Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇలాగే ఊడ్వడం ప్రాక్టీస్ చేయి తల్లీ… ప్రధాని పదవికి తోవ చూపించవచ్చునేమో…

October 10, 2021 by M S R

Nancharaiah Merugumala………..   గుడి వాకిలి ఊడిస్తే అధికారం రాదు చెల్లీ,‘ సత్తా’ చేతికొచ్చాకే దేశాన్ని ఊడ్చుకోవాలి..! ===================================================  ఒకప్పటి ‘ప్రిన్సెస్‌’ ప్రియాంకా గాంధీ వాడ్రా శుక్రవారం ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నఊలో వాల్మీకులు నివసించే లవకుశ నగర్‌ వాల్మికి ఆలయం వాకిలిని తెల్లటి పూచికపుల్లల చీపురుతో ఊడ్చారు. ఉత్తరాదిన వాల్మీకులు అంటే పారిశుద్ధ్యం పనిచేసే కులస్తులు. ప్రతి వాల్మికినగర్‌ లోనూ ఈ కులం వాళ్లే నివసిస్తారు. వారి కులం (వాల్మీకి) అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలోనే ఉంది. వారి కులదైవం రామాయణం రాసిన వాల్మికి మహర్షి. వాల్మికి ప్రశాంతంగా కూర్చుని రామాయణం రాసిన సొంతూరు లాహోర్‌ ‘దురదృష్టవశాత్తూ’ పాకిస్తాన్‌ లోకి వెళ్లిపోయింది. పాక్‌ పంజాబ్‌ రాజధాని లాహోర్‌ లో రావీ నదీ తీరంలో వాల్మికి రామాయణం రాశాడనేది ఎప్పటి నుంచో ఉన్న అక్కడి ప్రజల నమ్మకం. అందుకే అక్కడ వాల్మికి స్మారకార్ధం గుడి కట్టారు. ఇప్పటికీ అది సురక్షితంగా ఉంది. ఈ ఆలయంలోని వాల్మికి విగ్రహం రోజూ పూజలందుకుంటోంది. ఆయనను పూజించేది ఎక్కువగా ఎవరంటే– మన యూపీ, పంజాబ్, హరియాణాలో ఉన్న వాల్మీకుల కులంవారైన అక్కడి హిందూ పంజాబీలు. హిందువులుగా ఉంటే భద్రత, ప్రాణాలుండవనే భయంతో వారిలో ఎక్కువ మంది కైస్తవం పుచ్చుకున్నారు. ప్రాణ రక్షణ కోసం ‘ప్రభువు’ నీడన చేరారే కాని దాదాపు వారంతా ఆచరణలో హిందువులే. తమ కులదైవం వాల్మికి గుడికి క్రమం తప్పకుండా పోతుంటారు. రామాయణం రాసిన తమ తోటి కులస్తుడిని నిత్యం ఆరాధిస్తూ తరిస్తుంటారు. పాకిస్తాన్‌లో కూడా వారు ఎస్సీ తరహా హోదాలో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు అనుసూచిత కులాలవారు, కొన్ని ఆదివాసీ కులాలవారు, అనేక కులాల బీసీలు రికార్డుల్లో హిందువులుగా, ఆదివారం ‘ఆచరణాత్మక క్రైస్తవులు’గా ఉన్నట్టే పాకిస్తాన్‌లోని వాల్మీకులు భద్రత కోసం క్రైస్తవం ముసుగులోని హిందువులుగా బతుకుతున్నారు. అంతేగాని కోటా ప్రయోజనాల సమస్య వారికి లేదు. అంటే ఇండియా, పాకిస్తాన్‌ ప్రజల అలవాట్లు, తెలివితేటలు, బతికే తీరులో పెద్దగా తేడాలు లేవు. ఇస్లాం, హిందూ అనే ఆకుపచ్చ, కాషాయ రంగు గొడుగుల కింద ఉన్నా హిందూస్తానీ, పాకిస్తానీ భాయూ–భాయీ చాలా విషయాల్లో…

ఇంకో ముఖ్య విషయం ఏమంటే, క్షత్రియ రాజకుటుంబంలో పుట్టిన రాముడి జన్మభూమిని వందలాది సంవత్సరాల పోరాటం, విధ్వంసకాండతో విముక్తి చేసిన హిందుత్వ శక్తులు, విశాల హృదయాలున్న హిందువులు కూడా ఇప్పటి దళిత కులంగా పరిగణించే వాల్మిక కుటుంబంలో పుట్టిన రామాయణ సృష్టికర్తను విస్మరించడం గర్హనీయం. ఆయన జన్మస్థలాన్ని, పవిత్ర రావీ తీరంలోని ఆయన ఆలయాన్ని, ఇద్దరు బిడ్డలను చంకనేసుకుని సీతాదేవి నడయాడిన పశ్చిమ పంజాబ్‌లోని ఇతర ప్రాంతాలనైనా పాకిస్తాన్‌ నుంచి విముక్తి చేయడానికి ఎవరూ  ధైర్యం చేయకపోవడాన్ని’ ఏమనాలి? కనీసం లాహోర్‌లోని వాల్మికి ఆలయాన్ని సందర్శించే ఆసక్తి ఉన్నవారికి బస్సు ప్రయాణం ఏర్పాట్ల గురించి కూడా ఎవరూ మాట్లాడరు. ఆయోధ్యలో రాముడికి భవ్య మందిరం నిర్మిస్తున్నారు హిందువులు. మరి, కౌసల్యా దశరథ పుత్రుడి పేరుకు శాశ్వతత్వం కల్పించిన వాల్మికి ఊరు లాహోర్‌ ను రెండు భారత–పాకిస్తాన్‌ యుద్ధాల సమయంలో ‘విముక్తి చేసే’ అవకాశం వచ్చినా ‘భారత హిందూ పాలకులు’ ఆ పనిచేయలేదు. ఇంతకూ ప్రియాంకకు సంబంధించిన అసలు విషయం ఆరంభంలో ఒక వాక్యంగా మాత్రమే రాసి, దాన్ని సాగదీయడం మరిచిపోయా…

priyanka vadra

Ads

ప్రియాంకా చీపురు పడితే… ఏమవుతుంది?
––––––––––––––––––––––––
యూపీలోని లఖీంపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనల పుణ్యమా అని నెహ్రూ–గాంధీ వంశంలో మిగిలి ఉన్న ఆడపిల్ల పియాంకకు వార్తలకెక్కే సదవకాశం ఇన్నాళ్లకు వచ్చింది. బ్లడ్డూ–బ్రీడూ విలువ తెలిసిన ఉత్తరాఖండీ రాజ్‌‌పూత్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌– ఆమెను ఎయిర్‌ కండిషనర్లు, ఇతర లగ్జరీ హోటల్‌ సౌకర్యాలున్న ఉత్తుత్తి జైలుకు పంపారు. తాత్కాలిక జైలు హోదా పొందిన సీతాపూర్‌ పోలీసు గెస్ట్‌ హౌస్‌ గది చాలా శుభ్రంగా ఉన్నాగాని, ‘వైరల్‌’ వార్తల్లో కనిపించడానికి ‘ఆమె రంగు’లోనే ఉన్న చక్కటి పూచికపుల్లల చీపురుతో గదిని అడ్డంగా ఊడ్చుతూ వీడియో చిత్రీకరించే అవకాశం కల్పించారు ప్రియాంక. నాయనమ్మ బాటలో ప్రధానమంత్రి కురిసీలో కూర్చోవాల్సిన ప్రియాంక జైలులో చీపురట్టుకోవడం లక్షలాది కాంగ్రెసోళ్లకు కంటతడి పెట్టించింది. పోలీసుల అతిధిగృహం గదిని ఊడ్చితేనే కాంగ్రెస్‌ కార్యకర్తలకు బాధనిపించింది. అసలు సిసలు జైలులో ఆమె చీపురుతో ఊడ్చితే వారు తట్టుకోలేకపోయేవారు. అయితే, నిజం జైలులో ఫోటోలు, వీడియా తీయడానికి వీలయ్యేది కాదు. చేతిలో చీపురున్న ప్రియాంక చిత్రం మనకు కనిపించేది కాదు. ఏదేమైనా తోటి జాతీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్‌ అంటే బీజేపీవాళ్లకు నిండా గౌరవం ఉందని యోగీ నిరూపించాడు. ఆరు నెలల్లో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ‘గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ’కి కనీసం 15 శాతం ఓట్లు వస్తే స్థానిక పెద్ద పార్టీలు ఎస్పీ, బీఎస్సీలకు గెలిచే వీలులేకుండా పోతుంది. హైదరాబాద్‌ ‘పెద్ద షేర్వానీ పార్టీ’కి కూడా వంద సీట్లలో పదో పరకో శాతం ఓట్లు పడితే, ఉర్దూ మాట్లాడే యూపీ ముస్లింల ఓట్లు మూడు పార్టీల (కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ) మధ్య చీలి బీజేపీ గెలుపు ఖాయమౌతుంది. అందుకే ప్రియాంకకు చిన్నన్నలా సాయపడుతున్నాడు ఆదిత్యనాథుడు.
ఇంకా ఊడ్వడానికి ఏముంది?
––––––––––––––––––
ముత్తాత జవాహర్‌ లాల్‌ నెహ్రూ హయాంలో దాదాపు 17 సంవత్సరాలు, నాయనమ్మ ఇందిరాగాంధీ పాలనలో దాదాపు 16 ఏళ్లు, తండ్రి రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో ఐదేళ్లు, తమ కుటుంబానికి తెలుగు సేవకుడు పాములపర్తి వేంకట నరసింహారావు గారి జమానా ఐదేళ్లలో కాంగ్రెస్‌ వారు చీపుళ్లు పట్టకుండానే భారతదేశాన్ని చాలా వరకూ ఊడ్చేశారు. బీజేపీ వారూ తమ మొదటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి గారి ఆరేళ్ల పైచిలుకు పాలనలో వణికే చేతులతో చీపురాడించడం ఓ మోస్తరుగా నేర్చుకున్నారు. గత ఏడేళ్లకు పైగా సాగుతున్న గుజరాతీ ప్రధాని పాలనలో కాషాయపక్షం పెద్దలు కూడా దేశాన్ని చక్కగానే ఊడ్చుతున్నారు. అటల్జీ హయాంలో బాగా నడుము వంచిన అనుభవం లేని బీజేపీ కార్యకర్తలతో– అలికిడి చేయకుండా దేశాన్ని ఊడ్చడానికి స్వచ్ఛ భారత్‌ పేరుతో శిక్షణ ఇప్పించిన సమర్ధ ప్రధాని నరేంద్రభాయ్‌. ఆయన 2024 లోక్‌ సభ ఎన్నికల్లో కూడా గెలిచి ప్రధాని అయితే, భారతదేశం హిందూదేశంగా అయితే ఖచ్చితంగా మారదు గాని, మంచిగా ‘సాఫ్‌’ మాత్రం అవుతుంది. రాహుల్‌ కు ఊడ్చే ఓపిక, ఆసక్తి లేదు. ఇంకా పెళ్లికాని ఈ తెల్ల గెడ్డం యువకుడికి నడుం కూడా సరిగ్గా వంగదు. అందుకే ఆయన కొన్నేళ్ల క్రితం లోక్‌ సభలో కూర్చుని ఉన్న ప్రధాని మోదీని కొద్దిగా మాత్రమే వంగి కావిలించుకున్నారు. ఈలోగా ప్రియాంక శ్వేత వర్ణ చీపుళ్లు పట్టి ఊడ్చడం బాగా నేర్చుకుంటే, ఆమెకు ఈ దశాబ్దం ఆఖరుకైనా– అదే, 2029 మే నెల నాటికైనా ప్రధాని అయ్యే అవకాశం రావచ్చు. అప్పుడు ఆమె దేశం మొత్తాన్ని భర్త రాబర్ట్‌ వాడ్రా సాయంతో ఊడ్చగా దొరికే ‘చెత్తను సముద్రాల అవతలి ద్వీపాల్లో పారేసి రావడానికి అవకాశాలు, టాటాల విమానాలు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి…… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions