నో డౌట్… ఒకప్పుడు తెలుగు నవలారంగంలో యండమూరి అనుభవించిన స్టార్ స్టేటస్‌ను ఇండియన్ ఇంగ్లిష్ నవలారంగంలో చేతన్ భగత్ అనుభవించాడు కొన్నాళ్లు… లక్షల పుస్తకాల విక్రయాలు, అనేక భాషల్లోకి అనువాదాలు… నవలారంగంలో ఇంత డబ్బుందా, ఇంత కీర్తి ఉందా అని అందరూ అసూయపడే స్థాయిలో ఎదిగాడు… అఫ్ కోర్స్, శివ ట్రయాలజీ రామాయణ సీరీస్‌తో అమిష్ ఎక్కడికో వెళ్లిపోయాడు… చేతన్ కూడా ఇప్పుడు తనను అందుకోలేడు… నెట్ జోరు పెరిగాక పుస్తకపఠనం తగ్గిపోయింది అనేది ఓ భ్రమ… చదివించే పుస్తకాల పబ్లిషింగ్ తగ్గింది, రాసేవాళ్లు తగ్గారు… కానీ చదివేవాడు ఎప్పుడూ ఉన్నాడు… అలాంటి చేతన్ భగత్‌కు ఈ గెలుపు తలకెక్కింది… రాతల మీద దృష్టి తగ్గింది, నీతులు చెప్పడం మీద ధ్యాస పెరిగింది… దాంతో ఆరేడేళ్లుగా దారితప్పాడు… ఇప్పుడు తాజాగా విడుదలైన తన పుస్తకం ‘400 Days’ కూడా అదే చెబుతోంది…
నో డౌట్… ఈ పుస్తకం కూడా లక్షల కాపీలు అమ్ముడుబోతుంది… చేతన్‌కు బొచ్చెడు డబ్బును తెచ్చిపెడుతుంది… నో డౌట్… తను పాపులర్ రైటర్… అత్యంత సులభమైన ఇంగ్లిషు, సరళమైన కథనం, వర్తమాన సమాజం తన రచనకు బలాలు… కానీ ఒకప్పటి చేతన్‌తో పోలిస్తే ఇప్పటి చేతన్ ‘బిగువు, పొంకం తగ్గిన ఆటగత్తె’… 2004లోFive Point Someone రాసినప్పుడు చేతన్ వేరు… తరువాత One Night @ the Call Center, The 3 Mistakes of My Life, 2 States, Revolution 2020… వరకూ వోకే… భిన్నమైన రచన వస్తువులు… తరువాత Half Girlfriend దగ్గర తన రచనల్లో మరీ నాసితనం చోటుచేసుకోవడం స్టార్టయింది… One Indian Girl లో తనేం రాశాడో తనకే తెలియదు… అది కాపీ నవల అనే విమర్శలూ వచ్చాయి… ఇక రచనల నడుమ భారీ గ్యాప్ తీసుకుంటూ… The Girl in Room 105, One Arranged Murder రాశాడు… రెండూ సౌరభ్, కేశవ్ అనే ఇద్దరు ప్రైవేటు డిటెక్టివ్ స్నేహితులు ఛేదించిన రెండు కేసుల కథలు… క్రైం ఇన్వెస్టిగేషన్… పెద్ద థ్రిల్లేమీ లేదు… ఇప్పుడు వచ్చిన 400 Days ఆ రెండు నాసిరకం పుస్తకాలకు సీక్వెల్ మాత్రమే…
డిటెక్టివ్ పుస్తకాలు మనకు కొత్తకాదు… అపరాధ పరిశోధన కేసుల దర్యాప్తులూ కొత్తకాదు… అప్పట్లో ఆ పుస్తకాల్ని జనం తెగచదివేవారు… చేతన్ భగత్ ఇప్పుడు ఆ జాబితాలోకి ఎక్కేశాడు… మూడు వరుస నవలలూ అవే… కాకపోతే ఈ డిటెక్టివ్‌లు కేవలం కేసులు దర్యాప్తు చేసి చేతులు దులుపుకునేరకం కాదు… వాళ్ల జీవితాలు కూడా ముడిపడిన నేరగాథలు అన్నమాట… 105వ నెంబరు గదిలో అమ్మాయి నవలలో కేశవ్, వన్ అరేంజ్డ్ మర్డర్ నవలలో సౌరభ్… తాము దర్యాప్తు చేసే కేసుల్లో తమ పాత్రలూ ఉంటాయి… సేమ్, 400 డేస్… క్లయింటుతో డిటెక్టివ్ కేశవ్ ప్రేమబంధం పెంచుకోవడం, తరువాత సగటు తెలుగు సీరియల్‌లో పాత్రలా త్యాగం చేయడం గట్రా కాస్త నవ్వు పుట్టించేలా సాగుతుంది… టూ స్టేట్స్ నవల సినిమాగా వచ్చాక చేతన్ రచనల్లో సినిమాకు పనికొచ్చే సరుకు నిండటం స్టార్టయింది… అదే కోణంలో కథల్ని నడిపిస్తున్నాడు… 400 డేస్ కూడా అంతే… కాకపోతే… పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు, వల విసిరే మృగాళ్లు, ఆడపిల్లల భద్రత ఎంత సున్నితంగా మారిందో కాస్త ఆసక్తికరంగా చెప్పగలిగాడు… ఇక మిగతాదంతా ఓ నాసిరకం వెబ్ సీరీస్ కథలా ఉంటుంది… కథలోకి వెళ్లడం లేదు, ఎందుకంటే… ఇలాంటి కథలకు సస్పెన్సే ప్రాణం కాబట్టి, అది ముందే చెప్పేస్తే పుస్తకం చదివేవాడికి ఇక ఇంట్రస్టు ఏమీ మిగలదు కాబట్టి…! (తెలుగులో సినిమాలకు సంబంధించిన ట్రెయిలర్లు, టీజర్లు, పోస్టర్ల మీద కూడా రివ్యూలు రాస్తుంటాం… ఇంట్రస్టింగ్ సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ మీద కూడా యూట్యూబ్ చానెళ్లలో, సైట్లలో స్టోరీలు, రివ్యూలు వస్తుంటయ్… కానీ పుస్తకాల మీద రివ్యూలు తక్కువ… చాలా తక్కువ… మెయిన్ స్ట్రీమ్‌లో కూడా రచయితలకు డప్పులు కొట్టడమే తప్ప ప్రత్యేకించి పుస్తకాల మీద సవివర సమీక్షలు కనిపించవు పెద్దగా….. ఈ కథనం జస్ట్, ఓ కామన్ రీడర్ కోణంలో సాగిన పైపైన రివ్యూ…)
Ads
Share this Article