దిక్కుమాలిన ఫార్మాట్‌లో సినిమా రివ్యూలు ఎవడైనా రాస్తడు… అవీ తెలుగు సినిమాల్లాగే రొటీన్ రొడ్డకొట్టుడు భాష, శైలిలోనే ఉంటయ్… కానీ నిజమైన సినిమా సమీక్షలు సోషల్ మీడియాలో కనిపిస్తయ్… మెచ్చినా, నచ్చినా, వ్యతిరేకించినా గుండె లోతుల్లో నుంచి రాయబడతయ్… ప్రత్యేకించి ఏదైనా సినిమా బాగా నచ్చినప్పుడు కొందరు జర్నలిస్టు మిత్రులు వ్యక్తీకరించే అభిప్రాయాలు అసలైన సమీక్షలు… అవి కనెక్టవుతయ్… మనం వాళ్ల అభిప్రాయాలతో అంగీకరిస్తామా లేదా అనేది వేరే సంగతి… కానీ సినిమాల సమీక్షలు అంటే ఇవి కదా అని చప్పట్లు కొట్టాలనిపిస్తయ్… ఇప్పుడు కొత్తగా వచ్చిన కొండపొలం సినిమా మీద ఓ జర్నలిస్టు మిత్రుడి రివ్యూ ఇది… కాదు, మనోగతం ఇది… కనెక్టయిపోయి పలవరించాడు… బాగుంది… సినిమా రివ్యూలు కూడా ఇలాంటి కొత్త బాట పడితే ఎంత బాగుండు..?
Daayi Sreeshailam…….. కొండపొలం.. గుండెబలం! క్రిష్ గ్రేట్…. చాలా ధైర్యం చేసిండు….. సినిమా చూస్తున్నంతసేపూ నిజంగా మందల్ల మ్యాకలెంబడి.. గొర్లెంబడి తిరిగినట్టనిపించింది. తెలుగు సినీ చరిత్రలోనే ఇప్పటివరకు టర్ర్‌రే.. గెగ్గె.. చ్యూ.. దొయ్ అనే పదాలు వినలేదు. కొండపొలం సినిమా మొత్తం ఇవే పదాలు.. పలకరింపులు వినిపిస్తాయి. కనిపిస్తాయి. భుజాన గొంగడి.. చేతిలో దుడ్డుగర్ర.. నెత్తికి రుమాలు.. కాళ్లకు తోలుచెప్పులు.. గోశి అన్నీ మస్తు కుదిరినయి. సినిమాలో చెప్పినట్లు నిజంగానే గొర్లకాపరులు ఏనెల పొంటి.. దోనెల పొంటి రోజుల తరబడి ఉంటరు. బత్తెం దీస్కొచ్చే నాటికి తినడానికింత రొట్టెనో.. అన్నమో దొర్కుతుందని కాకుండా సూడటానికి తనవాళ్లు వస్తున్నారనే సంతోషం మాటల్లో చెప్పలేనంతగా ఉంటది. రవిప్రకాశ్ క్యారెక్టరే దీనికి నిదర్శనం.
Ads
తన భార్య సుభద్ర బత్తెం తీస్కొని.. కొడుకును తోల్కొని వస్తుందేమో అని మొదటి బత్తానికే గంపడాశ పెట్టుకుంటడు. భార్యకు ఇష్టమైన అంగీ వేసుకొని ఆశగా వస్తడు. అందరూ కనిపిస్తరు గానీ తన భార్య సుభద్ర కనిపించదు. నిరాశతో.. రెండో బత్యానికైనా వస్తదిలే అని కొండపొలానికి వెళ్తడు. రెండో బత్యం యాల్లయింది. అదే ఆశ.. అదే ఉత్సాహం. మళ్లీ నిరాశే. సుభద్ర రాలేదు. చాలా బాధపడతడు. ఎండనక.. వాననక.. తిండనక.. తిప్పలనక.. చెట్టూ పుట్ట ఎంబడి తిరుగుతూ.. జీవనాధారమైన గొర్లను మేపులకు కొట్టుకపోతే.. తనను చూడనీకె.. తనకు బత్యం తీస్కరానీకె భార్య రాకపోవడుతోటి లోలోపల ఏడుస్తడు.
Share this Article