గ్రామీణ విలేఖరి… కంట్రిబ్యూటర్… ఈ మాట వినగానే ఇప్పుడు చాలామంది చెప్పేమాట… బ్లాక్ మెయిలర్లు, ప్రభుత్వ సిబ్బందికన్నా దారుణ దోపిడీదారులు… అందరినీ పీడిస్తుంటారు… సమాజానికి ఓ కొత్త బెడద… అనేక చానెళ్లు, అనేక పత్రికలు… వీళ్లకుతోడు ఫేక్ చానెళ్లు, ఫేక్ పత్రికలు, వాట్సప్ ఎడిషన్లు, యూట్యూబ్ చానెళ్లు, వాటి ప్రతినిధులు… ఎవరు విలేఖరో తెలియదు…… ఇదేకదా చాలామందిలో నెలకొంటున్న అభిప్రాయం… మొన్న ఓ వైసీపీ ఎమ్మెల్యే అయితే ఫేక్ రిపోర్టర్లు గనుక ఎదురైతే ఇసుక లారీలు ఎక్కించేసేయండి అన్నాడట, యాక్సిెడెంట్ కేసే కదా, నో ప్రాబ్లం అని పిలుపు ఇచ్చాడట… మరోచోట జనం ఈ పాత్రికేయం వేధింపులకు నిరసనగా ఆందోళనలు నిర్వహించారట… ప్రతిచోటా వింటూనే ఉన్నాం ఇలాంటివే ఏదో ఒకటి……… ‘‘మీరు పాత్రికేయం, ప్రమాణాలు, విలువలు అని పాఠాలు స్టార్ట్ చేయకండి, ఎవడైనా జీతాలు ఇస్తున్నాడా..? ఎంతోకొంత వాళ్ల కడుపు నింపుకోవడం సంపాదించుకోనివ్వండి సార్… అక్రమాల నాయకులు, అవినీతి అధికారులు, దోపిడీ వ్యాపారులు, సమాజం ఏమైనా బాగుందా సార్… తప్పుచేసినవాడే వీళ్లకు భయపడతాడు’’ అనే సమర్థన కూడా వినిపిస్తూ ఉంటుంది… కానీ నాణేనికి మరోవైపు..?
….. ఈ సూసైడ్ లేఖలోని ఈ పార్ట్ చదవండి… నాణేనికి మరోవైపు అర్థమవుతుంది… గ్రామీణ విలేఖరి అంటే మొత్తం వికృతస్వరూపం కాదు, ఇదుగో, ఓ కడుపు మెలితిప్పే విషాదమూ ఉంది… మెదక్ జిల్లా, నర్సాపూర్ పట్టణంలోని వార్త ప్రత్రిక రిపోర్టర్ ప్రవీణ్ గౌడ్ చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు… ఈమధ్య ఇలాంటి ఆత్మహత్యలు రెండోమూడో విన్నట్టు, చదివినట్టు గుర్తు… ఒక్క ముక్కలో కడుపు చించుకున్నాడు… పాత్రికేయ వృత్తి కూడా విలువలు కోల్పోయి అడుక్కునే స్థితికి పడిపోయింది… నిజంగా ఈ దురవస్థపై జర్నలిస్టు సర్కిళ్లలో డిబేట్ జరగాలి… యూనియన్లు ఏమీ చేయలేవు… ప్రభుత్వాలూ ఏమీ చేయవు… మరి ఎలా..? అసలు బాధ్యులు ఎవరు..? ఇదే సూసైడ్ లేఖలోని మరో పార్ట్ చదవండి, మరింత కలిచివేస్తుంది…
Ads
చదివారు కదా… విలేఖర్ల కుటుంబాల దుస్థితి… బాధ్యులు ఎవరు..? పత్రికలు, చానెళ్లే… పత్రికల కథే తీసుకుందాం… ఎవడికీ పెద్ద సర్క్యులేషన్ ఉండదు, భారీగా కాపీలు అమ్ముతున్నట్టు చూపించి ప్రభుత్వ యాడ్స్ కుమ్మేస్తూనే ఉంటాయి… ఇప్పుడైతే కరోనా శకం కదా, అన్నీ వాట్సప్ ఎడిషన్లే… కొన్ని చందా కాపీలు మాత్రం ప్రింట్ చేస్తుంటారు… వాటి కోసం, యాడ్స్ కోసం, టార్గెట్లు పెట్టి విలేఖరులను వేధించడం, పీడించడం… ఇవిగాకుండా కొన్ని పత్రికలు మరీ దుర్మార్గంగా ఫ్రాంచైజీ సిస్టంలో ఏరియాల వారీగా విలేఖరులకు ‘‘అమ్ముకుంటున్నాయి’’… నెలకు ఇంత, నువ్వు ఏమైనా రాసుకో, ఏమైనా చేసుకో… అది చేతకాకపోతే మరొకడు… సో, ఈ దందా చేయగలిగేవాళ్లు మాత్రం ఫీల్డులో ఉండండి, లేకపోతే ఈ మీడియాలో ఇమడలేరు, ఏ చెరువో రారమ్మని ఇలాగే పిలుస్తుంది… దందా చేతకానివాళ్లు, కాస్త డొక్కలో నీతినిజాయితీ, ఆదర్శాలు గట్రా బతికిఉన్నవాళ్లు ఫీల్డ్ వదిలేయండి… మీ బాసుల కోసం, మీ పత్రికల కోసం, వాటి అక్రమార్జన కోసం మీ ప్రాణాలు బలిపెట్టుకోకండి… అలాంటి మీడియా సమాజాన్ని ఏమీ ఉద్దరించేది లేదు, మీరు కొవ్వొత్తులు కానవసరం లేదు..!!
Share this Article