గుడ్… తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో నిర్ణయం కూడా అభినందనీయం… తన కాన్వాయ్ హడావుడి ప్రజలకు ఇబ్బందికరంగా మారకూడదనే భావనతో 12 వాహనాలను కుదించి ఆరుకు తగ్గించేశాడు… కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపకూడదనీ ఆదేశించాడు… ఎందుకు ప్రశంసించాలీ అంటే.., చాలామంది నాయకులకు ఓ పోస్టుకు పోయాక గన్మెన్, రక్షణ, కాన్వాయ్ హంగామా, ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్, మర్యాదలు, నమస్కారాలు ఫుల్ తృప్తిని ఇస్తాయి… అసలు నాయకుల్ని పదవుల కోసం వెంపర్లాడేలా చేసే అంశాల్లో ఇవీ ముఖ్యమే… ఒక దశలో వాళ్లను డబ్బు, పరపతి, స్టేటస్, విలాసాలకన్నా ఇవే ముఖ్యమైపోతాయి… అవే జనానికి ఇబ్బందికరంగా మారతాయి… హైదరాబాదే తీసుకొండి, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, యాక్టింగ్ ముఖ్యమంత్రి, గవర్నర్లే కాదు… సిటీలో తిరిగే ముఖ్యమైన మంత్రుల కోసం కూడా ఎలాపడితే అలా ట్రాఫిక్ ఆపేస్తుండటం చూస్తున్నదే… ఐనా జనం అవస్థలు ఎవరికి పట్టాయిలే… మరి స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా మెచ్చాల్సిందే… వీఐపీ మూవ్మెంట్ కోసం ట్రాఫిక్ ఆపడం వల్ల ఎండల్లో, వానల్లో జనం పడే బాధలు అనుభవించేవాడికే అర్థమవుతాయి…
(సింబాలిక్ ఫోటో)….. స్టాలిన్ నిర్ణయం తీసుకోవడానికి ఓ నేపథ్యం ఉంది… ఈమధ్య ఓ ప్రోగ్రాం వెళ్తున్నప్పుడు ఎప్పటిలాగే ట్రాఫిక్ ఆపేశారు… ఆ రూటులో వెళ్తున్న ఓ హైకోర్టు జడ్జి కూడా అనివార్యంగా ఆగిపోవాల్సి వచ్చింది, కోర్టుకు లేటుగా పోవాల్సి వచ్చింది, దాంతో తనను సకాలంలో డ్యూటీకి వెళ్లకుండా నిలిపివేయడం హైకోర్టు హక్కుల ఉల్లంఘన అవుతుందని హోంశాఖ మీద మండిపడ్డాడు… హోం ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది… సీఎం, మంత్రులు తమ డ్యూటీల మీద వెళ్తున్నప్పుడు ఇలాగే ఆపుతారా..? మరి వాళ్లకు దక్కే మర్యాదలు న్యాయమూర్తులకు ఎందుకు దక్కకూడదు అనేది ఆ జడ్జి ప్రశ్న… అయితే ఇక్కడ మనకు కొన్ని అసంతృప్తిని రేపే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి..? మొత్తం జనం కోణంలో జడ్జి గనుక ఆలోచించి ఇలా మండిపడి ఉంటే అది వేరు, ఇక్కడ తన ఇబ్బందిని, తమకు దక్కాల్సిన గౌరవమర్యాదల్నే ఆయన పరిగణనలోకి తీసుకున్నాడు… ఇప్పుడు నొప్పి సెగ తగిలింది కాబట్టి సమస్య తీవ్రత అర్థమైంది… లేకపోతే..? ఒకవేళ హోం కార్యదర్శి గనుక సీఎం రక్షణ కోణంలో ట్రాఫిక్ ఆంక్షలు తప్పనిసరి అనే వాదనతో మొరాయించి ఉంటే..? పోనీ, ఒకవేళ ఏ ప్రకృతి విపత్తు కారణంగానో ఆయన కోర్టు డ్యూటీకి లేటుగా వెళ్లడం అనివార్యమై ఉంటే..? సో, ఇది పెద్ద సబ్జెక్టు… కానీ మంత్రులు, కీలక హోదాల్లో ఉండే అధికారులు, వ్యక్తులు ఎవరైనా సరే… అన్నిరకాల ప్రభుత్వ సౌకర్యాల నుంచి మినహాయించబడి, మామూలు ప్రజల్లాగే తిరగాల్సి వస్తే, బతకాల్సి వస్తే అప్పుడు నిజంగానే పాలసీలు ప్రజల కోణంలో ఉంటయ్… ఈ దేశం కథ వేరే ఉంటుంది…
Ads
ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి మరో తీర్పు గురించి చెప్పుకోవాలి… అదీ మద్రాస్ హైకోర్టు ఇచ్చిందే ఈమధ్య… నిజానికి మంచి నిర్ణయం… దేశమంతా అమలు చేయాల్సిన తీర్పు… మోడీ, అమిత్ షాలకు అంత తీరిక లేదు గానీ దీనిపై ఓ మంచి పాలసీ రూపొందించవచ్చు… రోడ్లు, బహిరంగప్రదేశాల్లో ఎడాపెడా పెట్టేసిన విగ్రహాలను తీసేయాలని కోర్టు మొన్నీమధ్య ఆదేశించింది… వాళ్లపై అంత ప్రేమ ఉంటే వాటికోసం ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేసి, సందర్భన కోసం అక్కడ నిలబెట్టండి, అంతే తప్ప రద్దీ ప్రదేశాల్లో, బహిరంగ స్థలాల్లో ఈ విగ్రహాల కోసం పోటీలు దేనికి అనేది కోర్టు ప్రశ్న… నిజమే.., కులం, ప్రాంతం, వర్గం, మతం, పార్టీ… ఇలా ఎన్నో కారణాలతో విగ్రహాలను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తున్నారు… వాటికోసం తగాదాలు, వివాదాలు, దాడులు, ఉద్రిక్తతలు, విద్వేషాలు కూడా రగులుకుంటున్నయ్… ఇక్కడ కూడా రాజకీయ నాయకులే ప్రధాన దోషులు… అబ్బ, విగ్రహాలు లేని వీథులు కనిపించడం అంటే… ఓ కల… సో, ఈ మద్రాస్ హైకోర్టు తీర్పు మెచ్చదగిందే…!!
Share this Article