“SQUID GAME”…….. మీరు ఆడే రేసుల్లో గుర్రాలుంటాయి ..మా డబ్బున్నవాళ్లు ఆడే రేసుల్లో మనుషులుంటారు.. డబ్బులేని పేదవాళ్లే మా రేసుల్లో గుర్రాలన్నమాట.. మీరు గుర్రాల మీద పందేలు ఎలా కాస్తారో మేము ఇక్కడ మనుషుల ప్రాణాల మీద పందెం కాస్తాం..ఇది
స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ లో ఒక డైలాగ్.. దీనిలోనే ఈ వెబ్ సిరీస్ సారాంశం అంతా ఉంటుంది.. ధనం మూలం ఇదం జగత్… అన్నింటికీ మూలం ధనమే.. డబ్బు లేకపోతే రోజు గడుస్తుందా ? ఆఖరికి గాలి, నీరు కూడా కొనుక్కుని బతకాల్సి వస్తోంది.. మనసు, మమత, బంధం, అనుబంధం, రక్తసంబంధం ఇలా ఎన్ని కబుర్లు చెప్పుకున్నా.. ఈ కాలంలో మనుషుల్ని నడిపించేవి మాత్రం ఆర్థిక సంబంధాలే. మన దగ్గర నాలుగు డబ్బులుంటేనే ఎవడైనా పట్టించుకునేది.. ఈ డబ్బు కోసమే కొంతమంది చెమటోడ్చి కష్టపడ్తారు.. ఇంకొంతమంది వీళ్ల చెమటని దోచుకుంటారు.. ఇంకొంతమంది ఇదే డబ్బు కోసం ప్రాణాలు తీస్తారు .. పని చేసినా, వ్యాపారం చేసినా, బ్రోకరిజం చేసినా, వ్యభిచారం చేసినా, మోసం చేసినా , హత్యలు చేసినా ఏది చేసినా డబ్బు కోసమే ..
కొరియన్లకి, ఇండియన్ సైకాలజీకి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉంటుంది .. కొరియన్ సినిమాల్లో పాత్రలు మన జీవితాలకి దగ్గరగా ఉంటాయి. ఒక పారాసైట్, పండోరా ఇదే కోవలో తాజాగా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన “స్క్విడ్ గేమ్” ఇవన్నీ భారతీయ మనస్తత్వాలకి చాలా దగ్గరగా ఉంటాయి..ఒక విధంగా ఇక్కడి పేదరికానికి , మధ్యతరగతి జీవితాలకి చాలా దగ్గర పోలిక ఉంటుంది.. పారాసైట్ లో పేదవాడి ఒంటి నుంచి వచ్చే చెమట వాసనని కూడా చీదరించుకునే ధనవంతుడి పాతైనా , డబ్బు ఎక్కువై మనుషులతో ప్రాణాలతో ఆటలాడే “స్క్విడ్ గేమ్ “లో రిచ్ పీపుల్ అయినా ఇవన్నీ మనం నిత్యం నిజజీవితంలో చూసే పాత్రలే..
Ads
స్క్విడ్ గేం చివరి సిరీస్ లో ఇంకాసేపట్లో ప్రాణాలు పోయే దశలో ఉన్న ధనవంతుడైన వృద్దుడు ఇలా అంటాడు.. నాలాంటి ఎంతోమంది ధనవంతులు జీవితమంతా విపరీతంగా డబ్బు సంపాదించాం.. అవసరం లేనంత డబ్బు మా దగ్గర ఉంది.. జీవితంలొ అన్నీ అనుభవించేశాం.. జీవితంలో డబ్బుతోపాటు మనిషి కోరుకున్నవన్నీ మాకు దొరకడం వల్ల్ బోర్ కొట్టేసింది.. దేనికోసమైనా ప్రయత్నం చేస్తుంటే , కష్టపడుతుంటే జీవితంలో కష్టసుఖాలు అన్నీ బేలన్స్ అవుతుంటే బావుంటుంది.. కానీ అన్నీ సుఖాలే ఉంటుంది నిత్యం జీవితం బోర్ కొడుతుంది.. అందుకే మాకు జీవితంలో ఫన్ కావాలి .. అది అలాంటి ఇలాంటి ఫన్ కాదు .. మనిషి డబ్బు కోసం మృత్యువుతో పోరాడుతో మా కళ్లముందే రక్తం కక్కుతూ చనిపోతుంటే , డబ్బు కోసం స్వార్ధంతో పక్క మనిషిని అత్యంత క్రూరంగా చంపుతుంటే , ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడుతుంటే మాకు ఫన్ లభిస్తుంది.. అది పైశాచికత్వం అయినప్పటికీ మాలాంటి డబ్బున్నోళ్లకి అందులో ఏదో తెలీని ఆనందం లభిస్తుంది అంటాడు ..
అత్యంత ధనవంతుడైన అ ముసలాయన ఆలోచనల నుంచి పుట్టిందే స్క్విడ్ గేమ్.. ఇలాంటి మరికొంతమంది డబ్బున్నోళ్లంతా కలిసి సరదా కోసం ఒక దీవిలో ఆడించే ప్రమాదకర ఆట స్క్విడ్ గేమ్.. జీవితమంతా అవసరం లేనంత డబ్బు సంపాదించినోళ్లకి అందరికీ నిజంగా ఇలాగే జీవితం బోర్ కొడుతుందా ? వాళ్లంతా కొత్త కొత్త ఆనందాల కోసం ఇలాగే వెంపర్లాడతారా ? ఆలోచిస్తుంటే చాలావరకూ నిజమే అనిపిస్తుంది.. పేదవాళ్లకి ఆ రోజుకి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తే చాలు .. మధ్యతరగతి వాడికి ఆ నెల జీతం డబ్బులు ఇంటి ఖర్చులు, ఫీజులు, అద్దెలు, ఈఎంఐలకి సరిపోయి ఈ నెల గడిచిపోతే చాలు.. మరి డబ్బున్నోడి పరిస్తితి ఏంటి .. డబ్బెక్కువైనోడి పరిస్తితి ఏంటి ?
చిన్నప్పుడు కొత్త పుస్తకం, కొత్త పెన్ను, కొత్త బ్యాగ్ కొనుక్కుంటే అదో అనందం.. పండక్కి కొత్త బట్టలు కుట్టిస్తే అవి వేసుకున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతాకాదు.. మొదటిసారి సైకిల్ తొక్కినపుడు, అభిమాన హీరో సినిమా రిలీజైన రోజే టికెట్ దొరికి సినిమా హాల్లో స్నేహితులతో సినిమా చూసినపుడు కలిగే సంతోషం వెల కట్టలేనిది .. మంచి ఉద్యోగం దొరికి మొదటి నెల జీతం అందుకున్నపుడు, వ్యాపారం ప్రారంభించి తొలి కస్టమర్ మన దగ్గర ఏదైనా కొన్నప్పుడు, కొత్త బైక్ కొనుక్కున్నప్పుడు…… ఇలా మన ఆనందాలే వేరు .. నిత్యం జీవన్మరణ పోరాటంలో విజేతలుగా నిలిచిన ఫీలింగ్, ఆ సంతృప్తి వేరు.. కష్టపడి పిల్లల్ని చదివించి ఆ పిల్లలకి మంచి ఉద్యోగం దొరికినపుడు, కూతురికి బంగారం లాంటి అల్లుడు దొరికినపుడు, అక్షయ తృతీయకి చెవిపోగులు కొనుక్కున్నప్పుడు, మంచి స్కూల్లో పిల్లలకి సీట్ దొరికినపుడు ఎన్నెన్నో ఆనందాలు, వాటికి ముందు ఎన్నెన్నో కష్టాలు , కన్నీళ్లు ఇలా సాగిపోతుంది మన మధ్యతరగతి జీవితం.. కానీ ఇవేమీ లేని డబ్బెక్కువైన బడాబాబుల పరిస్తితి ఏంటి .. మనలాగా రోజెలా గడుస్తుందోననే దిగులు లేదు .. ఒకటో తారీకు జీతం కోసం ఎదురు చూసే పరిస్తితి ఉండదు .. పెద్ద పెద్ద కష్టాల తర్వాత వచ్చే చిన్నచిన్న ఆనందాలు వారికి ఉండవు మరెలా ? అందుకే వారంతా ఇలా పేదలతో స్క్విడ్ గేమ్ ఆడిస్తారు ..
నిత్యం ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యే పేద, మధ్యతరగతి వాళ్లని టార్గెట్ చేసిన ఒక గ్యాంగ్ వాళ్లందరికీ చాలా తేలికైన చిన్న ఆట ఆడించి అందులో గెలిస్తే డబ్బులు ఇస్తుంటారు .. ఇంకా చాలా డబ్బు కావాలంటే మా దగ్గరకి వచ్చి ఇలాంటి ఆటలు ఆడి గెల్చుకోవచ్చని చెబుతారు.. అలా డబ్బు కోసం వాళ్లు చెప్పిన చోటికి వెళ్తే ఒక కారులో వీరిని ఎక్కించుకుని ఎక్కడో సముద్రం మధ్యలో దీవిలోకి తీసుకెళ్తారు .. అలా మొత్తం 456 మందికి అక్కడికి తరలిస్తారు.. మొదటి గేంలో ఓడిపోయినోళ్లందరినీ అక్కడే కాల్చేస్తారు .. అది చూసి మిగిలినోళ్లంతా భయపడి వెళ్లిపోతామంటారు.. అయితే ఇక్కడ గేం గెలిస్తే 45.6 కొరియన్ బిలియన్ వన్ లు అంటే 39 మిలియన్ డాలర్లు మీకు దక్కుతాయంటారు .. అయితే తమకి డబ్బు కంటే ప్రాణాలే ముఖ్యమని తాము వెళ్లిపోతామంటారు అందరూ .. చివరికి మెజారిటీ సభ్యుల కోరిక మేరకు అందరినీ తిరిగి దీవి నుంచి వారి ఇళ్లకి పంపించేస్తారు .. అయితే మళ్లీ మీకు ఈ ఆట ఆడాలనిపిస్తే మనసు మారితే మళ్లీ ఇక్కడికి రావొచ్చని చెబుతారు ..
దీవి నుంచి వెనక్కి వచ్చేశారు కాబట్టి ఇక వెబ్ సిరీస్ ముగిసిపోయిందని బావిస్తాం .. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది..ఇంటికి తిరిగి వచ్చాక వారి జీవితంలో యధావిధిగా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.. అన్నీ డబ్బుతో ముడిపడినవే.. ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన కష్టం .. కొంతమందికి అప్పుల గోల , ఇంకొంతమందికి అనారోగ్య సమస్యలు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ సాధారణంగా రోజూ మనం ఎదుర్కునే కష్టాలే.. ఇవి ఎప్పటికీ తీరేవి కావు .. అంత డబ్బు ఎప్పటికీ సంపాదించలేము.. నిత్యం ఈ కష్టాలు, కన్నీళ్లతో బతికే బదులు చావడమే మేలు అనుకునే దశలో తిరిగి ఆ దీవికి వెళ్లి అక్కడే ఆట ఆడాలని నిర్ణయించుకుంటారు .. అలా రెండోసారి అందరూ దీవికి వెళ్తారు
ఇక్కడే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది .. మనిషి జీవితం డబ్బు మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుంది ? డబ్బు లేకపడే కష్టాలు ఎలా ఉంటాయో ఒక్కో జీవితాన్ని చాలా దగ్గరగా చూపిస్తాడు .. అలా చూపించే ఆర్ధిక కష్టాలన్నీ మనలో ప్రతి ఒక్కరి జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి .. స్క్రీన్ మీద కనిపించేవి కొరియన్ ముఖాలే అయినప్పటికీ అక్కడ మనల్ని మనమే చూసుకుంటాము.. దీవిలో వీరి మధ్య జరిగే ఆటల్ని, అక్కడ జరిగే రక్తపాతం అంతా బాగా డబ్బున్న వాళ్లు వచ్చి చూసి ఎంజాయ్ చేస్తుంటారు .. అక్కడ జరిగే గేం లో మనుషులు చంపుకుంటుంటే తమని వదిలేయమని వేడుకుంటుంటే చావు భయం వారి ముఖాల్లో కనిపిస్తుంటే ఈ ధనవంతులంతా చక్కగా చూస్తూ సంతోషిస్తుంటారు.. ఒకవిధంగా ఎదురుగా జరిగే డెత్ గేం .. వీరికి పబ్జీ లాంటిదన్నమాట .. ఒక విధంగా సినిమా థియేటర్ లో సినిమా చూసినట్టుగా ఈ బడాబాబులు వీరి డెత్ గేం చూసేందుకు అవకాశం ఉంటుంది .. ఆ డెత్ గేం కి అయ్యే ఖర్చు , చివర్లో ఇచ్చే ప్రైజ్ మనీ అంతా వీళ్లే స్పాన్సర్ చేస్తారు .. ఇదంతా దీవిలో రహస్యంగా జరుగుతుంది.. ఇది బయటి ప్రపంచానికి తెలీదు .. ఇక్కడ ఆట ఆడుతూ చనిపోయినవారి మృతదేహాలని అక్కడే ఎలక్ట్రానిక్ మిషన్లలో కాల్చేస్తారు .. మొత్తం 456 మంది దీవిలోకి వెళ్తే అన్ని గేముల్లో విజేతగా నిల్చిన ఒకరికి 39 మిలియన్ డాలర్ల సొమ్ము దక్కుతుంది .. కానీ ఇంతమంది చావుల్ని దగ్గరగా చూసిన అతను ఆ మిలియన్ డాలర్ల డబ్బుని నిజంగా ఎంజాయ్ చేయగల్గుతాడా లేడా అనేది ఈ వెబ్ సిరీస్ అసలు సారాంశం .. ఈ కొరియన్ వెబ్ సిరీస్ ఇపుడు నెట్ ఫ్లిక్స్ లో టాప్ పొజిషన్ లో ఉంది.. ఒక దశలో MONEY HEIST, LUPIN సిరీస్ లని క్రాస్ చేసే అవకాశం ఉంది.. సిరీస్ అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది………….. — అశోక్ వేములపల్లి
Share this Article