నిజంగా మా ఎన్నికల్లో లోకల్, నాన్-లోకల్ ఫీలింగ్ పనిచేసిందా..? ప్రకాష్ రాజ్ లోకల్ కాదు కాబట్టే ఓడిపోయాడా..? ఇక్కడే ఓ ఊరిని దత్తత తీసుకుని, ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే నటుడిని నాన్-లోకల్ అనొచ్చా..? కేవలం పుట్టుక మూలాలు మాత్రమే చూడాలా..? ఐతే మరికొన్ని రిజల్ట్స్ భిన్నంగా ఎందుకొచ్చాయి..? ప్రకాశ్ రాజ్ గెలవకపోయినా, కర్ణాటకలో పుట్టిపెరిగిన శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు! మనోళ్లకేమీ అంత లోకల్ ఫీలింగ్ లేనట్టేగా..? అన్నట్టు… మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ ఎందుకు రాజీనామా చేసినట్టు..? గెలిస్తే ‘మా’ సంఘం… ఓడిపోతే పరాయి సంఘం అయిపోతుందా..? తెలుగు ఇండస్ట్రీ ఇక అక్కర్లేదా..?! ‘మా’ ఎన్నికల్లో గెలిస్తే తెలుగువాడివి అయిపోయేవాడివా..? ఓడిస్తే నువ్వు తెలుగువాడివి కాదుపో అని తేల్చి చెప్పినట్టా..? అసలు నాన్ లోకల్ ఫీలింగ్ నిజంగా పనిచేసిందా..? ఓటమి మీద ఇదేం విశ్లేషణ, ఇదేం అంచనా..? ఇదేం నిర్ణయం..? సీనియర్ జర్నలిస్టు Nancharaiah Merugumala…. విశ్లేషణ ఈ కోణంలో సాగింది… ఆ పోస్టు ఇదుగో…
కుటుంబ మూలాలు కృష్ణా జిల్లాలో ఉన్నా, కర్ణాటక కొప్పళ జిల్లా గంగావతిలో పుట్టిపెరిగిన పూర్వ హీరో మేకా శ్రీకాంత్, తెలంగాణకు పక్కా లోకల్ అయిన సీనియర్ నటుడు పల్లి బాబూ మోహన్‌ను ఓడించాడు. అధ్యక్ష కార్యదర్శల తర్వాత ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసిన ‘నాన్ లోకల్’ తెలుగు నటుడు శ్రీకాంత్ 106 ఓట్ల మెజారిటీతో దళిత మూలాలున్న బాబూ మోహన్‌ను ఓడించడం తెలుగువాళ్లకు ‘లోకల్ ఫీలింగ్’ లేదని, ‘కుల చైతన్యం’ కూడా ‘చాలా తక్కువని’ చెబుతోంది. అధ్యక్ష పదవికి పోటీచేసిన చిత్తూరు జిల్లా మాజీ డ్రిల్లు మాస్టారి కొడుకు మంచు విష్ణు, బెంగళూరులో పుట్టి పెరిగిన ప్రకాశ్ రాజ్‌ను ఓడించింది కూడా 107 ఓట్ల తేడాతోనే. తమిళనాడుకు చెందిన శివబాలాజి– కోశాధికారి పదవిని ఏలూరు సమీపంలోని ఎల్వీ ప్రసాద్ గారి ఊళ్లో పుట్టి పెరిగిన, ఇంకా పూర్తిగా మనోడని చెప్పుకోగలిగిన వెల్లంకి నాగినీడును ఓడించి, సాధించడం కూడా సినిమా రంగంలో లోకల్, కాస్ట్ ఫీలింగులు ‘బాగా విస్మరించదగ్గ’ స్థాయిలో ఉన్నాయని నిరూపిస్తోంది.
Ads
Share this Article