దెయ్యాలు వేదాలు వల్లించినట్టు… పిశాచాలు సంకీర్తనలు ఆలపిస్తున్నట్టు… అమావాస్య అర్ధరాత్రి ఆ భూత్ బంగళా నుంచి అకాలరోదనలేవో వినిపిస్తున్నట్టు…… వ్యవసాయానికి కరెంటు మీటర్ల మీద చంద్రబాబు వాదన చదువుతుంటే ఇలాగే రకరకాల ఫీలింగ్స్…! ఒపీనియన్స్ ఛేంజ్ చేసుకోకపోతే పొలిటిషియన్ ఎలా అవుతాడని అంటాడు కదా కన్యాశుల్కం గిరీశం… చంద్రబాబు గిరీశానికి ముత్తాత టైపు… నిజానికి ఏదేని అంశం మీద రాజకీయ పార్టీకి ఓ స్థిర విధానం అవసరం లేదా..? ఒక నాయకుడు తను చేసినదాన్నే తను తప్పుపట్టి ఖండించాలా..? అసలు కరెంటు అనే అంశం మీద చంద్రబాబుకు ఎవరినీ విమర్శించే నైతికత లేదు, ఉండదు, గతకాలంలో తన ఆచరణ తీవ్రత అది…
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే అవి ఉరితాళ్లు అని చంద్రబాబు తాజాగా మొత్తుకుంటున్నాడు, రైతుల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు… జస్ట్, అలా ఓసారి గతంలోకి వెళ్తే…. ఇదే చంద్రబాబు తన హయాంలో… విద్యుత్తు సంస్కరణల్ని భుజాన మోశాడు… ఈ విషయంలో చంద్రబాబును మించిన తోపు లేడని ప్రపంచబ్యాంకు కూడా కితాబునిచ్చింది… అప్పటి విద్యుత్తు సంస్కరణల చట్టాన్ని అత్యధికంగా ప్రమోట్ చేసింది చంద్రబాబే… కరెంటు వ్యవస్థను ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలుగా చీల్చింది తనే… సబ్స్టేషన్ వారీగా ప్రైవేటీకరణకు ప్లాన్లు రచించిందీ ఆయనే… ఛార్జీలు ఎడాపెడా పెంచేసి, ఆందోళనకు దిగిన వాళ్లపై కాల్పులు జరిపిందీ ఆయనే… వేలాది మంది రైతుల మీద కరెంటు దొంగలుగా ముద్రవేసి, కేసులు పెట్టి, సంకెళ్లు వేసి, జైళ్లలో పారేసింది తనే… కరెంటు బకాయిల పేరిట కనెక్షన్లను కత్తిరించేసి వాళ్ల ఉసురు పోసుకున్నదీ ఆయనే… ఆయన భుజాన మోసిన ఆ విద్యుత్తు విధానంలో ఉన్నదే పంపుసెట్లకు మీటర్లు అనేది… అప్పట్లో వ్యవసాయ కరెంటును ఏడు గంటలకు కుదించేసి.., రైతులెవరూ ఎక్కువ కరెంటు వాడకుండా, నిర్ణీత గడువు కాగానే కరెంటు ఆగిపోయేలా సబ్స్టేషన్లలో ప్రత్యేకంగా పరికరాలు బిగించిందీ తనే… చెబుతూ పోతే చంద్రబాబు కరెంటు కథలు పీపీఏల దారుణాలు, ప్రైవేటు కరెంటు కొనుగోలు అక్రమాల దగ్గర్నుంచి కోకొల్లలు…
Ads
ఇప్పుడు ఈ సారు గారు కారుస్తున్న మొసలి కన్నీరు చూస్తుంటే జాలితో కూడిన నవ్వొస్తోంది… అలాగని జగన్ విద్యుత్తు విధానాలు బాగున్నాయని కాదు… కానీ ఓ ప్రతిపక్ష నేతగా పిన్పాయింటుగా జగన్ సర్కారు తప్పుడు విధానాల్ని ఎక్కడ విమర్శించాలో అక్కడ విమర్శించాలి… అంతేతప్ప, ఒకప్పుడు తనే ఎడాపెడా ఆచరణలోకి తీసుకొచ్చిన విధానాలను తనే తిట్టుకోవడం ఏమిటి..? రాజకీయంగా అంత దిగజారాల్సిన దుర్గతి ఏమిటి..? పంపుసెట్లకు మీటర్లు పెట్టగానే ఉచిత కరెంటు ఆపేస్తారా..? లేదు కదా..! కాకపోతే రైతులవారీగా కరెంటు వాడకాన్ని లెక్కేసి, ఆ డబ్బును రైతుల ఖాతాల్లోకి వేయాలనేది కేంద్ర ప్రభుత్వ కొత్త విధానం… అది అమలు చేయాలని రాష్ట్రాల మెడలపై కత్తులు పెడుతోంది మోడీ ప్రభుత్వం… చంద్రబాబు మోడీని పల్లెత్తుమాట అనడు, భయం… నిజానికి మోడీ ప్రతిపాదిత వ్యవసాయ కరెంటు విధానంలోనే ఆచరణాత్మక లోపాలు బోలెడు… వాటిని కూడా బాబు తప్పుపట్టడు, విశ్లేషించడు… రాజకీయంగా అవసరం కాబట్టి జగన్ను తిట్టిపోస్తే సరి… జగన్ను తిడితే తిట్టాడు, కానీ అందులో నాణ్యత, గతకాలపు తన ఆచరణ మీద సోయి కూడా అవసరమే కదా.,. అవన్నీ ఆలోచిస్తే చంద్రబాబు ఎందుకవుతాడు అంటారా..? అంతేలెండి…!!
Share this Article