు,’ అని ప్రకటించింది. గాంధీని ఇటాలియన్‌ పిస్టల్‌తో కాల్చిచంపిన నాథూరామ్‌ గోడ్సే అనే విషయం తెలియగానే, గోడ్సే అప్పటి బొంబాయి రాష్ట్రంలోని పూనా నగరానికి చెందిన మరాఠీ బ్రాహ్మణుడు అనే వాస్తవం మహారాష్ట్రియన్లకు అర్ధమైపోయింది. కాంగ్రెస్‌కు చెందిన బ్రాహ్మణేతర కులాల కార్యకర్తలు, ‘సమరశీల’ గాంధేయవాదులు బొంబాయి స్టేట్‌లోని పూనా తదితర నగరాలు, పెద్ద పట్టణాల్లోని బ్రాహ్మణుల ఇళ్లపై దాడులు చేశారు.

బ్రాహ్మణ పురుషులను బయటికి లాగి కొట్టి దౌర్జన్యం చేశారు. అయితే, గాంధీ అభిమానులు, కాంగ్రెస్‌ శూద్రుల దాడుల్లో బ్రాహ్మణలు ఎవరూ చనిపోయినట్టు ప్రభుత్వాలు ధ్రువీకరించలేదు గాని, వందలాది మంది బ్రాహ్మలు ఈ కాంగ్రెస్‌ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఆరెసెస్‌ నేపథ్యం ఉన్న మిత్రులు ఇప్పటికీ చెబుతుంటారు. ఇంకా మరాఠీ బ్రాహ్మణ స్త్రీలపై ఈ దుండగులు అత్యాచారాలకు పాల్పడ్డారని కూడా సంఘ్‌ పరివార్‌ సభ్యులు అంటుంటారు.

gandhi

గాంధీని చంపిన వార్త తెలియగానే పూనా వంటి మహారాష్ట్ర నగరాలు, పట్టణాల్లో బ్రాహ్మణులు ఆనందంతో మిఠాయిలు పంచుకు తిన్నారనే వార్త దావానలంలా వ్యాపించడంతో నిజంగానే మరాఠీ బ్రాహ్మణుల కొంపలు అంటుకున్నాయి. బ్రాహ్మణ శాఖల్లో అత్యున్నతమైనదిగా భావించే చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడనే విషయం వ్యాప్తిచెందడం వల్ల ఆయన కులస్తులు, చిత్పవన శాఖకు చెందినవారు బాగా నష్టపోయారు. ఒక్కోసారి హంతకులు తప్పించుకున్నా, వారి జాతి, మతం లేదా కులం వారు– కోపోద్రిక్తులైన మూకల ఆగ్రహానికి బలి అయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. మరాఠీ బ్రాహ్మణులూ అలాగే తాము చేయని నేరానికి మూల్యం చెల్లించారు.

చివరికి గాంధీ హత్యకేసులో నాథూరామ్‌ గోడ్సే, నారాయణ్‌ అప్టే అనే మరాఠీ బ్రాహ్మణ నిందితులను దోషులుగా తూర్పు పంజాబ్‌ హైకోర్టు ధ్రువీకరించాక, వారిని 1949 నవంబర్‌ 15న ఉరితీసి మరణశిక్ష అమలు చేశారు. ఈ మరణ శిక్షలు అమలు చేసిన 71 రోజులకు 1950 జనవరి 26న భారత రాజ్యాంగం ప్రకారం భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. హైకోర్టు తీర్పును సవాలు చేయడానికి దోషుల కుటుంబసభ్యులకు ప్రీవీ కౌన్సిల్‌ అనుమతించలేదు. మొత్తానికి స్వతంత్ర భారతదేశంలో అతి పెద్ద రాజకీయ హత్య మహాత్మా గాంధీది కావడం, ఆయనను కాల్చిచంపిన హంతకుడు, అతని సహ కుట్రదారు నారాయణ్‌ ఆప్టే బ్రాహ్మణులు కావడం మరాఠీ బ్రాహ్మణులకు చాలా కాలం మాయని మచ్చగా ఉంది.

gadse

తొలి హిందూ తీవ్రవాది గోడ్సే బ్రాహ్మణుడు కావడం, ముస్లింల పక్షపాతి అనే ద్వేషంతో గాంధీజీని ఆయన కాల్చిచంపడం భారత చరిత్రను మలుపు తిప్పాయి. కానీ వైష్ణవ, వైశ్య కుటుంబంలో పుట్టిన మోహన్‌దాస్‌ను చిత్పవన బ్రాహ్మణుడు చంపాడనే వాస్తవం రెండు కులాల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించలేదు. హత్య జరిగిన తర్వాత మరాఠీ బ్రాహ్మణులు కొందరు కాషాయ బ్రాహ్మల పాపాలకు బలి అయ్యారు. గాంధీజీ తన మరణానికి కొద్ది రోజులు ముందు, ‘భారత జాతీయ కాంగ్రెస్‌ లక్ష్యం నెరవేరింది. స్వాతంత్య్రం వచ్చింది. ఇక ఈ పార్టీని సమాజ సేవా సంస్థగా మార్చితే దేశానికి మేలు,’ అని రాసిపెట్టిన కాగితం బాపూ మరణానంతరం దొరికింది.

1977 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తొలిసారి ఓడిపోయినప్పుడు, ‘గాంధీజీ ఆకాంక్షను ఇందిరమ్మ నిజం చేసింది,’ అని అనేక మంది నాలాంటి కాంగ్రెస్‌ వ్యతిరేకులు సంతోషపడ్డాం. అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. మరి గాంధీజీ కలను రాహుల్‌– ప్రియాంకా గాంధీలైనా నిజం చేస్తారో లేదో మరి. ఇంకా ఆ పని ప్రియాంక పిల్లలు మిరాయా, రేహాన్‌ లే పూర్తి చేయాల్సిందేనా? ఫిరోజ్‌, వరుణ్‌ గాంధీకి ఈ పనిలో చిన్న పాత్ర కూడా లభించదా? అనే విషయాలు మరో పాతికముప్పయి ఏళ్లకు గాని తేలవేమో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions