ఇదీ వార్తేనా..? అనొద్దు ప్లీజ్..! కాదేదీ వార్తకనర్హం…! ఒకాయన బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాడు… అంతే… అరె, ఆ ఏరియాకు అంతకన్నా మంచి వార్త ఏముంటది..? విలేఖరి అదే ఫీలయ్యాడు, సబ్ఎడిటరూ అదే ఫీలయ్యాడు… పత్రికలో కింది నుంచి మీది దాకా అందరూ అదే ఫీలయ్యారు… అలా ఫీలయ్యేది ఖచ్చితంగా వార్తే అవుతుంది… కావాలి..! ఎవడో దిక్కుమాలినోడు ఏదో పిచ్చి పార్టీ పెడతాడు, వార్త రాయడం లేదా ఏం..? ఓ పనికిమాలిన మీటింగ్ పెడతాడు, వార్త రాయడం లేదా ఫోటోలతో..? బండ్ల గణేషులు, కేేఏపాల్లు, రాంగోపాల్ వర్మలు కూడా వార్తల్లో వ్యక్తులవుతున్నప్పుడు ఓ కొత్త బార్ అండ్ రెస్టారెంట్ వార్త ఎందుకు కాకూడదు..? సరే… వార్త రాద్దాం సరే… కానీ ఏమని రాద్దాం… అదేమీ కొత్త థీమ్ హోటల్ కాదు… ఏదో కొత్తదనమూ లేకపాయె… కానీ వార్త రాయాలి… ఎలా..? ఓ సింపుల్ చిట్కా… ఆ హోటల్ పేరేంటి..? ఎర్రకారం…! అంతే ఆ పేరు మీద వార్త అల్లుకుపోతే సరి… డిఫరెంట్ కాన్సెప్ట్, పల్లె రుచులు, మనం మరిచిన మన రుచులు అంటూ నాలుగు పడికట్టు పదాలు పేర్చితే సరి… హమ్మయ్య, సరిపోయింది, మూడు కాలాలూ నిండింది… ఓ ఫోటో… మరి ఓనర్ ఫోటో, సూక్తులు లేకపోతే ఎలా..? అదీ యాడ్ చేసేద్దాం… ఎస్, వార్త అయిపోయింది…
మద్యం ప్రకటనలు ఇవ్వకూడదని నిషేధం ఉంది గానీ… బార్ అండ్ రెస్టారెంట్లకు ప్రచారం చేయొద్దని చెప్పలేదుగా… అవునూ, ఎర్రకారం చాలా టేస్టా..? టేస్టే అయి ఉంటుంది, లేకపోతే అలా రాయరు కదా… ఎర్రకారం అంటేనే స్పైసీ టేస్ట్… డౌటుంటే ఓసారి వార్త చదవండి… ఆ రెస్టారెంట్ మెనూ వరుసగా రాసేసి, ఇవే ఆ రుచులు, అభిరుచులు అనేసి ప్లేట్లు, స్పూన్లు దులుపుకుంది… నిజం… నమ్మడం లేదు కదా… నిజంగానే సగం వార్త ఆ హోటల్ మెనూయే… మా హోటల్లో ఫలానా ఫలానా డిష్‌లు దొరుకును అనే ప్రకటనలాగా..! అరుదైన రుచులైన రాగి సంగటి, గుత్తి వంకాయ కూర, కుర్మా కర్రీ కూడా దొరుకుతాయట ఇక్కడ… వావ్… అడ్రెస్ కూడా ఇచ్చారు, జుబ్లీ హిల్స్, వెంకటగిరి, రోడ్ నంబర్ 10… మరిచిపోయేరు సుమా… లొకేషన్ షేర్ చేసేవాళ్లేమో గానీ, ఇక్కడ ఆ చాన్స్ లేదు… అన్నట్టు, చివరలో ఆ హైలైట్ కూడా మరిచిపోకుండా చెప్పేశారు… విస్కీ, వోడ్కా, జిన్, టెకీలా, రమ్ కూడా వెరైటీల్లో లభిస్తాయిట… మరీ కొత్త కాన్సెప్టుతో… ఓ ఫీల్‌తో రాయబడిన ఈ ఎర్రకారం వార్త చదివి ఎవరూ ఫీల్ కావొద్దు సుమీ… టేస్ట్, టేస్ట్ ముఖ్యం…!! న్యూ టేస్ట్, న్యూస్ టేస్ట్… అదేలెండి, ఎర్రకారం భాషలో అయితే అభిరుచి అంటారు…!! అరెరె, వార్తలో ఆ ఒక్క వాక్యమూ వస్తే పరిపూర్ణంగా ఉండేది రెసిపీ… అదే… ‘‘టేస్టు మాత్రమే ఘాటు, రేటు మాత్రం చీపు’’..!!
Ads
Share this Article