నిజానికి ఇక్కడ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తప్పేమీ కనిపించడం లేదు… వార్త రాసిన తీరు, సంఘటనను చూసిన తీరే సరిగ్గా లేదు… ఈ పాత్రికేయుడికి ఇంకాస్త శిక్షణ అవసరం… లేదా శిక్ష అవసరం… అసలు ఏం జరిగింది..? ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు వస్తోంది, ఓ గుడి దగ్గర మహిళలు బతుకమ్మలు ఆడుతున్నారు… ఎమ్మెల్యే అక్కడికి వస్తున్నాడు, వెంటనే తీసేయండి అని చెప్పినా మహిళలు వినిపించుకోలేదు… దాంతో ఎమ్మెల్యే గారి కారు బతుకమ్మల మీద నుంచి దూసుకుపోయింది, బతుకమ్మలు చెల్లాచెదురయ్యాయి… మహిళలను గెంటేశారు… కారు లోపల కూర్చున్న ఎమ్మెల్యే గారు మీసం మెలేశారో లేదో కూడా ఈ వార్తలో క్లారిటీ లేదు… (ఆహా, తెలంగాణకు ఎలాంటి ఏక్‌సేఏక్ నాయకుల్ని అందించావయ్యా కేసీయారూ… నిజంగా నీ జన్మ ధన్యం… సార్థకం…)
ఇక్కడ మహిళల తప్పేమిటంటే… ఎమ్మెల్యే వస్తున్నాడు, బతుకమ్మల్ని తీసేయండి అని టీఆర్ఎస్ కార్యకర్తలు, అనగా ధర్మారెడ్డి ప్రభువుల వారి అనుచరగణం ముందే హెచ్చరించారు… ఐనా మహిళలు వినిపించుకోలేదు… బతుకమ్మ అంటే గౌరమ్మ కదా, ఈ రాష్ట్ర అధికారిక ఉత్సవం కదా, కేసీయార్ ప్రభువుల వారు కూడా బతుకమ్మ భక్తుడే కదా, మన పండుగ, మన సంబురం అనుకున్నారు, ఆ భ్రమల్లో మునిగిపోయారు… కానీ వాళ్లు మరిచిపోయింది ఏమిటంటే..? ఎమ్మెల్యే అంటే ఎవరు..? ఆ ఏరియాకు రాజు… రాజు అంటే ఎవరు..? దేవుడు… హరి… పైగా అధికారిక ఎమ్మెల్యే అంటే హైపవర్ దేవుడన్నమాట… ఆ ఏరియాకు తనే కేసీయార్ అన్నమాట… మరి అలాంటి హరి సాక్షాత్తూ వస్తున్నప్పుడు ఈ గౌరమ్మలేంది..? ఈ బతుకమ్మలేంది..? వీళ్ల బతుకులెంత..? పక్కకు జరిగి దండం పెట్టాలా, లేదా..? ఓ పక్క నుంచి ఎమ్మెల్యే కారును తీసుకుపోవాలని అక్కడి సర్పంచి కోరాడట, ఎంత ధిక్కారం..? శూలదండనే కరెక్టేమో… చల్లా ధర్మారెడ్డి రథానికే ఆంక్షలా..? ఎంత రాజద్రోహం..? ఎంత దైవద్రోహం..? అక్కడెక్కడో యూపీలో రైతుల మీద నుంచే కేంద్ర మంత్రి కార్లు తీసుకుపోతే కొందరు చచ్చూరుకున్నారు… ఇక్కడ ఎమ్మెల్యే గారు ఔదార్యం చూపించారా లేదా..? ఐనా ఈ ఏడుపు రాతలేంది..? ఈ కూతలేంది..? గతంలో నిజాం కాలంలో కూడా గిట్లనే తప్పుడు రాతలు రాసేవాళ్లట… రజాకార్లు బరిబాతల బతుకమ్మలు ఆడించారనీ, తెలంగాణ పండుగల్ని ఈసడించేవారనీ అబద్ధపు ప్రచారాలు చేసేవాళ్లట…!
Ads
అసలు ఆమధ్య అయోధ్య విరాళాల మీద ఈ ధర్మారెడ్డి చేసిన గాయిగత్తర చూసినప్పుడే ఆయన ‘రాజరికం’ మీద డౌటొచ్చింది… ఆయనలో ఏదో తెలియని మహత్తు దాగి ఉందనీ అనిపించింది… ‘‘అరె… ఇస్తే గిస్తే తెలంగాణలో మాకే చందాలు ఇవ్వాలి తప్ప ఆ రాముడేంది..? గీముడేంది..? అసలు రాముడు, దేవుడు మా రామచంద్రశేఖర్రావే కదా… తరువాత లక్ష్మణుడు నేను, అలాంటిది దొంగ చందా పుస్తకాలు తీసుకొచ్చి, ఎక్కడో రాముడి గుడి కడతారని వందల కోట్లను వసూళ్లు చేస్తరా..?’’ అన్నట్టుగా వివాదం క్రియేటైంది… అలాంటి రాజు గారికి ఆఫ్టరాల్ బతుకమ్మలు ఓ లెక్కా..? ఐనా… కేసీయార్ అమితంగా ప్రేమించే ఇలాంటి ధర్మారెడ్డిలు… ధర్మాత్ములు… అనవసరంగా విలేఖరులు, ప్రజలే అపార్థం చేసుకుంటున్నారు… తెలంగాణ సమాజానికి వాళ్ల మాట తీరు, సంపాదన తీరుతో చేస్తున్న సేవ అపూర్వం… అలాంటి దేవుళ్ల మీద ఇలాంటి తప్పుడు వార్తలా..?! తప్పు… తప్పు…!! ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ వెంటనే చెంపలేసుకుని, ఫస్ట్ పేజీలో క్షమాపణ నోట్ రేపు పబ్లిష్ చేయాల్సిందే…!!
Share this Article