…… By…. కృష్ణ సాయిరాం ……. పట్టుతప్పిన లీడ్………………………………. జర్నలిజంలో సీనియర్లు, జూనియర్ల మధ్య తేడాను స్పష్టంగా తేల్చి చెప్పేది లీడ్ పట్టుకోవడంలోనే… రెండు మూడేళ్ళ అనుభవం ఉన్న జర్నలిస్టులు సైతం యథాతథంగా రిపోర్టు చేయమంటే చేసేస్తారు. కానీ సీనియర్లు రాజకీయ పరిణామాలు, నూతనత్వం, చెప్పిన విషయంలోని డెప్త్, పాయింట్ ప్రాధాన్యతను బట్టి లీడ్ తీసుకుంటుంటారు. అదే సీనియార్టీని వెల్లడిస్తుంది. ఏ వార్తకైనా లీడే ముఖ్యం… వార్తను లీడ్ చేసేది అదే… రిపోర్టర్లు పంపే వార్తలను సీనియర్లు డెస్క్ లో తిరగరాసి, పాఠకాసక్తికరంగా తీర్చిదిద్దుతుంటారు. రిపోర్టర్లు రాసి పంపించిన లీడ్ సైతం మారుస్తుంటారు. అందువల్లనే ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడు పతాకస్థాయిలోకి వస్తుంటాయి. తాజాగా పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ జనసేన శ్రమదాన సభలను కవరేజీ చేసిన తీరు చూస్తుంటే ప్రధాన పత్రికలు లీడ్ తీసుకోవడంలో పట్టు తప్పుతున్నాయా? అన్న సందేహం తలెత్తుతోంది.
పవన్ వార్త కాబట్టి సాక్షి పత్రిక ఎలాగూ పట్టించుకోదు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రెండూ సైతం యుద్దానికి సిద్దం, దేనికైనా సై అనే కోణంలో లీడ్ తీసుకున్నాయి. తొక్కి నారతీస్తా వంటివి సబ్ హెడ్డింగులు కూడా… నిజానికి పవన్ మాటల్లో ఇది కొత్త అంశం కాదు. పునరుద్ఘాటన మాత్రమే. గతంలోనే అనేకసందర్బాల్లో ప్రస్తావించిన ధోరణే.. అయితే ఇంతవరకూ తనదైన కాపు సామాజిక వర్గం అంశాన్ని సాధ్యమైనంతవరకూ ప్రస్తావించకుండా వస్తున్నారు పవన్ కల్యాణ్. తొలిసారిగా ఆ సందిగ్ధత నుంచి బయటపడి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ముందుకు రావాలంటూ తొలిసారిగా బహిరంగంగా పిలుపునిచ్చారు. పెత్తనం తీసుకోవాలని ఆహ్వానించారు. ఈ పరిణామం రాజకీయంగా జనసేనాని స్టాండ్ లో వచ్చిన మార్పునకు సంకేతం. సాధారణ పరిస్థితుల్లో అదే లీడ్ గా మారుతుంది.
Ads
రాజకీయాల్లో అవునన్నా, కాదన్నా కులం ప్రదాన పాత్ర పోషిస్తోంది. తెలుగుదేశంకి కమ్మ సామాజిక వర్గం అండగా ఉంటుంది. అలాగే వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం, మిగిలిన సామాజిక వర్గాలు సందర్బాన్ని బట్టి ఆయా పార్టీల చుట్టూ కేంద్రీకరణలో భాగంగా చేరుతుంటాయి. అయితే పవన్ ఇంతవరకూ కులాన్ని ఓ రాజకీయ సాధనంగా బహిరంగంగా వినియోగించడానికి ఇష్టపడ,క తన సామాజిక వర్గ ప్రస్తావనకు విముఖంగా ఉంటున్నారు. కానీ వాస్తవాలు వేరు. తన కులాన్ని సొంతం చేసుకుంటూ, సంఘటిత పరుచుకుంటూ ఇతరులను అప్పీల్ చేయడమే సరైన రాజకీయ నిర్ణయమన్న వాస్తవం ఆయనకు తాజా పరిణామాలతో బోధపడిందనే చెప్పాలి. ఈ నేపధ్యమే పెత్తనం చేసేందుకు ముందుకు రావాలంటూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు పిలుపునివ్వడంలోని ఆంతర్యం. ఇది రాజకీయంగా ఒక కొత్త అంశం. జనసేన పార్టీ పరంగా విధానపరమైన మార్పునకు సూచిక. సాధారణ పరిస్తితుల్లో అయితే పత్రికలు దీనినే లీడ్ గా తీసుకోవాలి. కానీ పాయింట్ పట్టుకోవడంలో మిస్ అయ్యాయా? లేక ఉద్దేశపూర్వకంగానే విస్మరించాయా? తెలియదు. కానీ ఈ రాజకీయ సామాజిక పిలుపునకు లీడ్ స్థాయి కల్పించలేదు. యుద్ధానికి సిద్ధమనే సాధారణ శీర్షికతోనే సరిపెట్టేశాయి…
Share this Article