చెప్పుకున్నంత ఈజీ కాదు… ఏదో బ్లాగులో నాలుగు ఫోటోలు పెట్టేసి, వ్లాగులో రెండు వీడియోలు పెట్టేసినట్టు కాదు… ఐనాసరే, సాహసం చేయాలనే అనుకున్నాం… నాకు తగ్గట్టు దొరికింది నా భార్య… కొత్తగా పెళ్లయ్యింది మాకు… మాది త్రిసూర్… కొలువులేమో బెంగుళూరు… నేను సేల్స్ వైపు… ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ వైపు… నా పేరు హరికృష్ణన్, ఆమె లక్ష్మి… అసలు వెరయిటీగా హనీమూన్‌కు మోటార్ బైక్ మీద థాయ్‌లాండ్ వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించాం, ఆమె రెడీ అనేసింది… కరోనా ప్రబలుతోంది… దేశాల నడుమ ఆంక్షలుంటయ్, వద్దనుకున్నాం… కానీ పశ్చిమ భారతాన్ని చుట్టేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాం… నిర్ణయం తీసేసుకున్నాం… తెల్లారిలేస్తే అవే కొలువులు, గానుగెద్దు బతుకులు, లైఫులో థ్రిల్ వద్దా..? జ్ఙాపకాలు వద్దా..? అసలు ఈ వయస్సులో కాకపోతే ఇంకెప్పుడు ఈ ప్రయాణాలు… పర్యటనలు..? కొలువులకు రాజీనామాలు ఇచ్చేశాం, పర్లేదు, దాచుకున్న రెండుమూడు లక్షలు సరిపోతాయేమో… ఆల్రెడీ ఓ కారు ఉంది… చుట్టాలు, పక్కాలు, దోస్తులు అందరూ ఎంకరేజ్ చేశారు… కానీ, కొన్ని వేల కిలోమీటర్ల టూర్, సొంత కారులో, ఇద్దరమే… అదెంత కష్టమో అంచనా వేసుకున్నాను… అందుకే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేశాను…
ముందుగా కారును మాకు అనువుగా మార్చుకోవడం… వెనుక సీట్ల మీద ఓ మ్యాట్రెస్… ప్రైవసీ కావాలి కదా, విండోస్‌కు, వెనుక గ్లాస్ కవరయ్యేలా బ్లాక్ వినైల్ కవర్స్… వెనుక సీట్ల మీద పడుకున్నప్పుడు కూడా ముందు నుంచి కనిపించడానికి వీల్లేకుండా… ఫ్రంట్, బ్యాక్ సీట్ల నడుమ కర్టెన్… మన వంట మనమే చేసుకోవడం బెటర్ కదా… సో, ఓ చిన్న గ్యాస్ సిలిండర్, చిన్న స్టవ్వు, కొన్ని వంట పాత్రలు… ప్రత్యేకించి నీళ్లే ప్రధాన సమస్య అవుతుందని తెలుసు… అందుకే 10 లీటర్లు, 5, 5 లీటర్ల మూడు క్యాన్లు… పదేసి జతల బట్టలు… ల్యాప్టాప్స్, ఎప్పటికప్పుడు టిన్పిన్ స్టోరీస్ పేరిట ఇన్‌స్టాలో, యూట్యూబులో పెట్టేయడానికి…! నాకు తెలుసు…, అంత తక్కువ ఖర్చుతో దాదాపు 10-12 రాష్ట్రాల్లో తిరగడం, అదీ మూడు నెలలపాటు… దాదాపు 15 వేల కిలోమీటర్లపైన… వెరీ ఛాలెంజింగ్… రకరకాల పరిస్థితులు… ఇద్దరమే ఎదుర్కోవాలి… ఐనాసరే, బయల్దేరాం… నేను సరే, ఒక్కడినైతే ఎలాగోలా నడిపించేయవచ్చు… కానీ తోడుగా ఆమె… మరి రక్షణ..? మనసులో పీకుతూనే ఉంది…
Ads
త్రిసూర్ నుంచి బయల్దేరాం… 2020లో… బెంగుళూరు మీదుగా ఉత్తర కర్నాటకలోని పలు క్షేత్రాలు… మహారాష్ట్ర, గుజరాత్, జమ్ము-కాశ్మీర్… ఇలా వెళ్తూనే ఉన్నారు… దాదాపు పదిపన్నెండు రాష్ట్రాలు… పొద్దున్నే కాస్త వండుకోవడం, కొన్నిసార్లు అది సాయంత్రానికీ పనికొచ్చేది… సిలిండర్ ఖాళీ అయితే ఎక్కడైనా అది ఇచ్చేసి, వేరే తీసుకోవడం… సాధ్యమైనంతవరకూ పెట్రోల్ బంకుల్లో కారు ఆపేసుకుని, పడుకోవడం… ఓ బకెట్, ఓ మగ్గు… దాంతో టాయిలెట్, స్నానం… లక్ష్మి త్వరగానే అలవాటైంది… డ్రైవింగు అలసట అనిపిస్తే ఎక్కడైనా ధాబా చూసుకుని, అక్కడే తినేయడం, కాస్త పార్శిల్ కట్టించుకుని, మళ్లీ రైట్ రైట్… వీలైనంతవరకూ ప్రధాన రోడ్లే… కొత్తగా పెళ్లి చేసుకుని, పెళ్లాంతో ఈ సాహసం ఏమిట్రా అని మావాళ్లెవరూ మమ్మల్ని నిరుత్సాహపరచలేదు… ఉత్సాహంగా సాగుతూనే ఉంది టూర్… ముందుగా అనుకున్న రోజులకన్నా పొడిగిస్తూనే ఉన్నాం… అనేక ప్రాంతాలు, వాళ్ల భాష, కల్చర్, ఫుడ్, డ్రెస్సులు… మాట్లాడటం, ఫోటోలు- వీడియోలు తీసుకోవడం, అనుభవాల్ని రికార్డు చేసుకోవడం… ఇవి చాలవా జీవితాంతం నెమరేసుకోవడానికి…
లైఫ్ అంటేనే చాలా చిన్నది… వీలైనన్ని ఎక్కువ జ్ఞాపకాలు పోగుపడాలి… వీలైనంత థ్రిల్, ఫన్ అనుభవించాలి… రిస్క్ ఉన్నచోటే థ్రిల్ ఉంటుంది… థ్రిల్ ఉన్నచోటే ఫన్ ఉంటుంది… మేం ఆ రిస్క్ తీసుకున్నాం, సక్సెస్‌ఫుల్‌గా తిరిగి వచ్చేశాం… అలసట తీరింది… నో, నో, ఇంకా కొలువుల్లో చేరలేదు… యూట్యూబు నుంచి వచ్చిన కాస్త ఆదాయం ఉంది, ఇంకాస్త డబ్బు సమకూర్చుకుని ఈసారి తూర్పు దేశం వైపు వెళ్తాం… నిర్ణయం తీసేసుకున్నాం… ప్లాన్ కూడా రెడీ… ఒడిశా మీదుగా బెంగాల్,.. అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలు… ప్రత్యేకించి మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ దాకా… వెళ్లాలి, చూడాలి… రెడీ అయిపోతున్నాం… సేమ్, అదే కారు, అదే సామాగ్రి, అదే జంట… కానీ ఇది మరింత టఫ్ జర్నీ… ఆశీర్వదించండి…….
Share this Article