కొన్ని పైపైన చూస్తే అంతే… కాజువల్‌గా, రొటీన్‌గా, ఆ ఏముందిలే ఇందులో అన్నట్టు కనిపిస్తయ్…. కానీ కాస్త తడి ఉన్న రిపోర్టర్‌కు అందులో ఆర్ద్రత అర్థమవుతుంది… న్యూస్ పాయింట్ తళుక్కుమని మెరుస్తుంది… చేతిలో స్మార్ట్ ఫోన్ వేగంగా, సైలెంటుగా క్లిక్కుమంటుంది… ఆ సీన్ రికార్డ్ అయిపోతుంది… ఫీల్డ్‌లో తిరిగే రిపోర్టర్లకు ఈ స్పాంటేనిటీ అవసరం… ఐనా ఇప్పుడు రిపోర్టర్లు అంటే వేరు కదా, ఆ సంగతి వదిలేద్దాం… ఈ ఫోటో వార్త సంగతేమిటంటే..? కామారెడ్డి జిల్లాలో ఓచోట… పోచమ్మ, గంగారాం దంపతులు బతుకమ్మ పండుగ కోసం బిడ్డ ఇంటికి వచ్చారు… కాలిగోళ్లు తీసుకోవడానికి భార్య అవస్థ పడుతుంటే.., గంగారాం ఆమె కాలును జాగ్రత్తగా పొదివి పట్టుకుని, తనే గోళ్లు తీస్తున్నాడు… ఓ వయస్సొచ్చాక అంతేగా… పెళ్లానికి పెనిమిటి… మగడికి పెళ్లాం… ఏ పనైనా సరే, వాళ్లకువాళ్లే ఒకరికొకరు… నిజానికి భార్యాభర్తల నడుమ నిజమైన సాన్నిహిత్యం వృద్ధాప్యంలోనే ఎక్కువ పెరుగుతుందేమో…
సరే, ఫోటో బాగుంది, వార్త బాగుంది… కానీ వార్తల జడ్జిమెంట్‌లో, ప్రయారిటీలో సాక్షి ఎప్పుడూ పూరే… అంతేకాదు, ఇలాంటివి డెస్కుకు వచ్చినప్పుడు హత్తుకుని, మరింత చెక్కి, మరింత బాగా ప్రజెంట్ చేయవచ్చు… ఇక్కడా అంతే… దీన్ని మరింత బాగా ప్రజెంట్ చేయొచ్చు… ఈ ఫోటోలోని టచింగ్ యాంగిల్ గుర్తించలేదు, జిల్లా పేజీలో ఓ సింగిల్ కాలమ్ వేశారు… నిజానికి ఈ రాజకీయ నాయకుల చెత్తా వార్తలకు బదులు ఇవి కదా ఫస్ట్ పేజీల్లోకి రావల్సిన వార్తాంశాలు… కదిలించే కథలే కదా ఏ పత్రికకైనా ప్రాణాలు… ఆ సోయిని నింపడంలో ఇప్పటి తెలుగు మీడియా పెద్దలు ఫ్లాప్… అప్పుడప్పుడూ ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో ఇలాంటి ఫోటోలు కనిపిస్తుంటయ్… పర్లేదు, సాక్షిలో కూడా పాత్రికేయం ఉందని అప్పుడప్పుడూ ఇలాంటి ఫోటోవార్తలు గుర్తుచేస్తయ్… అది పేజీల్లో సరైన ప్లేస్మెంటుతో మెరియకపోయినా సరే… ఈ ఫోటో తీసి, అందులోని అసలైన న్యూస్ పట్టుకున్న సాక్షి భిక్కనూరు విలేఖరికి ‘ముచ్చట’ అభినందనలు… జీవితం మీద పాజిటివిటీని పెంచే వార్తలే ఇప్పుడు సొసైటీకి అవసరం… టీవీ బుర్రలు ఎలాగూ కుళ్లిపోయాయ్, కనీసం పత్రికలైనా హ్యూమన్ ఇంట్రస్టింగ్ అంశాల మీద దృష్టి పెడితే మేలు కదా…!!
Ads
Share this Article