ఇది చదవాల్సిన కథ… కాదు, నిజంగానే జరిగిన ఓ నేరం, దుర్మార్గం… ఈ కథలో చాలా విశేషాలున్నయ్… ఓ సినిమాకు, ఓ నవలకు సరిపడా సరుకు ఉంది… ఒక నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికత, సైన్స్ ఎలా సాయపడతాయో చెప్పడానికి నిజంగా ఇదొక కేస్ స్టడీ… నేరాన్ని గుర్తించడానికి కూడా…! పదండి కథలోకి వెళ్దాం… కేరళ… కొల్లంలోని అంచల్… సూరజ్‌కూ, ఉత్రకూ కొన్నాళ్ల క్రితం పెళ్లయింది… ఆమెకు కాస్త వైకల్యం, కట్నం బాగానే తీసుకున్నాడు… కానీ కొన్నాళ్లకు తనలోని మృగాడు పైకి లేచాడు, ఆమెను వదిలించుకుంటే మరో పెళ్లి, మరింత కట్నం అనుకున్నాడు… చాలా తెలివైనోడు… అందుకే ఓ ప్లాన్ వేశాడు… నేరుగా చంపేస్తే నేరం బయటపడుతుంది, శిక్ష, తల్నొప్పులు, జైలు ఎట్సెట్రా… తను వైల్డ్ లైఫ్ క్లబ్బులో మెంబర్, తనకు కొంత పాముల గురించి తెలుసు… అందుకని ఓ పాములోడి దగ్గర రక్తపింజర కొన్నాడు… భార్య పడుకుని ఉన్నప్పుడు ఆమెపైకి వదిలేశాడు… అది కాటేసింది…
కానీ ఆ విషం ఆమెను వెంటనే చంపేయలేదు… కాటేయగానే మెలకువ వచ్చిన ఆమె కాపాడండి, కాపాడండి అంటూ కేకలు వేసింది… పది మందీ వస్తుండటంతో ఇక తప్పనిసరై సూరజ్ ఆమెను తనే తీసుకెళ్లి హాస్పిటల్‌లో చేర్పించాడు… ఈసారి ఒక తాచుపామును కొన్నాడు… తను అనుకున్నట్టుగా కాటు వేయకపోతే ఖర్చు, ప్లాన్ వృథా అనుకున్నాడు… అందుకే ముందుగా కాస్త మత్తుమందును పళ్లరసంలో కలిపి ఆమెతో తాగించాడు, అంటే, పాము కాటేసినా ఆమె లేచి అరవలేదు, విషం పూర్తిగా ఎక్కి చచ్చిపోతుందని సూరజ్ ఉద్దేశం… తాచుపామును జస్ట్, ఆమెపైకి విసరలేదు… దాని తలను పట్టుకుని ఆమె దేహం మీద బలంగా కాటు వేయించాడు… అయిపోయింది, నరనరాల్లోకి జరజరా చరచరా పాకిన విషం ఆమెను చంపేసింది…
Ads
కేరళలోనే కాదు, భారతదేశం లో ఏటా లక్షల మంది పాముకాట్లతో మరణిస్తుంటారు… కానీ ఆల్‌రెడీ ఒక పాము కాటు, చికిత్స ఇంకా పూర్తిగాకుండానే మళ్లీ అదే ఇంట్లో మరో పాముకాటు… సూరజ్ తత్వం తెలిసిన ఉత్ర తండ్రి విజయసేన నేరుగా కొల్లం రూరల్ ఎస్పీ హరిశంకర్ దగ్గరకు వెళ్లాడు, తన సందేహాలు చెప్పాడు… అనుమానాస్పద మరణం కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు… పాము కాటుకు సాక్ష్యాలు లేవు, ఏ కోణంలో దర్యాప్తు చేయాలో అర్థం కాదు, క్లూ లెస్… కానీ దీన్ని ఎలాగైనా చేధించాలని ఓ సవాల్‌గా తీసుకున్న అక్కడి పోలీసు యంత్రాంగం సిట్, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది… వాళ్లకు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు సూరజ్ తనే ఒక పింజరను, ఒక తాచును కొన్నాడని..! ఇక అక్కడ మొదలైంది దర్యాప్తు, కేసు పెట్టగానే సరిపోదు, నిరూపించాలి… పర్‌ఫెక్ట్‌గా ఫిక్స్ చేయాలి…
హెర్పటాలజీ (సర్పశాస్త్రం), వెటర్నరీ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్, సైబర్ ఫోరెన్సిక్స్, డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఫార్మకాలజీ… ఇన్నిరకాల నిపుణులనూ ఇన్వాల్వ్ చేశారు… శాస్త్రీయంగా దర్యాప్తు జరిగింది… కొన్ని విశేషాలు…
- ఆమె కిటికీ తలుపులు, దర్వాజా మూసేసి, ఏసీ వేసుకుని పడుకుంది… సూరజ్ పాము వెంటిలేటర్ నుంచి వచ్చిందని బొంకాడు… కానీ ఆ ఇంట్లో ఉన్న వెంటిలేటర్ అంత ఎత్తుకు తాచు, పింజర వెళ్లవు… ఇదొక సందేహం…
- పింజర రకం పాములు కొల్లం ఏరియాలో సాధారణంగా ఎక్కువగా కనిపించవు… మరి జనావాసంలోకి ఎలా వచ్చింది అది… మరో సందేహం…
- తాచుపాములు సాయంత్రం 5 నుంచి 8 మధ్యే యాక్టివ్… రాత్రుళ్లు అటూఇటూ తిరగవు… ఉత్ర అప్పటికి పడుకోలేదు, పాము కాటేసింది లేటవర్స్‌లో అని సూరజ్ చెబుతున్నాడు… ఇంకొక సందేహం…
- సాధారణంగా తాచుపాముల కాటు ఎంత తీవ్రంగా ఉన్నా సరే… కోరలు 2 సెంటీమీటర్ల లోతుకే దిగుతాయి… కానీ ఇక్కడ అసాధారణంగా 2.3 నుంచి 2.5 వరకు లోతు కాట్లు కనిపిస్తున్నయ్… సీరియస్ సందేహం…
- ఆ గదిలో ఓ ప్లాస్టిక్ బాటిల్ దొరికింది, అందులో పాము పొలుసు కనిపించింది… తాచుపాము తనంతట తానే ప్లాస్టిక్ సీసాలోకి పోదు కదా, మరి ఈ పొలుసు..? ఇంకో సందేహం…
- అదే గది, అదే ప్లేసులో, అదే వ్యక్తి మీద జస్ట్, రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు పాముకాట్లేమిటి..? ఇదీ అరుదే… అనుమానించాల్సిందే…
ఆ పొలుసు డీఎన్ఏ పరీక్షకు పంపించారు… మరణించిన పాము డీఎన్ఏ, ఆ పొలుసు డీఎన్ఏ సరిపోలింది… అంటే ఎవరో కావాలని అందులో పామును తీసుకొచ్చారన్నమాట… కాటు గాయాలు లోతుగా ఉన్నాయీ అంటే కావాలనే ఎవరో పామును బాగా హ్యాండిల్ చేయగలిగిన వాడు దాని తలను పట్టుకుని కాట్లు బలంగా వేయించాడన్నమాట… అంతేకాదు, ఆ పామును వారంపాటు ఆకలితో ఉంచినట్టు తేలింది… మరి ఆకలితో వేసే కాటు బలంగా ఉంటుంది కదా… పోలీసులు సీన్ రీక్రియేట్ చేశారు, ఓ డమ్మీ దేహాన్ని పెట్టి, ఈ ఫోర్స్‌డ్ బైట్స్ థియరీని రికార్డ్ చేశారు… సూరజ్ ఫోన్ స్వాధీనం చేసుకుని, తన యాక్టివిటీ మొత్తం బయటికి తీశారు, రికార్డు చేశారు… ఈ పాముకాట్లకు ముందు సూరజ్ పాముకాట్లకు సంబంధించి బోలెడు వీడియోలు చూసినట్టు తేలింది… పట్టుకొచ్చారు, మర్యాద చేశారు… మొదట ఏదేదో బుకాయించినా, పోలీసులు చూపించిన శాస్త్రీయ ఆధారాలు చూశాక సూరజ్ మొహం మాడిపోయింది, ఇక అన్ని నిజాలూ కక్కేశాడు…
- ఇంత సంక్లిష్టమైన దర్యాప్తును కూడా సిట్ కేవలం 17 నెలల్లో పూర్తిచేసింది…
- కోర్టు పోలీసుల దర్యాప్తు తీరును తన తీర్పులో ప్రశంసించింది…
- మొదట పామును ఆయుధంగా వాడి ఆమె ప్రాణాలు తీసే ప్రయత్నం, తరువాత మరో పాము ద్వారా హత్య… కోర్టు రెండు శిక్షలు వేసింది…
- ఇలాంటి నేరగాళ్లపై సింపతీ అవసరం లేదనీ, శిక్షలో ఏమాత్రం తగ్గింపు అవసరం లేదనీ వ్యాఖ్యానించింది… (ఈమధ్యే ఇలాంటి కేసు రాజస్థాన్‌లో చోటుచేసుకుంది, కేసు సుప్రీం దాకా వెళ్లింది)
- నేరపరిశోధనలో రకరకాల సైన్స్, టెక్నాలజీలను ఎలా వాడుకోవాలో చెప్పేందుకు ఇదొక ఉదాహరణగా మారింది… అప్పుడప్పుడూ పోలీసులను కూడా మెచ్చుకునేట్టు చేసే ఇలాంటి సక్సెస్ కథల్ని పోలీసువర్గాలు ఎందుకు ప్రచారం చేసుకోవు..? నెగెటివ్ ఇమేజీ బలంగా ఉన్న తమ శాఖకు కాస్త పాజిటివిటీని ఎందుకు అద్దుకునే ప్రయత్నం చేయరు..? ఇదీ ఓ సందేహమే…!!
Share this Article