……. రివ్యూయర్ :: Prasen Bellamkonda……….. పొరుగువానికి సాయపడుమోయ్…. కావాలోయ్ ఆకలి శోకం లేని లోకం… ఉండునోయ్ ప్రతి మనసులోనూ మంచితనమ్ము దాంకుని …. లాంటి కొన్ని ప్రవచనాలు కమ్ హితోక్తులను ఇస్టోరీ చేసుకుని సినిమా తీయడం పెద్ద కష్టమేం కాదు… అలాని అంత వీజీ కూడా కాదు. చాలా హోమ్ వర్క్ చెయ్యాలి. కొంచెం స్పయిసింగ్ కొంచెం గార్నిషింగ్ కొంచెం అబ్రకదబ్రీంగ్ కూడా చెయ్యాలి. సోని లైవ్ లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇట్లు అమ్మ’ దర్శకుడు ఉమా మహేశ్వర్రావ్ హితోక్తులనయితే ప్రవచించాడు కానీ మిగతా అన్నీ తెలుసుకోలేకపోయాడు.
ఈయనే 1993లో తీసిన అంకురం చూసి ఊగిపోయాం. హెబియస్ కార్పస్ అనే పాయింట్ తో అంత గొప్పగా సినిమా తీయొచ్చని అప్పటికి తెలియదు. అందుకే సి.ఉమామహేశ్వరరావును నెత్తిన కూచోబెట్టుకున్నాం. 1996 లో అతనే డైరెక్ట్ చేసిన మౌనం చూసి అదే ఉమామహేశ్వరరావును ధడేల్ మని నేలకేసి కూడా కొట్టామనుకోండి. ఆ తరవాత సూర్యపుత్రులు అనే ఓ చెత్త, శ్రీకారం అనే ఓ మామ్మూలు సినిమాలు కూడా తీసి అంకురమ్ కీర్తిని తనకు తానే చెరిపేసుకున్నాడు. ఇప్పుడదే దర్షకుడు 1993 నుంచి ఇవతలకు రావాల్సిందిపోయి వెనక్కు 1960ల్లోకి నడిచి వీధినాటకానికి ఎక్కువ కాని, పరిషత్ నాటకానికి తక్కువ కాని మై ఎక్స్పరిమెంట్ విత్ ట్రూత్ అనే సత్యశోధనా తాత్విక చిత్రరాజాన్ని ఓటిటికొదిలాడు.
ఆలోచన బానే ఉంది. సినిమాగా మారేప్పటికి గందరగోళం అయి కూచుంది. తన కొడుకును హత్య చేసిన వ్యక్తి స్వయంగా తానే తెర తీసుకుని వచ్చి ఎందుకు హత్య చేసాడో చెప్పేట్టు చేసేందుకు ఉత్తరాలు అనే ఆయుధాన్ని తల్లి వాడడం తర్కానికి అందనిది. అంకురంలో ఓంపురి దగ్గరకు అతని కొడుకును చేర్చేందుకు సర్వ ప్రపంచంతో ఘర్షణ పడ్డ రేవతి ఆవేశం, ఆగ్రహం, ఆవేదనను ప్రేక్షకుడు కూడా పంచుకుంటాడు. ఇక్కడ అమ్మ రేవతి సత్య శోధనతో ప్రేక్షకుడు ఏమాత్రం మమేకం కాడు. అదే అసలు సమస్య. అంకురంలో పోలీస్లకు కంప్లైంట్ చేద్దామా అని ఎవరో అమాయకంగా అడిగినప్పుడు మిగతా పాత్రలన్నీ నవ్విన నవ్వు గొప్ప ఎటకారం. అదే అంకురంలో నిండు గర్భిణీతో తొమ్మిది గుంజీలు తీయించిన పోలీస్ కాఠిన్యం గుండెలు పిండే విషాదం. అటువంటివిక్కడ మచ్చుకైనా కానరావే.
Ads
దర్శకుడు తన యవ్వన కాలం నాటి వామపక్ష చాపల్యాన్ని, కాలంతో వచ్చిన మార్పును అవగాహన చేసుకోకుండా ఇప్పటి తెరమీద ఎర్రగా పులమాలని చూడడం కూడా అటు కాలాన్నీ ఇటు వెలిసిపోయిన అరుణ వర్ణాన్నీ అర్ధం చేసుకోలేక పోవడమే. నిజం చెప్పాలంటే దర్శకుడు 1993 లో కూచుని వెనక్కు నడుస్తూ 2021 కోసం సినిమా తీసాడు. ఇట్లు అమ్మ గురించి కంటే అంకురమ్ గురించి ఎక్కువ మాట్లాడాల్సి రావడం ఒక గొప్ప సినిమాను సృష్టించిన దర్శకుడు ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు అని అడిగించుకున్నాడే అన్న బాధవల్లే… ప్రతి ఆదర్శాన్నీ సినిమాగా మలచడం కష్టం. విఫలమైనా సరే ఆ కష్టాన్ని పడేందుకు చేసే ప్రయత్నాన్ని మాత్రం అస్సలు తప్పు పట్టకూడదు. ఉమామహేశ్వరరావ్ ఆదర్శాన్ని అర్ధం చేసుకోవాలనుకుంటే ‘ఇట్లు అమ్మ’ చూడొచ్చేమో…!!
Share this Article